Illegal Sand Mining: కడప జిల్లాలో జరుగుతున్న అక్రమ ఇసుక తవ్వకాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా పెన్నా నదిలో సాగుతున్న అక్రమ తవ్వకాలు.. ఈ క్రమంలో జరిగిన తాగునీటి పైప్‌లైన్ ధ్వంసం ఘటనను ఆయన చాలా సీరియస్‌గా తీసుకున్నారు. ఈ వ్యవహారంపై తక్షణమే పూర్తిస్థాయి నివేదిక అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించినా, అక్రమ మైనింగ్‌కు పాల్పడినా ఎవరినీ ఉపేక్షించవద్దని సీఎం స్పష్టం చేశారు.
ప్రొద్దుటూరు మండలం సోములవారిపల్లి వద్ద జరిగిన అక్రమ ఇసుక తవ్వకాలపై అధికారులు ముఖ్యమంత్రికి వివరణ ఇచ్చారు. ఇసుకాసురుల ఆగడాల వల్ల తాగునీటి పైప్‌లైన్ ధ్వంసమైన విషయాన్ని సీఎంకు వివరించారు. సమాచారం అందిన వెంటనే రంగంలోకి ఆ ప్రాంతంలో అక్రమ తవ్వకాలను, ఇసుక రవాణాను పూర్తిగా నిలిపివేసినట్లు సీఎం తెలిపారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా యుద్ధప్రాతిపదికన పైప్‌లైన్‌కు మరమ్మతులు పూర్తి చేసి, తాగునీటి సరఫరాను పునరుద్ధరించినట్లు వెల్లడించారు.
అక్రమ ఇసుక రవాణాకు ఉపయోగించిన ట్రాక్టర్లను గుర్తించి, వాటి యజమానులపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై ఇప్పటికే ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదు చేసిన పోలీసులు.. లోతైన దర్యాప్తు చేపట్టారు. ముఖ్యంగా ప్రజల దాహార్తిని తీర్చే తాగునీటి పైప్‌లైన్‌ను ధ్వంసం చేసిన నిందితులపై కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి.. చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు.
Also Read: ‘బయటకు వెళ్దాం.. నేను చెప్పిన బట్టలు వేసుకో’.. విద్యార్థినికి టీచర్ అసభ్యకర మెసేజ్‌లు!
తాగునీటి పైప్ లైన్ ధ్వంసం నేపథ్యంలో భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టింది. పెన్నా, చిత్రావతి నదీ తీర ప్రాంతాల్లో అక్రమ ఇసుక రవాణాను ఎక్కడికక్కడ అడ్డుకునేందుకు ప్రత్యేక చెక్‌పోస్టులను ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాకుండా అక్రమ మైనింగ్‌ను నియంత్రించేందుకు జిల్లా, మండల స్థాయిలలో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసి, నిరంతర నిఘా ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Also Read: ఢిల్లీలో మరో ఘోరం.. కేఫ్‌లో యువతిపై సామూహిక అత్యాచారం.. తోటి ఉద్యోగులే కీచకులు!