YS Sharmila : ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలతో మాజీ మంత్రి వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీత ఇడుపులపాయలో భేటీ అయ్యారు. కడప పర్యటనలో ఉన్న షర్మిలను ఆమె ఇడుపులపాయ ఎస్టేట్‌లో కలిశారు. గత కొన్ని రోజులుగా ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. షర్మిల పీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వైఎస్ సునీత ఆమెను మొదటిసారిగా కలిసింది.
వైఎస్ సునీత రాజకీయ ప్రవేశంపై ఈ భేటీలో చర్చ జరగినట్లు తెలుస్తోంది. అలాగే తన తండ్రి హత్య కేసుపై చర్చించినట్లు సమాచారం. వివేకా హత్య కేసులో సునీతకు న్యాయం జరగాలని పలుమార్లు షర్మిల డిమాండ్ చేశారు. రాజకీయంగా వారిని ఎదుర్కునేందుకు సునీత కాంగ్రెస్‌లో చేరి ఎన్నికల బరిలో దిగతారని ప్రచారం జరుగుతోంది.
ఇక వివేకా హత్యపై సునీత మొదటి నుంచి గట్టి పోరాటమే చేస్తున్నారు. కోర్టును ఆశ్రయించి సీబీఐ విచారణ కోరడం.. ఆ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి రావడం తెలిసిందే. వివేకా హత్య కేసుకు సంబంధించి ఇప్పటికే పలువురు అరెస్టు అయ్యారు. కడప ఎంపీ అవినాష్‌రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నారు. భాస్కర్ రెడ్డితో పాటు ఇతరులు చంచల్‌గూడ జైలులో రిమాండు ఖైదీలుగా ఉన్నారు. అవినాష్‌రెడ్డి బెయిల్‌పై ఉన్నారు. దీనిపై సునీత సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేస్తున్నారు. ఆ తర్వాత షర్మిలతో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా భేటీ అయ్యారు.