BigTV English

YSRCP : వైసీపీలో కలవరం మొదలైందా..? వై నాట్ 175 స్లోగన్ నుంచి వెనక్కి తగ్గిందా..?

YSRCP : వైసీపీలో కలవరం మొదలైందా..? వై నాట్ 175 స్లోగన్ నుంచి వెనక్కి తగ్గిందా..?


YSRCP : కర్ణాటక ఎన్నికల ప్రభావం పక్క రాష్ట్రాలపై పడుతోంది. అక్కడ ఓటమితో తెలంగాణలో బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం తగ్గింది. ఇటు ఏపీలో ఇన్నాళ్లు టీడీపీతో కలిసేదే లేదన్న బీజేపీ ఇప్పుడు కలిసి వెళ్లే యోచనలో ఉన్నట్లు సంకేతాలు ఇస్తోంది. ఇదే అంశం ఇప్పుడు రాష్ట్రంలో అధికార పార్టీ వైసీపీని కలవరపెడుతోంది.

2019 ఎన్నికలకు ఏడాది ముందు ఎన్డీఏ కూటమి నుంచి టీడీపీ బయటకు వచ్చింది. అలా బీజేపీతో పొత్తు తెగిపోవడం వైసీపీకి కలిసి వచ్చింది. టీడీపీని అడ్డుకునేందుకు బీజేపీ అంతర్గతంగా వైసీపీకి సహకరించదనే ప్రచారం జరిగింది. దీంతోపాటు టీడీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత, జగన్ ఒక్క ఛాన్స్ పిలుపు, పవన్ టీడీపీతో విడిపోవడం ఇలా ఎన్నో అంశాలు కలిసిరావడంతో 2019 ఎన్నికల్లో వైసీపీ 151 సీట్లు గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.


స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల్లో ఫ్యాన్ స్పీడ్ గా తిరిగింది. ప్రతిపక్షనేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం మున్సిపాలిటీని వైసీపీ గెలిచింది. ఇక అప్పటి నుంచి సీఎం జగన్ వై నాట్ 175 నినాదాన్ని అందుకున్నారు. కుప్పం సహా రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ స్థానాలు గెలవడమే లక్ష్యమని స్పష్టం చేశారు.

అయితే కొంతకాలం ఏపీలో రాజకీయ పరిస్థితులు క్రమక్రమంగా మారుతున్నాయి. ప్రభుత్వంపై వ్యతిరేక పెరుగుతోంది. ముఖ్యంగా అర్బన్ ప్రాంతాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. అదే సమయంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వనని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఆ తర్వాత గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3 స్థానాలు టీడీపీ కైవసం చేసుకుంది. సీఎం సొంత జిల్లా కడప స్థానాన్ని సైకిల్ ఎగరేసుకుపోయింది. ఆ తర్వాత ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ రెబెల్స్ ఆ పార్టీకి షాకిచ్చారు. దీంతో కచ్చితంగా వైసీపీ గెలవాల్సిన ఒక ఎమ్మెల్సీ స్థానం టీడీపీ ఖాతాలో పడింది. ఆ తర్వాత నుంచి సీఎం జగన్ కూడా వై నాట్ 175 అనే మాటను ప్రస్తావించడం తగ్గించారు.

తాజాగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వచ్చే ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. 150 సీట్లుపైగా సాధిస్తామన్నారు. ఎన్ని పార్టీలు కలిసినా తాము మాత్రం ఒంటరిగానే బరిలో ఉంటామన్నారు. మరోవైపు చంద్రబాబు కోసమే పవన్‌ కల్యాణ్ జనసేన పార్టీ పెట్టారని మంత్రి పేర్ని నాని విమర్శించారు. చంద్రబాబుకు అనుకూలంగా రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ఇలా వైసీపీ నేతలు ఒకవైపు పవన్ ను టార్గెట్ చేస్తున్నారు. చంద్రబాబుతో ఎందుకు కలుస్తారని ప్రశ్నిస్తున్నారు.

టీడీపీ, జనసేన కలిస్తే గట్టి పోటీ ఉంటుందనే అభిప్రాయం రాష్ట్రవ్యాప్తంగా వ్యక్తమవుతోంది. కర్ణాటకలో పరాజయం తర్వాత బీజేపీ కూడా టీడీపీతో కలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే 2014 ఎన్నికల మాదిరిగానే పోటీ జరుగుతుంది. అప్పుడు టీడీపీ, బీజేపీ కూటమికి పవన్ కల్యాణ్ మద్దతు ఇచ్చారు. జనసేన అభ్యర్థులను మాత్రం బరిలోకి దించలేదు. ఈ ఎన్నికల్లో మాత్రం టీడీపీ, జనసేన , బీజేపీ కలిసి బరిలోకి దిగితే వైసీపీ గెలుపు అంతఈజీ కాదంటున్నారు.

గత ఎన్నికల్లో టీడీపీకి 40 శాతం ఓట్లు వచ్చాయి. జనసేనకు దాదాపు 6 శాతం ఓట్లు వచ్చాయి. బీజేపీతో కలిసి బరిలోకి దిగితే కూటమికి 46 శాతంపైగా ఓటు బ్యాంకు ఉంటుంది. గత ఎన్నికల్లో వైసీపీకి దాదాపు 50 శాతం ఓట్లు వచ్చాయి. వచ్చే ఎన్నికల్లో 2 శాతం ఓట్లు వైసీపీ కోల్పోయినా అధికారం పోవడం ఖాయం. ఎందుకంటే ప్రతిపక్షాలపై ప్రజల్లో వ్యతిరేకత ఉండదు. ప్రభుత్వంపైనే వ్యతిరేకత ఉంటుంది. కర్ణాటకలో అదే జరిగింది. కాంగ్రెస్ కు 5 శాతం ఓట్లు పెరగడంతో గతంలో కంటే 55 సీట్లు ఎక్కువగా గెలిచింది. ఈ లెక్కలే ఇప్పుడు వైసీపీని కలవర పెడుతున్నాయి. అందుకే పెద్దిరెడ్డి కూడా వై నాట్ 175 అనకుండా 150 సీట్లు గెలుస్తామన్నారు. మరోవైపు ఒంటరిగా బరిలోకి దిగాలని టీడీపీకి, జనసేనకు వైసీపీ నేతలు సవాళ్లు విసురుతున్నారు.

Related News

Pulivendula ZP: పులివెందుల జెడ్పీ.. ఆ ముగ్గురు వ్యూహం, బెడిసికొట్టిన వైసీపీ ప్లాన్

Jagan: కూలిపోతున్న పులివెందుల కోట.. తప్పు ఎక్కడ జరిగింది? టెన్షన్‌లో జగన్‌

Viveka Murder Case: వివేకా హత్యకేసు విచారణలో కీలక మలుపు..

ZPTC Fightings: భగ్గుమన్న పులివెందుల.. మంత్రి ఎదుటే కొట్టుకున్న టీడీపీ, వైసీపీ కార్యకర్తలు

Pulivendula ZPTC: పులివెందుల, ఒంటమిట్టలో ముగిసిన పోలింగ్

AP Free Bus Scheme: ఆగస్ట్ 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం – స్త్రీశక్తి పథకంపై సీఎం సమీక్ష

Big Stories

×