Kurnool Bus Fire: కర్నూలు ప్రైవేటు ట్రావెల్ బస్సు ప్రమాదం నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాలు అలర్ట్ అయ్యాయి. ఈ వ్యవహారంపై కేవలం ఏపీ మాత్రమే కాకుండా, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల ప్రభుత్వాలు అటు వైపు దృష్టి పెట్టాయి. దీనిపై తెలంగాణ ఆర్టీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. కర్నూలు బస్సు ప్రమాద ఘటన చాలా దురదృష్టకరమైందని అన్నారు. మృతులందరికీ తమ సంతాపం తెలిపారు.
కర్నూలు బస్సు ఘటన.. అలర్టయిన మూడు రాష్ట్రాలు
ఈ ఘటనపై ఏపీకి చెందిన రవాణా శాఖ మంత్రి, కలెక్టర్, డీఐజీతో ఫోన్‌లో మాట్లాడి సమాచారం తెలుసుకున్నట్లు వివరించారు. కర్నూలు బస్సు ప్రమాదంపై సమగ్ర విచారణ చేస్తున్నామన్నారు. అవసరమైన సహాయక చర్యలు తీసుకుంటామన్నారు. హైదరాబాద్ నుంచి బస్సు బయలుదేరిన నేపథ్యంలో ఘటనపై విచారణకు ఆదేశాలు ఇచ్చినట్టు తెలిపారు.
ఇదే క్రమంలో బస్సు ఓనర్లు, ట్రావెలర్లను సూటిగా హెచ్చరించారు మంత్రి పొన్న ప్రభాకర్. ఫిటినెస్, ఇన్సురెన్స్, ఇతర అంశాలపై నిర్లక్ష్యం వహిస్తే హత్యా నేరం కింద జైలుకి పంపిస్తామన్నారు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. నియమ నిబంధనలు పాటించాలని, ప్రాణాలతో చెలగాటం వద్దని ఘాటు హెచ్చరికలు చేశారు. రవాణా శాఖ రోజువారీ తనిఖీలు చేస్తే వేధింపులు చేస్తున్నట్లు మాట్లాడుతున్నారని అన్నారు.
ఆ రూల్స్ బ్రేక్ చేస్తే జైలుకే
ప్రమాదానికి కారణాలు ఏమైనా కావచ్చు.. తప్పకుండా చర్యలు చేపడతామన్నారు. ఘటన నేపథ్యంలో ప్రమాదానికి గురై బస్సు ఒడిషాలో రిజిస్టర్ అయినట్టు వెల్లడించారు. ఈ బస్సు.. హైదరాబాద్ నుంచి బెంగుళూరు మధ్య తిరుగుతోందన్నారు. 43 సీట్లకు పర్మిషన్ తీసుకున్న బస్సు ఓనర్, దాన్ని స్లీపర్‌గా మార్చాడు. బస్సు విషయంలో ప్రతిచోటా అధికారులతో కుమ్మక్కై ఆల్ట్రేషన్ చేయించాడు. హైదరాబాద్ నుంచి వివిధ రాష్ట్రాలకు బయలుదేరే బస్సుల రాకపోకల వివరాలు నమోదు చేస్తామన్నారు. ప్రతీరోజూ ఈ మూడు రాష్ట్రాల మధ్య వేలాది మంది ప్రయాణం చేస్తారన్నారు.
ALSO READ: కర్నూలు బస్సు ఘటన.. రేవంత్ సర్కార్ నిర్ణయం, మృతుల కుటుంబాలకు 5 లక్షలు
బస్సు వ్యవస్థలో అన్ని రకాల చర్యలు తీసుకునేందుకు తెలంగాణ-ఏపీ-కర్ణాటక టాన్స్‌పోర్టు మంత్రులు-ఆ శాఖ కమిషనర్ల సమావేశం త్వరలో జరుగుతుందన్నారు. ప్రైవేటు బస్సుల వేగం నియంత్రణకు చర్యలు చేపడతామన్నారు. బస్సుల్లో భద్రత గురించి చర్యలు తీసుకుంటామన్నారు. స్పీడ్ లిమిట్ ప్రమాదాలను కంట్రోల్ చేస్తుందన్నారు. ఆ తరహా రూల్స్ కచ్చితంగా అమలు చేస్తామని వెల్లడించారు.