Vizag Steel Plant Workers Maha Padayatra(Latest news in Andhra Pradesh): విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు మళ్లీ ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తున్నారు. ఉక్కు కార్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తాజాగా మరోసారి ఆందోళనలకు దిగారు. స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మహా పాదయాత్ర చేపట్టారు.
విశాఖపట్నంలోని కూర్మన్నపాలెం దీక్షా శిబిరం నుంచి స్టీల్ ప్లాంట్ కార్మికులు మహా పాదయాత్ర ప్రారంభించారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు పాదయాత్ర సాగింది. స్టీల్ ప్లాంట్ కార్మికులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఈ పాదయాత్రలో పాల్గొన్నారు. టీడీపీ, వాపపక్షాల నేతలు కార్మికులకు మద్దతుగా పాదయాత్ర చేశారు.
మరికొద్ది రోజుల్లోనే సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. ఏపీ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు ప్రచారం ముమ్మరం చేస్తున్నాయి. ఓటర్లకు హామీలు గుప్పిస్తున్నాయి. ఇదే సమయంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం ఈ ఎన్నికల్లో కీలకంగా మారింది.
Read More: ఏపీ సెక్రటేరియట్ తాకట్టుపై చంద్రబాబు ఫైర్.. నీకు సిగ్గుందా జగన్ రెడ్డి అంటూ..
ఎన్నికలు సమీపిస్తున్న వేళ స్టీల్ ప్లాంట్ కార్మికులు ఉద్యమాన్ని ఉద్ధృతం చేసేందుకు సిద్ధమయ్యారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని రాజకీయ పార్టీలు స్పష్టమైన ప్రకటన చేయాలని ఉక్కు కర్మాగారం కార్మిక సంఘాల నేతలు కోరుతున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఈ అంశాన్ని చేర్చాలని డిమాండ్ చేస్తున్నారు.
కేంద్రం విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేస్తామని ప్రకటించినప్పటి నుంచి కార్మికులు నిరసనలు చేస్తున్నారు. చాలా కాలం నుంచి పోరాటం కొనసాగిస్తున్నారు. గతంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. ఢిల్లీ వరకు వెళ్లి ఉద్యమించారు. వివిధ రాజకీయ పక్షాల మద్దతు కోసం ప్రయత్నించారు.
కార్మికుల ఉద్యమం ప్రభావం వల్ల స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం వేగంగా కార్యరూపం దాల్చలేకపోయింది. ఇప్పుడు ఎన్నికల సమీపిస్తున్న వేళ వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికులు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ఉద్యమాన్ని ఉద్ధృతం చేయడానికి ఇదే సరైన సమయం అని భావిస్తున్నారు. అందుకే మరోసారి పోరుబాట పట్టారు.
ఎన్నికల వేళ ప్రజలకు హామీల వర్షం కురిపిస్తున్న పార్టీలు.. స్టీల్ ప్లాంట్ పై తమ వైఖరిని స్పష్టంగా చెప్పాల్సిన పరిస్థితి ఎదురైంది. ముఖ్యంగా ఏపీలోని అధికార , ప్రతిపక్ష పార్టీలు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకమని చెబుతున్నాయి. బీజేపీపైనే ఒత్తిడి ఉంది. ఆ పార్టీ పెద్దలు స్టీల్ ప్రైవేటీకరణపై క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. మరి బీజేపీ ప్రైవేటీకరణపై ముందుడుగే వేస్తుందా? పునరాలోచనలో పడుతుందా అనేది చూడాలి.