Tips For Black Pan: సాధారణంగా ప్రతి రోజూ వంటకాల తయారీ కోసం వివిధ రకాల పాత్రలను ఉపయోగిస్తుంటారు. ఈ మధ్య కాలంలో నాన్ స్టిక్ పాత్రల వాడకం చాలా వరకు పెరిగింది. నాన్ స్టిక్ కడాయి నుండి ప్రెషర్ కుక్కర్ వరకు ఇలా ప్రతిదీ ఉపయోగిస్తున్నారు. వీటిలో తక్కువ నూనె, మసాలాలతోనే ఆహారాన్ని తయారు చేసుకోవచ్చు. అంతే కాకుండా వీటిని శుభ్రపరచడం కూడా ఈజీ అనే చెప్పాలి. కానీ కొన్ని సందర్భాల్లో తక్కువ సమయంలో జిడ్డు మరకలు తొలగించడం కష్టంగా మారుతుంది. అంతే కాకుండా చాలా కాలం పాటు పాత్రలపై మురికి ఉన్నా కూడా.. అలాగే వాడితే త్వరగా పాడయిపోతాయి. ఇలా జరగకుండా నాన్ స్టిక్ పాత్రలు, అల్యూమినియం పాత్రలు ఎక్కువ కాలం పాడవకుండా ఉండాలంటే ఎప్పటికప్పుడు మురికి, జిడ్డును తొలగించాలి. మరి ఎలాంటి టిప్స్, పాత్రలపై ఉన్న జిడ్డు మరకలను తొలగిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
వెనిగర్ తో శుభ్రం చేయండి:
నాన్-స్టిక్, అల్యూమినియం పాత్రలను శుభ్రం చేయడానికి మీరు వెనిగర్ ఉపయోగించవచ్చు. దీని కోసం ఒక గిన్నెలో కాస్త నీరు తీసుకోండి. ఈ నీటిలో వెనిగర్, డిటర్జెంట్ కలిపి గ్యాస్ మీద ఉంచండి. ఈ నీరు మరిగేటప్పుడు, గ్యాస్ ఆపివేయండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని స్పాంజి సహాయంతో జిడ్డుగా ఉన్న నాన్-స్టిక్ పాత్రలపై తేలికగా రుద్దండి. మొండి మరకలైతే ఇలా 2-3 సార్లు చేస్తే చాలు మరకలు పూర్తిగా తొలగిపోతాయి. అంతే కాకుండా పాత్రలు కూడా కొత్త వాటిలా మెరుస్తాయి.
బేకింగ్ సోడాతో శుభ్రం చేయండి:
బేకింగ్ సోడా వాడటం వల్ల నాన్-స్టిక్ పాత్రల నుండి జిడ్డును ఈజీగా తొలగించవచ్చు. వేడి నీటిలో అవసరమైనంత వరకు బేకింగ్ సోడా కలపండి. ఇప్పుడు ఈ ద్రావణాన్ని నాన్-స్టిక్ పాత్రలపై పోసి కొంత సేపు అలాగే ఉంచండి. తర్వాత ఒక డిష్ వాష్ బార్ తీసుకుని రుద్దండి. పాత్రలపై పేరుకుపోయిన మురికిని దీంతో సులభంగా తొలగించవచ్చు. అంతే కాకుండా కొత్త వాటిలా మురిసేలా చేయవచ్చు.
డిటర్జెంట్‌తో శుభ్రం చేయండి:
నీటిలో కాస్త డిటర్జెంట్ కలిపి ద్రావణం తయారు చేయండి. ఇప్పుడు ఈ ద్రావణాన్ని జిడ్డుగా ఉన్న పాత్రలు, నాన్-స్టిక్ పాత్రపై పోసి కొంత సమయం అలాగే ఉంచి ఆపై డిష్ వాష్ బార్ సహాయంతో రుద్దండి. అనంతరం నీటితో శుభ్రం చేయండి. ఇలా చేయడం వల్ల జిడ్డు తొలగిపోతుంది. పాత్రలు కూడా తెల్లగా మెరిసిపోతాయి.
Also Read: ఈ టిప్స్ పాటిస్తే.. ఎంత నల్లగా ఉన్న గ్యాస్ బర్నర్స్ అయినా మెరిసిపోతాయ్
నిమ్మరసం:
ఉడికించిన నిమ్మకాయను కూడా నాన్ స్టిక్ పాత్రలపై ఉన్న జిడ్డును తొలగించడానికి ఉపయోగించవచ్చు. ఇందుకోసం 3-4 నిమ్మకాయలను తీసుకోండి. తర్వాత ఏ పాత్రను అయితే క్లీన్ చేయాలని అనుకుంటున్నామో దానిని వాటర్ తో నింపి స్టవ్‌పై పెట్టండి. తర్వాత మరిగే నీటిలో కట్ చేసిన నిమ్మకాయలను వేయండి. 10 నిమిషాల తర్వాత మంటను ఆపివేయండి. అనంతరం పాత్రను చల్లార్చి, స్పాంజ్ లేదా బ్రష్ సహాయంతో రుద్దండి. ఇలా చేయడం వల్ల పాత్రలపై ఉన్న మురికి పూర్తిగా తొలగిపోతుంది. అంతే కాకుండా తెల్లగా , కొత్త దానిలా మెరుస్తుంది.