Vijayasai Reddy: అమ్మో.. అలాంటి ఇలాంటి ప్లాన్ కాదు.. సూపర్ ప్లాన్ ఉందట. ఔను ఆ ఒక్క రాజీనామాతో అంతా చక్కబెట్టే ప్రయత్నం సాగుతోందట. ఈ మాటలు అంటున్నది ఎవరో కాదు టీడీపీ నేతలు. ఇంతకు ఎవరిని ఉద్దేశించో తెలుసా.. తాజాగా పార్టీకి, ఎంపీ పదవికి రాజీనామా చేసిన విజయసాయి రెడ్డిపైనే. కూటమి అధికారంలోకి రావడంతో దిక్కుతోచని స్థితిలో వైసీపీ ఉందని, అందుకే పెద్ద స్కెచ్ వేసి సాయి రెడ్డి చేత రాజీనామా చేయించినట్లు టీడీపీ విమర్శలు గుప్పిస్తోంది. ఈ విమర్శలు ఏమో కానీ, ఇప్పుడు ఏపీ రాజకీయం రసవత్తరంగా మారిందని చెప్పవచ్చు.
వైఎస్సార్ ఫ్యామిలీకి నమ్మిన బంటుగా విజయసాయిరెడ్డికి పేరుంది. ఒక ఆడిటర్ గా తన ప్రస్థానం ప్రారంభించిన సాయిరెడ్డికి రాజకీయ స్థానం కల్పించింది మాత్రం వైఎస్ ఫ్యామిలీనే. దివంగత సీఎం వైఎస్సార్ బ్రతికి ఉన్నప్పుడే, ఆడిటర్ గా ఆస్తుల వ్యవహారాలను సాయిరెడ్డి చక్కబెట్టేవారు. ఆ పరిచయం చివరకు మాజీ సీఎం జగన్ కు ఆత్మలా మారేలా చేసింది. వైఎస్సార్ కు ఆత్మ అంటే కేవీపీ రామచంద్రరావు పేరు వినిపించడం మామూలే.
అలాగే జగన్ కు ఆత్మ అంటే విజయసాయిరెడ్డి పేరు వినిపిస్తుంది. అందుకే వైఎస్సార్ చనిపోవడంతోటే సాయిరెడ్డి జగన్ కు రైట్ హ్యాండ్ అయ్యారు. ఆ తర్వాత అక్రమాస్తుల కేసులు నమోదు కాగానే జగన్ జైలుకు వెళ్లారు. ఈ కేసులలో ఏ1 జగన్ కాగా, ఏ2 విజయసాయి రెడ్డి ఉన్నారు. అక్రమంగా ఆస్తులు కూడగట్టారనే అభియోగం కింద 2012 మే 27న సీబీఐ.. జగన్‌ను అరెస్టు చేసింది. ఈ కేసుకు సంబంధించి 16 నెలల పాటు జగన్ చంచల్ గూడ జైలులో ఉన్నారు. 2013 సెప్టెంబర్ 2 లో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
అలా జగన్ బెయిల్ పై రాగానే, సాయిరెడ్డి అండగా నిలిచారు. 2011 మార్చి 11న వైసీపీని స్థాపించిన జగన్ రాష్ట్రమంతా పాదయాత్ర నిర్వహిస్తే, రూట్ మ్యాప్ అంతా తానై సాయిరెడ్డి నడిపించారు. ఆ తర్వాత ఆడిటర్ గా కంటే పార్టీ వ్యవహారాలు చక్కబెట్టడంలో సాయిరెడ్డి ప్రాధాన్యత పెరిగింది. పార్టీలో నెంబర్ – 2 స్థానం సాయిరెడ్డిదేనని క్యాడర్ కూడ భావించేవారు. 2014 లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ కేవలం ప్రతిపక్ష హోదా మాత్రమే దక్కించుకుంది.
దీనితో సాయిరెడ్డికి రాజ్యసభ పదవి వరించింది. మళ్ళీ 2019లో ఎన్నికలు జరగడం వైసీపీ అధికారంలోకి రావడంతో చక్రం తిప్పారు సాయిరెడ్డి. ఎంపీగా నిరంతరం ఢిల్లీలో ఉంటూ.. జగన్ అక్రమాస్తుల కేసు ఊసు వచ్చినప్పుడల్లా, కేంద్రంతో కలవడం సాయిరెడ్డికి విధిగా మారిందని రాజకీయ విశ్లేషకులు అంటారు. అంతేకాదు అధికారంలో ఉన్నప్పుడు భూ ఆక్రమణలకు సాయిరెడ్డి పాల్పడ్డారన్న ఆరోపణలు కూడ ఉన్నాయి. ఈ తరుణంలో పలుమార్లు జగన్ కు సాయిరెడ్డికి విభేధాలు వచ్చాయని టాక్ నడిచింది. కానీ వారిద్దరి స్నేహం ఈనాటిది కాదు కదా.. అందుకే పార్టీకి విధేయుడిగా కొనసాగారు సాయిరెడ్డి.
