Vijayasai Reddy: దిల్లీలో కూర్చుని విజయసాయిరెడ్డి మాట్లాడిన మాటలు వింటుంటే.. రాజకీయాల్లో ఏదీ శాశ్వతం కాదన్న విషయం మరోసారి గుర్తొస్తుంది. పరివర్తన రాజనీతి పార్టీ (పీఆర్‌పీ) అధ్యక్షుడిగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద చర్చకే దారితీశాయి. ముఖ్యంగా జగన్‌పై ఆయన చేసిన కామెంట్స్ చాలామందిని ఆలోచింపజేస్తున్నాయి.
కాంగ్రెస్‌కు జగన్ వెన్నుపోటు పొడిచారా?
విజయసాయి చెప్పిన దాని ప్రకారం చూస్తే.. వైఎస్సార్ పోయిన తర్వాత జగన్ సీఎం సీటు కోసం గట్టిగానే పట్టుబట్టారట. సోనియాగాంధీ ఆ అభ్యర్థనను ఒప్పుకోకపోవడంతోనే ఆయన కాంగ్రెస్‌కు, ఎంపీ పదవికి రాజీనామా చేశారని విజయసాయి గుర్తు చేశారు. అందుకే కాంగ్రెస్‌కు జగన్ వెన్నుపోటు పొడిచారని, అసలు వెన్నుపోటుదారు ఎవరో వైకాపా నేతలే తెలుసుకోవాలని ఆయన సూటిగా అన్నారు.
అవమానాలు.. కోటరీపై ఆవేదన
పార్టీని నిలబెట్టడానికి తాను పడిన కష్టం వల్లే నంబర్-2 పదవి వచ్చిందని, ఆయాచితంగా ఏమీ రాలేదని విజయసాయి స్పష్టం చేశారు. జగన్‌తో కలిసి జైలుకు కూడా వెళ్లిన విషయాన్ని గుర్తు చేస్తూ.. తర్వాత తనను ఎన్ని రకాలుగా అవమానించాలో అన్నీ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ వ్యవహారాల్లో సజ్జలకు రిపోర్ట్ చేయమని చెప్పడం, భాజపా-వైకాపా మధ్య అనుసంధానకర్తగా తనను తప్పించడం వంటి పరిణామాలతోనే బయటికొచ్చేశానని చెప్పారు. జగన్‌కు అన్నీ తెలిసే ఇదంతా జరిగిందని, చుట్టూ ఉన్న కోటరీ వల్ల బయటి విషయాలు ఆయనకు తెలియకుండా పోతున్నాయని అన్నారు.
కుటుంబ వ్యవహారం.. పీఆర్‌పీ బాట
వైఎస్ కుటుంబ వ్యవహారం గురించి తనకు, కేవీపీకే తెలుసని.. కానీ అన్ని విషయాలు బయటపెట్టడం కరెక్ట్ కాదని విజయసాయి అన్నారు. జగన్, షర్మిల ఆస్తుల పంపకాల విషయాన్ని వారి వ్యక్తిగత వ్యవహారంగానే చూస్తున్నట్టు చెప్పారు. ఇక తన కొత్త పార్టీ పీఆర్‌పీ విషయానికి వస్తే.. 1983లో తెదేపా అనుసరించిన విధానాలనే తాము ఫాలో అవుతామని, బడుగు బలహీనవర్గాల కోసం పనిచేస్తామని చెప్పారు. ఉగాది తర్వాత పాదయాత్ర కూడా చేస్తానని ప్రకటించారు.
Also Read: కూకట్‌పల్లి ట్రక్ పార్క్ వేలంలో కీలక మలుపు.. హైకోర్టు మెట్లు ఎక్కిన వివాదం!