Vijayasai Reddy: విజయసాయిరెడ్డి రూటు మార్చారా? అదిగో ఇదిగో పార్టీ అంటూ కాలం గడిపేస్తున్నారా? ప్యాలెస్ నుంచి వచ్చిన సంకేతాలు ఆయన వెనక్కి తగ్గారా? అందుకే వైద్యం పేరిట కొద్దిరోజులు సైలెంట్ అవ్వాలని డిసైడ్ అయ్యారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్న వేళ, మరొక ట్వీట్ చేశారు. తనను తాను బాల్ ఠాక్రేతో పోల్చుకున్నారు.
ఏపీ ప్రజలకు విజయసాయిరెడ్డి గురించి చెప్పాల్సిన పని లేదు. ఆయన రాజకీయాలు విచిత్రంగా, ఎవరూ ఊహించని విధంగా ఉంటాయని చెబుతారు. అందుకే నేటి రాజకీయాల్లో ఆయన్ని శకునిగా చాలామందిని వర్ణిస్తుంటారు పలువురు రాజకీయ నేతలు. అదిగో.. ఇదిగో కొత్త పార్టీ అంటూ కాలం గడిపేస్తున్నారు. కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర, రాయలసీమలో మీడియా సమావేశాలు పెట్టి తన వాయిస్‌ను బలంగా వినిపించారు. రెడ్డి కమ్యూనిటీకి తాను అసలైన నేత అని చెప్పుకునే ప్రయత్నం చేశారు.. చేస్తున్నారు కూడా.
సీమలో జరిగిన మీడియా సమావేశంలో వైసీపీని, ఆ పార్టీ అధినేత జగన్ వ్యవహారశైలిని ఆయన పూర్తిగా తప్పుబట్టారు. గతంలో జరిగిన రెండు మీడియా సమావేశాల కంటే, కాస్త దూకుడు ప్రదర్శించారు. సీమ నుంచి ఎలాంటి వార్నింగ్ లు వచ్చాయో తెలీదుగానీ, మంగళవారం నుంచి వారం రోజుల పాటు ఆయుర్వేద చికిత్స నిమిత్తం వెళుతున్నానని ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు. స్థానికసంస్థల ఎన్నికల కోడ్ తర్వాత పార్టీ ప్రకటిస్తానని మనసులోని మాట బయపెట్టారు.
ఎక్స్‌లో ఈ ట్వీట్ పెట్టి 24 గంటలు గడవకముందే మరొక పోస్టు పెట్టారు. ఈసారి తనను తాను బాల్‌ఠాక్రేగా వర్ణించుకున్నారు. పార్టీ పేరు, జెండా, ఎజెండా ఈ పవిత్ర దసరా పర్వ దినాల్లో సిద్ధం అవుతున్నానని రాసుకొచ్చారు. నేను పార్టీ పెట్టరాదని కోరుకుంటున్న వారు చేస్తున్న చౌకబారు ప్రచారాలకు ఎలాంటి విలువా ఉండదని తేల్చేశారు. రెండు రాజకీయ కుటుంబ పార్టీల మీద తిరుగుబాటుగా, ప్రతి ఒక్క నియోజకవర్గంలోనూ మెరికల్లాంటి కొత్త నాయకత్వం తయారు చేస్తానని మనసులోని మాట బయటపెట్టారు.
ALSO READ: పబ్‌లో ఏపీ ఐఏఎస్ అధికారి వీరంగం.. పోలీసు అధికారులపై దూషణలు, ఎవరా ఆ అధికారి?
అంతేకాదు మరొక మాట కూడా చెప్పారు. అధికారం తనకు వద్దని, జెన్-జీల చేతుల్లో ఉంటుందని తేల్చేశారు. తనది కేవలం మహారాష్ట్రలో గతంలో శివసేన అధినేత బాల్‌ఠాక్రే పోషించిన పాత్ర అని తేల్చేశారు. ఒక్కమాటలో చెప్పాలంటే తనను తాను బాల్‌ఠాక్రేగా ఆయన అభివర్ణించుకున్నారు. నిన్న ఒకలా పోస్టు.. మంగళవారం మరొకలా పోస్టు చేయడంతో ఇంతకీ విజయసాయిరెడ్డికి ఏమైందంటూ వివిధ రాజకీయ పార్టీల నేతలు చర్చించుకుంటున్నారు.
పార్టీ పేరు, జెండా, ఎజెండా ఈ పవిత్ర దసరా పర్వ దినాల్లో సిద్ధం అవుతున్నాయి. నేను పార్టీ పెట్టరాదని కోరుకుంటున్న వారంతా చేస్తున్న చౌకబారు ప్రచారాలకు ఎలాంటి విలువా ఉండదు. రెండు కుటుంబ పార్టీలమీద తిరుగుబాటుగా, ప్రతి ఒక్క నియోజకవర్గంలోనూ మెరికల్లాంటి కొత్త నాయకత్వం తయారు చేస్తా.…
— Vijayasai Reddy V (@VSReddy_MP) October 13, 2026