సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల గ్రామంలో జగన్ పర్యటన వివాదాలమయంగా మారిన సంగతి తెలిసిందే. అదే రోజు వాహనం ఢీకొని ఒకరు, అస్వస్థతకు గురై మరొకరు మరణించారు. ఈ రెండు మరణాలకు జగనే కారణం అని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఏడాది క్రితం చనిపోయిన వ్యక్తి విగ్రహం పెట్టేందుకు సత్తెనపల్లి వచ్చిన జగన్, ఇద్దరు అమాయకుల ప్రాణాలను పొట్టనపెట్టుకున్నారని అంటున్నారు. అయితే ఆ మరణాలకు, జగన్ పర్యటనకు సంబంధం లేదనేది వైసీపీ నేతల వాదన. సింగయ్య అనే వ్యక్తి ప్రమాదంలో చనిపోయాడు. నిన్నటి వరకు పోలీసులు కూడా వైసీపీ శ్రేణిలో అనుమతిలేని వాహనం ఢీకొనడం వల్ల ప్రమాదం జరిగిందని అనుకున్నారు. కానీ ఈరోజు ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జగన్ కారు కిందే సింగయ్య నలిగిపోయినట్టు ఆ వీడియోలో ఉంది.
జగన్ వాహనం ఢీకొనే సింగయ్య మృతి.. వెలుగులోకి మరో వీడియో
జగన్ పర్యటనలో సింగయ్య మృతికి సంబంధించి మరో వీడియో వెలుగులోకి వచ్చింది. ఇటీవల రెంటపాళ్ల పర్యటనలో జగన్ కారు కింద పడి చీలి సింగయ్య మృతి చెందినట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. కారు కింద వృద్ధుడు పడినట్లు స్థానికులు… pic.twitter.com/w0kskOftUd
— ChotaNews App (@ChotaNewsApp) June 22, 2025
జగన్ రెంటపాళ్ల పర్యటనకు సంబంధించిన వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జగన్ కారు ముందు టైర్ కింద సింగయ్య పడిన దృశ్యాలు ఈ వీడియోలో ఉన్నాయి. కారు కింద వృద్ధుడు పడినట్లు స్థానికులు అరిచారు. అయితే జగన్ వాహనం వెంటనే ఆగలేదు, వేగంగా ముందుకెళ్లింది. దీంతో ఆ వాహనం ముందుటైరు కింద సింగయ్య పడి నలిగిపోయినట్టు ఆ వీడియోలో ఉంది.
పబ్లిసిటీ స్టంట్ కోసం ప్రజల ప్రాణాలను గాల్లో కలుపుతున్నారంటూ జగన్ పై మండిపడ్డారు మంత్రి గొట్టిపాటి రవికుమార్. జగన్ కారు కిందపడి వృద్ధుడు సింగయ్య మరణించినట్టుగా వైరల్ అవుతున్న వీడియోపై మంత్రి స్పందించారు. బలప్రదర్శనకోసం జనంలోకి వచ్చిన జగన్ జనం ప్రాణాలను తీస్తున్నారని మండిపడ్డారు. జగన్ మాదిరిగా దేశంలో ఏ ఒక్కరూ ప్రచారం కోరుకోరు అని అన్నారు గొట్టిపాటి. జగన్ కారు కింద సొంత పార్టీ కార్యకర్త పడితే.. పక్కకు ఈడ్చేసి వెళ్లిపోయారని, తన కారుకింద పడి వృద్ధుడు చనిపోయినా జగన్ కి పశ్చాత్తాపం లేదన్నారు.
ఇక వైసీపీ వెర్షన్ మరోలా ఉంది. సింగయ్య రోడ్డు ప్రమాదంపై టీడీపీ కుట్ర రాజకీయానికి తెర తీసిందని అంటున్నారు వైసీపీ నేతలు. జగన్ వాహనం ఢీ కొనలేదని ప్రమాదం జరిగిన వెంటనే గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ ప్రకటించిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. ఏటుకూరు ఆంజనేయ స్వామి బొమ్మ దగ్గర ఈ ప్రమాదం జరిగిందని స్వయంగా ఎస్పీ చెప్పారని, టాటా సఫారీ వాహనం ఢీకొన్నట్టుగా కూడా ఆయన ప్రకటించారని, ఇప్పుడీ కొత్త వీడియో ఎక్కడిదని వారు నిలదీస్తున్నారు. టాటా సఫారీ ఢీకొని సింగయ్య మరణించాడని స్వయంగా ఎస్పీ చెప్పిన నాలుగు రోజులు తర్వాత టీడీపీ కుట్రకు తెరలేపిందని అంటున్నారు వైసీపీ నేతలు.
కొత్తగా బయటకు వచ్చిన వీడియోపై పోలీసులు అధికారికంగా స్పందించాల్సి ఉంది. ఆ వీడియోలో ఉన్నది సింగయ్యేనా, మరో వ్యక్తా, ఒకవేళ అది సింగయ్యే అయితే ఆ గాయాలతోనే అతను చనిపోయాడా అనేది పోలీసులు ధృవీకరించాల్సి ఉంది. ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో జగన్ కి, వైసీపీకి మరింత డ్యామేజీగా మారింది.