BJP vs TDP: ఏపీలో కూటమి సిగపట్లు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. పార్టీలలో చేరికలు ఏమో కానీ, సిగపట్లు పెద్ద చిక్కులే తెస్తున్నాయట ఆ పార్టీల అగ్ర నాయకులకు. ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన ఓ నేత, బీజేపీలో చేరారు. అది కూడా బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి సమక్షంలో చేరడం విశేషం. దీనితో వైజాగ్ కూటమిలో యుద్ధ ప్రాతిపదికన చీలికలు బయటపడుతున్నాయని టాక్.
ఇటీవల విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి ఆనంద్ కుమార్, యలమంచిలి మున్సిపల్ చైర్ పర్సన్ రమాకుమారి లు వైసీపీ కి రాజీనామా చేశారు. ఎన్నికల అనంతరం రాజీనామాలు చేసిన వీరు, మొన్నటి వరకు సైలెంట్ గా ఉన్నారు. ఇప్పుడు మాత్రం రాజకీయ చాతుర్యం ప్రదర్శించి అధికార కూటమిలో చేరాలని నిర్ణయించుకున్నారు. అది కూడా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సేఫ్ అనుకున్నారో ఏమో గానీ ఆనంద్ కుమార్, రమాదేవి లు బీజేపీ కండువా కప్పుకున్నారు. దగ్గుబాటి పురంధేశ్వరి వీరికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా స్వాగతం పలికారు.
ఇప్పుడు ఇదే ఇక్కడ పొలిటికల్ వార్ కు దారి తీసింది. కూటమిలో భాగమైన బీజేపీ ఒక్క మాట కూడా చెప్పకుండా, కూటమి ఓటమి కోసం తాపత్రయ పడ్డ వారిని పార్టీలో ఎలా చేర్చుకుంటారని స్థానిక టీడీపీ నాయకులు గరం అవుతున్నారట. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి హోదాలో గల చింతకాయల విజయ్ ఈ విషయంపై సీరియస్ కామెంట్స్ చేసినట్లు తెలుస్తోంది.
పార్టీలు మారాలనుకునే వాళ్లను కూటమి నాయకుల అభిప్రాయాలను తీసుకోకుండా జాయినింగ్ చేసుకోవడంతో నాయకుల్లో చిచ్చు రోజురోజుకు అధికమవుతుందట. పురందేశ్వరి పోటీ చేసిన పార్లమెంటులో ఆమెకు తెలియకుండా, వ్యతిరేకంగా పనిచేసిన వాళ్లను టీడీపీ లోకి ఆహ్వానిస్తే ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలంటూ కూడా టీడీపీ నేతలు యమ ఫైర్ అవుతున్నారట. కూటమిలో ఉన్నప్పుడు అన్ని పార్టీలు పరస్పరం సహకరించుకుంటూ, కమ్యూనికేట్ చేసుకోవడం అవసరం అంటూ చింతకాయల విజయ్ కరఖండిగా చెప్పినట్లు సమాచారం.
Also Read: Living In Relationship: పెళ్ళికి ముందే సహజీవనం చేస్తే.. ఆ జంట విడాకులు తీసుకునే అవకాశాలు తగ్గుతాయా?
ఈ కామెంట్స్ తో స్థానిక బీజేపీ నేతలు కూడా అదే రీతిలో స్పందిస్తున్నారట. మా పార్టీలో చేరికలపై ఇతర పార్టీల నేతలతో చర్చించాల్సిన అవసరం లేదని, అది పార్టీ వ్యవహారమంటూ తేల్చి చెప్పేస్తున్నారు. మొత్తం మీద వైజాగ్ పాలిటిక్స్ ఇప్పుడు హాట్ హాట్ గా మారాయి. బీజేపీలో చేరికలు ఆ పార్టీ వ్యక్తిగత వ్యవహారం కాగా, విజయ్ కామెంట్స్ ఇప్పుడు కొత్త చిక్కులు తెచ్చే స్థితిలో ఉన్నాయని పొలిటికల్ టాక్. టీడీపీ అధిష్టానం కూడా ఈ వ్యవహారంపై దృష్టి సారించి, లుకలుకలకు ఫుల్ స్టాప్ పెట్టాలని హితభోద చేసినట్లు సమాచారం.