Renigunta Temple: రేణిగుంట అంజనేయస్వామి ఆలయంపై వైసీపీ చేస్తున్న అసత్య ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. 70 ఏళ్ల క్రితం గ్రామస్తులు నిర్మించిన ఆలయానికి వెయ్యేళ్ల చరిత్ర ఉందంటూ భూమన కరుణాకర్ రెడ్డి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, మాజీ టీటీడీ చైర్మన్‌గా పనిచేసిన భూమన వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని ఫైర్ అయ్యారు. NH-716 రహదారి విస్తరణలో భాగంగా ఆలయానికి సంబంధించిన 10 సెంట్ల భూమిని సేకరించారు.
ఆలయానికి పరిహారంగా వచ్చిన రూ.59.30 లక్షలను ఆలయం పేరుతోనే ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశామని, ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కాలేదని అన్నారు. ఆలయ తొలగింపునకు ముందు ఆగమ శాస్త్ర సంప్రదాయాల ప్రకారం బాలాలయం ఏర్పాటు చేసి మూలవిరాట్‌ను తరలించామని, మిగిలిన స్థలంలో ఆలయ పునర్నిర్మాణంతో పాటు కొత్త ఆలయ నిర్మాణానికి 50 సెంట్ల స్థలాన్ని కేటాయించామని అన్నారు. ఆలయాల పరిరక్షణ గురించి మాట్లాడుతున్న వైసీపీ నేతలు తమ ఐదేళ్ల పాలనలో జరిగిన ఘటనలకు సమాధానం చెప్పాలని, అంతర్వేది రథం దగ్ధమైనప్పుడు వైసీపీ ప్రభుత్వం ఏం చేసింది అని ప్రశ్నించారు.
విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో వెండి సింహాలు మాయమైనప్పుడు ఎక్కడికి వెళ్లారు? రామతీర్థంలో శ్రీరాముడి విగ్రహం ధ్వంసమైనప్పుడు తీసుకున్న చర్యలేంటి అధికారంలో ఉన్నప్పుడు ఒకలా.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరోలా మాట్లాడటం వైసీపీ ద్వంద్వ వైఖరి అని మంత్రి ఫైర్ అయ్యారు. రాజకీయ ఉనికి కోసం దేవాలయాలను వివాదాల్లోకి లాగవద్దు. భక్తుల మనోభావాలతో చెలగాటమాడొద్దని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఆలయాల అభివృద్ధి, హిందూ ధర్మ పరిరక్షణకు పెద్దపీట వేస్తోందని అన్నారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే అధికారిక రికార్డులతో ప్రజల ముందు వాస్తవాలు బయటపెడతామని అన్నారు.
Also read: శర్వానంద్ సినిమా కోసం ఇంత ఖర్చు చేశారా? భోగి బడ్జెట్ తెలిస్తే షాక్!