Vizianagaram District News: గ్రామాలలో రోడ్లు అధ్వాన్నంగా ఉంటే, నిరసనలు తెలియజేయడం పరిపాటి. సాధారణంగా రహదారిలో నిల్వ నీటిలో నాట్లు నాటడం, నీటిలో నిలబడడం ఒంటి కార్యక్రమాలతో నిరసనలు తెలియజేస్తుంటారు. కానీ ఇక్కడ వినూత్న రీతిలో రహదారి గుంతల మయంగా ఉందంటూ నిరసన తెలిపారు. అది కూడా ఎలాగో కాదు.. ఏకంగా డ్రోన్ కెమెరాతోనే నిరసన తెలిపారు. ఈ ఘటన విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది.
విజయనగరం జిల్లా వంగర మండలం కొండవలస గ్రామం నుండి భాగెమ్మపేట వరకు సుమారు 10 గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాలకు వెళ్లే రహదారి నిరంతరం గుంతలమయం కావడం విశేషం. 2010 నుండి ఇప్పటివరకు కూడా రహదారి గుంతల మాయం కావడంతో వాహనాదారులు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. రాత్రివేళ ఈ రహదారిలో ప్రయాణించాలంటే ఎన్నో ఇబ్బందులు తప్పవు.
ఈ రహదారిలో రాకపోకలు సాగించే వాహనదారులు పలుమార్లు ప్రమాదాల బారిన పడిన ఘటనలు కూడా ఉన్నాయట. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధ్వాన్నంగా ఉన్న రహదారులను మరమ్మత్తులు చేస్తున్న నేపథ్యంలో, తమ గ్రామ రహదారి గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని అక్కడ యువకులు భావించారు. అయితే వినూత్నంగా నిరసన తెలిపితే ప్రభుత్వం తమ సమస్యను పరిష్కరిస్తుందన్న ధోరణితో యువకులు వినూత్నంగా తమ నిరసన తెలిపి, రహదారిని అభివృద్ధి పరచాలని డిమాండ్ చేశారు.
Also Read: AP Govt: ఏపీ రైతులకు గుడ్ న్యూస్.. సంక్రాంతి కానుక అదిరింది కదూ!
డ్రోన్ కెమెరాను ఉపయోగించి, నూతన రహదారి నిర్మించాలని కోరుతూ ఆ రహదారిలో ప్లకార్డును వారు ప్రదర్శించారు. గుంతల రోడ్డుతో తాము ఎన్నో ఏళ్లుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, వెంటనే ప్రభుత్వం స్పందించి తమ గ్రామాలకు రహదారి నిర్మించాలంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తం మీద డ్రోన్ కెమెరాతో నిరసన తెలిపిన యువకుల వినూత్న నిరసనకు ప్రభుత్వం నుండి ఏ మేరకు స్పందన వస్తుందో వేచి చూడాలి