అయితే 2024 ఎన్నికలు మాత్రం వైసీపీకి భారీ షాకిచ్చాయి. కేవలం 11 సీట్లకు వైసీపీ పరిమితం కాగా, మళ్లీ పార్టీ కోలుకోవడం మాత్రం ఇక కల్లే అంటారు రాజకీయ విశ్లేషకులు. అందుకే ఒక్కొక్కరుగా పార్టీకి చెందిన సీనియర్ నేతలు ఇటీవల పార్టీ వీడారు. ఎంత మంది వీడినా అగ్ర నాయకులు వీడరన్న ధీమా జగన్ లో కూడ ఉండేది. వాటిని పటాపంచలు చేస్తూ తాజాగా సాయిరెడ్డి రాజీనామా చేశారు. పార్టీకి రాజీనామా చేయడంతో పాటు, ఎంపీ పదవికి కూడ రాజీనామా చేసి భారీ షాకిచ్చారు. ఇకపై తాను వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తానని, రాజకీయాలు వదిలేస్తున్నట్లు సాయిరెడ్డి ప్రకటించారు. ఇదే ఇప్పుడు ఏపీలో పొలిటికల్ టాక్ కావడం విశేషం.
సాయిరెడ్డి రాజీనామాపై టీడీపీకి చెందిన కొందరు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. జగన్, సాయిరెడ్డి ఇద్దరూ కలిసి పక్కా ప్లానింగ్ ప్రకారం అడుగులు వేస్తున్నారని, అందులో భాగంగానే రాజీనామా డ్రామా అంటూ విమర్శిస్తున్నారు. ఇటీవల జగన్ అక్రమాస్తుల కేసుపై సుప్రీం కోర్టు విచారణ వేగవంతం చేసిందని, ఆ కేసులను చక్కబెట్టే భాద్యత సాయిరెడ్డి తీసుకున్నట్లు నాయకులు బాహాటంగానే చెబుతున్నారు. కేసు విచారణ సాగితే జగన్ జైలుకు వెళ్లడం ఖాయమని, ఒకవేళ పీఎం మోడీని జగన్ కలిస్తే బయట ప్రచారం మరోలా సాగే అవకాశం ఉందట. అందుకే సాయిరెడ్డి చేత రాజీనామా చేయించి, జగన్ తన కేసుల సంగతి చూడమని ఆదేశించినట్లు టీడీపీ ప్రచారం సాగిస్తోంది.
జగన్ కు ఆత్మలా ఉన్న సాయిరెడ్డి రాజీనామా డ్రామా ఆడితే తమకు తెలియదా అంటూ కూటమి అంటోంది. పార్టీ స్థాపించిన సమయంలోనే కాక, వైఎస్సార్ ఆస్తుల వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన సాయిరెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెబితే నమ్మే పరిస్థితిలో ఏపీ ప్రజలు లేరని, దీని వెనుక పెద్ద కథే ఉందంటున్నారు టీడీపీ ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న. అసలే ఇప్పుడే వైసీపీ పుంజుకొనే పరిస్థితి లేదు.
Also Read: విజయసాయి రెడ్డి రాజీనామాపై సీఎం చంద్రబాబు రియాక్షన్ ఇదే
అందుకే సాయిరెడ్డి పార్టీలో ఉన్నా ఒకటే.. లేకున్నా ఒకటే. అందుకే రాజీనామా చేయించి, విజయసాయి రెడ్డికి జగన్ పెద్ద భాద్యత అప్పగించారని పొలిటికల్ టాక్. తన కేసులలో సాయిరెడ్డి పేరు కూడ ఉన్న నేపథ్యంలో ఇద్దరూ కలిసి కేసుల నుండి బయట పడేందుకు పక్కా ప్లాన్ వేసినట్లు టీడీపీ ఆరోపణ. ఏదిఏమైనా జగన్ ప్లాన్ ప్రకారం సాయిరెడ్డి రాజీనామా చేశారో లేక ఉద్దేశపూర్వకంగా తప్పుకున్నారో ఏమో కానీ, టీడీపీ మాత్రం ఏపీ ప్రజలు అంత అమాయకులు కాదు.. మీ డ్రామాలు నమ్మడానికి అంటూ స్పందిస్తోంది.