ప్రెస్ మీట్లతో కాలం నెట్టుకొస్తున్నారు జగన్.
జనంలోకి వెళ్లి అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు షర్మిల.
జగన్, షర్మిల.. ఈ ఇద్దరిలో ఎవరు బెస్ట్.. అంటే ఇదిగో మీరే నిర్ణయించుకోండి అన్నట్టుగా ఇద్దరు నేతల వ్యవహార శైలి ఉంది. జగన్ నాలుగు గోడల మధ్య ప్రెస్ మీట్ పెట్టి సమస్యలు ఏకరువు పెడతారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజాదరణ ఉందా లేదా అనే విషయం పక్కనపెడితే షర్మిల జనంలోకి వెళ్లి సమస్యను హైలైట్ చేయాలని చూస్తారు. మరి జగన్ ఈ పని ఎందుకు చేయడం లేదనేది వైసీపీ కార్యకర్తలకు వస్తున్న మొదటి అనుమానం.
జగన్ రాజకీయం..
2019 ఎన్నికల నాటికి జగన్ దూకుడుగా ఉన్నారు. కానీ ఒక్కసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ దూకుడు మాయమైంది. పాదయాత్రలో జగన్ ఎంత చొరవగా జనంలోకి వెళ్లారో ఆ తర్వాత అంత రిజర్వ్ గా మారిపోయారనే ఆరోపణలున్నాయి. ప్రతిపక్ష నేతగా సామాన్యులకు సైతం అందుబాటులో ఉన్న జగన్, సీఎం అయ్యాక కనీసం మంత్రులు ఎమ్మెల్యేలను కూడా దగ్గరకు రానీయలేదనే అపవాదు ఉంది. అప్పట్లో జగన్ కోటరీయే అంతా చూసుకునేది. 2024లో వైసీపీ ఓటమికి కూడా అదే ప్రధాన కారణం అనేది రాజకీయ విశ్లేషకుల మాట. పోనీ అధికారం పోయిన తర్వాతయినా జగన్ మారారా అంటే అదీ లేదు. ఆయన బెంగళూరులోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. వీకెండ్ మాత్రం కచ్చితంగా ఏపీకి వస్తారు. గతంలో వైసీపీ నేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్ ని ఇతర రాష్ట్ర రాజకీయ నాయకులంటూ ఎద్దేవా చేసేవారు. ఇప్పుడు జగన్ కూడా అదే పని చేయడం చాలామందికి నచ్చడం లేదు. ఏపీలో ఉన్నా కూడా జగన్ అసెంబ్లీకి వస్తారా అంటే అదీ లేదు. ఆయన కేవలం ప్రెస్ మీట్లు పెట్టి రాసుకొచ్చిన పేపర్లు చదివి వినిపిస్తున్నారు.
నిరసనల్లో జగన్ ఎక్కడ?
వారానికో నిరసన కార్యక్రమానికి వైసీపీ పిలుపునిస్తోంది. కానీ ఆ నిరసనలు కేవలం ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ చార్జ్ లకు మాత్రమే. జగన్ ఎక్కడా నిరసనల్లో కనపడ్డం లేదు. వైసీపీ నేతలు కూడా మొక్కుబడిగా నిరసనలు చేపట్టి సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుని సరిపెడుతున్నారు. టోటల్ గా ప్రతిపక్షంగా జనంలో లేదనే విమర్శను ఎదుర్కొంటోంది వైసీపీ.
జనంలోకి షర్మిల..
పేద ప్రజల ఆరోగ్య సంజీవని ఆరోగ్య శ్రీ పథకం. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ YSR గారు ప్రవేశ పెట్టిన గొప్ప పథకం ఆరోగ్య శ్రీ. ఆరోగ్య శ్రీ కింద లక్షలాది మంది ప్రజలు రోగాలను జయించి పునర్జన్మ పొందారు. ఇలాంటి ప్రతిష్టాత్మక పథకాన్ని తెచ్చి YSR గారు దేవుడైతే.. ఆరోగ్య శ్రీ కి నిధులు ఇవ్వకుండా,… pic.twitter.com/hHDRp1XF0I
— YS Sharmila (@realyssharmila) October 22, 2025
కాంగ్రెస్ కి ఏపీలో ప్రజాదరణ లేదనేది వాస్తవం. రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ ని ఏపీ ప్రజలు నమ్మే అవకాశం లేదని అంటున్నారు. కానీ ఏపీ కాంగ్రెస్ అధినేతగా షర్మిల మాత్రం పట్టు వదలకుండా సమస్యలను హైలైట్ చేస్తూ జనంలోకి వస్తున్నారు. ఒకరకంగా చెప్పాలంటే జగన్ కంటే ఆమే బెటర్ అనిపించుకుంటున్నారు. గతంలో జగన్ కోసం వైసీపీ తరపున ఉధృతంగా ప్రచారం చేశారు షర్మిల. ఒకరకంగా పార్టీ పునాదుల్లో ఆమె పడిన కష్టం చాలానే ఉంది. కానీ వైసీపీలో ఆమెకు ప్రయారిటీ లేకపోవడం, ఆస్తుల పంపకాల్లో తేడాలతో జగన్ కు, వైసీపీకి దూరం జరిగి తనదారి తాను చూసుకున్నారు షర్మిల. ఈ ఇద్దరిని పోల్చి చూస్తే జనంతో మమేకం అయ్యే విషయంలో జగన్ కంటే షర్మిలే బెటర్ అంటున్నారు నెటిజన్లు.
Also Read: ఆ ఘనత మాదే.. వైజాగ్ గూగుల్ ఏఐ డేటా సెంటర్ పై జగన్ యూ టర్న్