విజయవాడ లయోలా కాలేజీ వద్ద వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం నిరసన చేపట్టారు. ప్రతిరోజుల కళాశాల మైదానంలో వాకర్స్ వాకింగ్ చేస్తుంటారు. అయితే నేడు గేటు లోపలికి అనుమతించకపోవడంతో ఆగ్రహానికి గురైన వాకర్స్ గేటు ముందు ధర్నాకు దిగారు. వెంటనే తమను లోపలికి అనుమతించాలని డిమాండ్ చేశారు. గత 25 సంవ్సరాలుగా నగరవాసులు లయోలా కాలేజీ వాకర్స్ పేరుతో మైదానంలో వాకింగ్ చేస్తున్నట్టు చెబుతున్నారు. దాదాపు మూడు వేల మంది సభ్యులతో వాకర్స్ ఉందని తెలిపారు.
అయితే కరోనా సమయంలో కళాశాల గేటును మూసి వేశారు. అప్పటి నుండి వాకింగ్ ట్రాక్ తెరవాలని అసోసియేషన్ వాళ్లు ఒత్తిడి తెస్తూనే ఉన్నారు. ఈ విషయం ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లినా సమస్య పరిష్కారం అవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు మాత్రమే కళాశాలలో వాకింగ్ కు అనుమతిస్తున్నారని తెలిపారు.
ఎన్నికల సమయంలో కూటమి సర్కార్ అధికారంలోకి వస్తే వాకర్స్ కు అనుమతి ఇచ్చేలా చూస్తామని, వాకింగ్ ట్రాక్ తెరిపిస్తామని నేతలు హామీ ఇచ్చారన్నారు. ఈ క్రమంలోనే చాలా సార్లు వాకింగ్ ట్రాక్ తెరవాలని కళశాల యాజమాన్యాన్ని ఎన్నిసార్లు కోరినా అనుమతి నిరాకరిస్తుండటంతో కళాశాల ముందు ధర్నా చేశారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సీనియర్ సిటిజన్లు, నగర వాసుల ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు వాకర్స్ ను అనుమతించాలని డిమాండ్ చేశారు. చివరికి గేటు తాళాలు పగలగొట్టి లోపలకి వెళ్లి వాకింగ్ చేశారు.