Adluri Laxman Kumar: ఆ మంత్రి.. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం లో అందరిచేత పాపం అనిపించుకుంటున్నాడు.. మొదటి నుండి సౌమ్యుడుగా ముద్రపడిన మంత్రిని వెకిలి కామెంట్స్ తో కరుచుకు తింటున్నా.. ఇంకొందరు మంచితనంతో నంచుకు తింటున్నారు. మంత్రి పదవి వచ్చిందన్న ఆనందం కన్నా.. మంత్రి పదవి వచ్చాక అవమానాలే ఎక్కువ అవుతున్నాయాటా.. ఇంతకి ఎవరా మంత్రి.. ఎమిటా కథ.. లెట్స్ వాచ్.
ఏ ముహూర్తాన మంత్రి గా బాధ్యతలు చేపట్టారో గాని ధర్మపురి ఎమ్మెల్యే, సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి అడ్లూరికి మనశ్శాంతి కరువైంది. పండుగ లేదు, పబ్బం లేదు. తాను గౌరవించేవారు.. తాను మంత్రి కావాలని కోరుకునేవారు తనతో మంచితనంతో ఆడుకుంటుంటే.. తను మంత్రి అవ్వడం జీర్ణించుకోలేనివారు ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉప్పు, నిప్పులా మారడంతో.. ఇప్పుడా మంత్రికి ఏం చేయాలో పాలుపోవడం లేదట. తాజాగా జగిత్యాల జిల్లాలో పొలాస పౌలస్తేశ్వరస్వామి ఆలయంతో పాటు, బీర్ పూర్ శ్రీ లక్ష్మీ నృసింహస్వామి ఆలయ కమిటీల ఏర్పాటులో జీవన్ రెడ్డి వర్గానికి, ముఖ్యంగా ఆది నుంచీ కాంగ్రెస్‌ను నమ్ముకున్నవారికి కాకుండా.. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చినవారికి దక్కడంతో జీవన్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు.
తనను గడియకింత హలాల్ చేయకుండా ఒకేసారి చంపుకుతినండంటూ.. తన ఆవేదనను మంత్రి అడ్లూరి ముందు వ్యక్తపర్చారు. ఆ రోజే కాంగ్రెస్‌ను వీడదామనుకుంటే శ్రీధర్ బాబు, మీరే ఆపారంటూ.. ఇద్దరు మంత్రులను టార్గెట్ చేశారు. జీవన్ రెడ్డి వర్సెస్ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మధ్య జరుగుతున్న గొడవలో ఎవరివైపు ఉండాలో తేల్చుకోలేని ఓ అయోమయ స్థితిలో మంత్రిగా, జిల్లా అధ్యక్షుడిగా అడ్లూరి పాత్ర అడకత్తెరలో అడ్లూరి అన్నట్టు తయారైంది. తనను మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ఎవరైతే మీకు ఇబ్బందికరమైన నిర్ణయం తీసుకున్నారో ఆ పాపం వారికే తాకుతుంది సార్ అంటూ.. అడ్లూరి అన్న మాటలు కూడా.. ఆయన ఎవరి గురించి ఆ కామెంట్స్ చేసి ఉంటారనే చర్చకు తెరలేపింది.
ఇక ఇదిలా ఉంటే, అటు తాను ఎదగడం ఇష్టం లేని సహచర మంత్రులు కూడా.. తనను అవమానించేట్టు మాట్లాడటంపై అడ్లూరిలో తీవ్ర మనస్థాపం కనిపిస్తోంది. దీంతో మంత్రుల మధ్య పూర్తి డివిజన్ వచ్చేసినట్టే కనిపిస్తోంది. వేములవాడ ఆలయానికొచ్చిన శృంగేరీ పీఠాధిపతి విదుశేఖర భారతీ పర్యటనలో మంత్రి పొన్నంతో కలిసి అడ్లూరి కూడా పాల్గొంటారని ముందు పేర్కొన్నా.. ఆయన వేములవాడకు వెళ్లలేదు. గోదావరిఖనిలో మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. అలాగే, పార్టీలోని తన ప్రత్యర్థులు, తనపై కారాలు, మిరియాలు నూరుతున్న సహచర మంత్రులు ఇదంతా శ్రీధర్ బాబే వెనుకుండి.. అడ్లూరిని ముందుంచి.. ఆడుతున్న నాటకంగా చర్చించుకుంటున్నట్టు కూడా ఓ ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో మంత్రి పదవి వచ్చిన ఆనందం కంటే కూడా.. దానివల్ల తనకు పెరిగిన తలనొప్పులే అడ్లూరికి నిద్రలేకుండా చేస్తున్నాయనే చర్చకు తావిస్తోంది.
కరవమంటే కప్పకు కోపం.. విడవమమంటే పాముకు కోపం అన్నట్టుగా ఇలా జిల్లా పార్టీలోని నాలుగైదు గ్రూపుల మధ్య.. అడ్లూరి పరిస్థితి మద్దెలదరువులా మారింది. దీంతో తనకుతానే లోలోపల మధనపడిపోతున్నాడు అడ్లూరి.. తన ఎదుగుదలకి మొదటినుండి అండదండగా చేదోడు వాదోడుగా ఉన్న జీవన్ రెడ్డి వ్యవహారం లొ ఎటు తేల్చుకోలేకపోతున్నాడు.. మరోవైపు జిల్లాలోని గ్రూపుల తగాదాలు ఇబ్బంది కరంగా మారాయి. మొత్తానికి అడకత్తెరలో పోకలాగ తయ్యారైంది అడ్లూరి పరిస్థితి ఇప్పుడు