Lakshmi On Kiran: జనసేన నేత కిరణ్ రాయల్ వ్యవహారం కొత్త మలుపు తిరుగుతోంది. బాధిత మహిళ నేరుగా సోమవారం మీడియా ముందుకు రావడంతో ఈ వ్యవహారం ముదిరిపాకాన పడింది. ఆయనపై సంచలన ఆరోపణలు చేశారామె. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆమె, గతంలో కొన్ని వీడియోలను బయటపెట్టింది.
ఎవరొచ్చినా తనను ఏమీ చేయలేరని, ఆ ధైర్యం ఆయనకు ఎలా వచ్చిందని ప్రశ్నించింది బాధిత మహిళ. కిరణ్ వెనుక జనసేన పార్టీ ఉండడమే కారణమా? అంటూ ప్రశ్నించింది. ఏ ఆడపడుచు కష్టమొచ్చినా పోరాడుతానని గతంలో పవన్ కల్యాణ్ చెప్పిన మాటలను ఈ సందర్భంగా గుర్తు చేసింది.
తాను రెండు రోజులుగా పోరాటం చేస్తున్నానని, కేవలం ఆ పార్టీ నుంచి ఒక్క నోటీసు మాత్రమే వచ్చిందన్నారు. పార్టీకి దూరంగా ఉండాలని మాత్రమే ఉందన్నారు. అంతేగానీ తనకు మద్దతుగా ఇంతవరకు ఎవరూ మాట్లాడలేదన్నారు. కిరణ్ తనను ఘోరంగా మాట్లాడుతున్నాడని, అవమానిస్తున్నాడని మీడియా ముందు కన్నీళ్లతో తన గోడు వెల్లబోసుకుంది.
తనకు ప్రాణహాని ఉందని, తన పిల్లలను చంపేస్తాడని బెదిరిస్తున్నాడని మనసులోని మాట బయటపెట్టిందామె. ఆదివారం కిరణ్ రాయల్ మీడియాతో మాట్లాడుతూ పదేళ్ల కిందట మనీ సెటిల్‌మెంట్ చేశామని చెప్పిన విషయాన్ని గుర్తు చేసింది లక్ష్మీరెడ్డి. తాను డబ్బుల కోసం అప్పుడు చేసినట్టయితే రెండేళ్ల కిందట బ్రాండ్ ఎందుకు రాసి ఇచ్చాడని ప్రశ్నించింది.
ALSO READ: తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో అరెస్టులు.. కొందరి నేతలతో జగన్ మంతనాలు!
2023లో ఈ బ్రాండ్ తనకు ఆయన ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఎవరైనా ఈ విషయాన్ని అడిగారా? పార్టీ అధికారంలో ఉందని కారణమా? ఒక మహిళకు అన్యాయం జరుగుతుంటే ఓ ఒక్కరూ సపోర్టు చేయలేదన్నారు లక్ష్మీరెడ్డి. కిరణ్ తోపాటు మిగతావాళ్లు తనను తప్పుగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.
నమ్మడం తాను చేసిన తప్పుగా వర్ణించింది లక్ష్మీరెడ్డి. కిరణ్ రాయల్ మాటలకే తాను మీడియా ముందుకు రావాల్సి వచ్చిందని తెలిపింది. తనకు ఏ పార్టీలతో సంబంధం లేదని, ఎవరూ తెలియదని చెప్పుకొచ్చింది. తనకు న్యాయం చేయాలంటూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మాజీ సీఎం జగన్‌ను వేడుకుంది.
తనను చంపినా, తన బిడ్డలకు న్యాయం జరిగేలా చేయాలని చేతులెత్తి వేడుకున్నారు. ఇలాంటి నీచుడ్ని వదలకూడదని పేర్కొంది. తన తర్వాత మరో బాధితురాలిని ఇంట్లోకి తీసుకెళ్లి కొట్టారని, ఆ మహిళ ఎవరికీ చెప్పుకోలేక, తనకు ఫోన్ చేసిందని గుర్తు చేసింది. ఇవన్నీ సాక్షాలు చూసిన తర్వాత ఆయనకు సపోర్టు చేయడం ఎంతవరకు సంమజసమని ప్రశ్నించారామె.