Visakhapatnam Data Center: విశాఖపట్నంలో ప్రతిపాదిత హైపర్ స్కేల్ డేటా సెంటర్ నిర్మాణానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. దేవదాయ భూముల కేటాయింపును సవాల్ చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం, ఈ ప్రాజెక్టు భవిష్యత్తుపై స్పష్టతనిస్తూ కొన్ని ముఖ్యమైన షరతులను విధించింది.
సొంత రిస్క్‌తోనే నిర్మాణం
డేటా సెంటర్ నిర్మాణం కొనసాగించుకోవచ్చని స్పష్టం చేసిన ధర్మాసనం, అది పూర్తిగా కంపెనీ ‘సొంత రిస్క్’పైనే ఆధారపడి ఉంటుందని పేర్కొంది. ఈ ప్రాజెక్టు తుది రూపు కోర్టు వెలువరించే చివరి తీర్పునకు లోబడే ఉంటుందని తేల్చి చెప్పింది. ఒకవేళ భవిష్యత్తులో తీర్పు వ్యతిరేకంగా వస్తే, తాము భారీగా పెట్టుబడులు పెట్టామని చెప్పి ఎలాంటి మినహాయింపులు లేదా ఈక్విటీ కోరడానికి వీలులేదని స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది.
పర్యావరణ నిబంధనలు, కౌంటర్ దాఖలు
నిర్మాణ పనులన్నీ పర్యావరణ నిబంధనలకు కట్టుబడి జరగాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసులో తమ వాదనలను వినిపిస్తూ సమగ్ర కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని హైపర్ స్కేల్ డేటా సెంటర్ యాజమాన్యానికి సూచించింది. పర్యావరణ అనుమతులను సవాల్ చేస్తూ నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ (NGT)లో పిటిషన్ పెండింగ్‌లో ఉన్నప్పటికీ, హైకోర్టులో పిల్ విచారణ కొనసాగించడానికి అది ఎలాంటి అడ్డంకి కాదని ధర్మాసనం అభిప్రాయపడింది.
దేవదాయ భూముల కేటాయింపుపై వివాదం
అడవివరం, ముడసర్లోవ గ్రామాల పరిధిలో ఉన్న సుమారు 160 ఎకరాల దేవదాయ భూములను ఈ డేటా సెంటర్‌కు కేటాయించడాన్ని సవాల్ చేస్తూ కోర్టులో ఈ పిల్ దాఖలైంది. దీనిపై తదుపరి విచారణను కొనసాగిస్తూ, ప్రభుత్వం, సంబంధిత కంపెనీల నుంచి వివరణ కోరింది. కోర్టు ఇచ్చిన ఈ ఆదేశాలతో ప్రాజెక్టు నిర్మాణం ముందుకు సాగుతున్నప్పటికీ, తుది తీర్పు వచ్చే వరకు ఈ పెట్టుబడులపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంటుంది.