Handri-Neeva Project: శ్రీశైలం బ్యాక్ వాటర్ ద్వారా హంద్రీనీవా కాలువకు అధికారులు నీటిని విడుదల చేశారు. మహారాష్ట్ర, కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుంది. దీంతో మల్యాల పంప్‌హౌజ్ నుంచి మూడు పంపుల ద్వారా తాగు సాగు నీటి అవసరాలకు నీటిని విడుదల చేశారు.
రూ.696 కోట్లతో పూర్తైన హంద్రీనీవా విస్తరణ పనులు
రాయలసీమకు తాగునీరు కష్టాలు తీర్చాలనుకున్న కూటమి ప్రభుత్వం వంద రోజుల్లో హంద్రీనీవా కాలువ విస్తరణ పనులను పూర్తి చేసింది. 696 కోట్లతో చేపట్టిన హంద్రీనీవా ఫేజ్ 1 విస్తరణ పనులతో కాలువ ప్రవాహ సామర్థ్యాన్ని 3850 క్యూసెక్కులకు పెంచారు. విస్తరణ పనులతో అదనంగా 1600 క్యూసెక్కుల మేర నీటిని తరలించేందుకు అవకాశం ఉంది. ప్రస్తుతం అనంతపురం జిల్లాలో ఉన్న జీడిపల్లి రిజర్వాయర్‌ను పూర్తి సామర్ధ్యంతో నింపేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీంతో కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో ఆయకట్టుకు సాగునీరు అందనుంది. 33 లక్షల మంది ప్రజలకు దాహార్తిని తీర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.
నిండుకుండలను తలపిస్తున్న రాయలసీమ డ్యామ్‌లు
మల్యాల నుంచి జీడిపల్లి వరకూ 216 కిలోమీటర్ల మేర హంద్రీనీవా కాలువ విస్తరణ పనులు పూర్తయ్యాయి. దీంతో జీడిపల్లి, కృష్ణగిరి, పత్తికొండ, గాజులదిన్నె సహా స్థానికంగా రాయలసీమ జిల్లాల్లోని చెరువులను కూడా నింపనున్నారు. ప్రభుత్వం చేపట్టిన చర్యలతో రాయలసీమ జిల్లాల్లో భూగర్భజలాలు గణనీయంగా పెరిగేందుకు అవకాశం ఉంది. HNSS ఫేజ్ 1 ద్వారా నంద్యాల జిల్లాలో 2906 ఎకరాలు, కర్నూలు జిల్లాలో 77 వేల 094 ఎకరాలు, అనంతపురం జిల్లాలో లక్షా,18 వేల ఎకరాల ఆయకట్టుకు నీరు అందనుంది.
Also Read: పార్టీలో ఆధిపత్యపోరుకు రామచంద్రరావు చెక్ పెట్టగలరా?
33 లక్షల మందికి దాహార్తిని తీర్చేలా ప్రభుత్వ లక్ష్యం
హంద్రీనీవా ఫేజ్- 2 ప్రాజెక్టులో భాగంగా అనంతపురం జిల్లాలో మరో 2.27 లక్షల ఎకరాలు, కడప జిల్లాలో 37,500 ఎకరాలు, చిత్తూరు జిల్లాలో 1.40 లక్షల ఎకరాల మేర ఆయకట్టుకు నీరు చేరుతుందని అధికారులు తెలిపారు. మొత్తంగా ఫేజ్ 1, ఫేజ్ 2 ద్వారా ఆరు లక్షల పైచిలుకు ఎకరాలకు సాగునీరు, 33 లక్షల మందికి తాగునీరు అందనుంది. హంద్రీనీవా ఫేజ్ 1 పనులు 2025 ఏప్రిల్‌లో మొదలు కాగా వంద రోజుల్లో పూర్తయ్యాయి. తదుపరి ఫేజ్- 2 పనులను కూడా ఈ నెలాఖరుకు పూర్తి చేసి పుంగనూరు, కుప్పంలోని చివరి ఆయకట్టుకూ నీళ్లు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం మొత్తం 3 వేల 890 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు.