అక్రమ మైనింగ్ కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి జైలుకెళ్లారు. ఈ విషయంలో అందరికంటే ఎక్కువగా సంబరపడేది టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఓదశలో సోమిరెడ్డిని రాజకీయంగా పాతాళానికి తొక్కేశారు కాకాణి. ఆయన దెబ్బకి సర్వేపల్లిలో సోమిరెడ్డి దిక్కులేని నాయకుడుగా మారిపోయారు. వరుస ఓటములతో రాజకీయ సన్యాసం తీసుకోవాల్సినంత పనైంది. గత ఎన్నికల్లో టీడీపీ వేవ్ తో సోమిరెడ్డి గెలిచారు. మంత్రి పదవి రాలేదు కానీ, అధికార పార్టీ ఎమ్మెల్యేగా తనకు దొరికిన అవకాశంతో రాజకీయ ప్రత్యర్థి కాకాణికి మాత్రం చుక్కలు చూపించాలనుకున్నారు. అనుకున్నట్టుగానే అక్రమ మైనింగ్ కేసు తెరపైకి తెచ్చారు.
14రోజులు రిమాండ్..
అయితే కాకాణి ఓ పట్టాన పోలీసులకు దొరకలేదు. అక్రమ మైనింగ్ కేసులో ఆయన బెయిల్ కోసం శతవిధాల ప్రయత్నించారు. చివరకు సుప్రీంకోర్టు కూడా బెయిలివ్వకపోవడంతో దాదాపు 50రోజులుగా ఆయన అజ్ఞాతవాసం గడిపారు. ఎట్టకేలకు పోలీసులు ఆయన్ను బెంగళూరులో అరెస్ట్ చేశారు. ఆ తర్వాత నెల్లూరు జిల్లాకు తరలించి వెంకటగిరి కోర్టులో హాజరు పరిచారు. కోర్టు ఆయనకు 14 రోజులు రిమాండ్ విధించడంతో కాకాణిని నెల్లూరు జిల్లా జైలుకి తరలించారు పోలీసులు. ఈ క్రమంలో ప్రెస్ మీట్ పెట్టిన సోమిరెడ్డి.. నిన్నటి వరకు అజ్ఞాతవాసం, నేడు జైలు జీవితం అంటూ కాకాణిపై సెటైర్లు పేల్చారు. బెంగళూరులో మసాజ్ చేయించుకుంటుండగా పోలీసులు పట్టుకొచ్చారంటూ వెటకారం చేశారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అమాయకులపై తప్పుడు కేసులు పెట్టి జైల్లో వేయించాడని, చివరకు కాకాణి జర్నలిస్టులను కూడా వదిలిపెట్టలేదని.. ఐదేళ్లు లెక్కకు మించి పాపాలు చేసిన ఆయన ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నాడని అన్నారు సోమిరెడ్డి.
స్పందించని నేతలు..
సోమిరెడ్డి సంగతి పక్కనపెడితే నెల్లూరు జిల్లా వైసీపీ నేతలు కాకాణి అరెస్ట్ ని ఎలా చూస్తున్నారనేదే ఇక్కడ అసలు పాయింట్. కాకాణి అరెస్ట్ తో వైసీపీలో కూడా కొందరు నేతలు సంతోషంగా ఉన్నారని సమాచారం. అందులో ముఖ్యులు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. పైకి ఆయనకూడా అందరితో కలసి ఆందోళన వ్యక్తం చేస్తున్నా.. లోలోపల మాత్రం సంతోషంగానే ఉంటారని అంటున్నారు. కాకాణి అడ్డు తొలగితే జిల్లాపై పెత్తనం తనకే దక్కొచ్చనేది ఆయన అంచనా. అందుకే ఇటీవల అనిల్ లైమ్ లైట్ లోకి వస్తున్నారు. అవసరం ఉన్నా, లేకపోయినా ప్రెస్ మీట్లు పెడుతున్నారు. ఇప్పుడు కాకాణి వ్యవహారంతో ఆయన మరింత జోరుగా మీడియాలో కనపడుతున్నారు. అసలు కాకాణి అరెస్ట్ తర్వాత నెల్లూరు జిల్లాకు చెందిన కొంతమంది వైసీపీ నేతలు ఆ అంశంపై స్పందించడానికి కూడా ముందుకు రాలేదు. మీడియాకి మొహం చాటేశారు.
కాకాణి తర్వా ఎవరు..?
నెల్లూరు జిల్లాలో వైసీపీ తరపున బలమైన వాయిస్ వినిపించే నాయకుడు కాకాణి గోవర్దన్ రెడ్డి. ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన ధైర్యంగా మీడియా ముందుకొచ్చారు. కానీ అనిల్ వంటి నాయకులు అసలు అడ్రస్ లేకుండా ఎటో వెళ్లిపోయారు. తీరా ఇప్పుడు కాకాణి అజ్ఞాతంలోకి వెళ్లగానే అనిల్ తెరపైకి వచ్చారు. గతంలో మంత్రి పదవుల విషయంలో కూడా కాకాణి, అనిల్ మధ్య మనస్పర్థలు వచ్చాయి. అనిల్ కి మంత్రి పదవి తీసేసి, కాకాణికి పదవి వచ్చినప్పుడు ఆయన అలిగారు. నెల్లూరు సిటీలో కాకాణి ఫ్లెక్సీలు కూడా చించివేయించారు. ఓ దశలో జగన్ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఇప్పటికీ వారిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులున్నా, పైకి మాత్రం ఒకరంటే ఒకరికి ఎక్కడలేని ఆప్యాయత ఉన్నట్టు కలరింగ్ ఇస్తుంటారు. కాకాణి అరెస్ట్ తర్వాత, ఇది అక్రమం, అన్యాయం అంటూ అనిల్ కూడా మీడియా ముందుకొచ్చారు. కానీ లోపల అనిల్ ఆలోచనలు వేరే ఉన్నాయని అంటుంటారు. మరి జిల్లా పార్టీ అధ్యక్షుడు జైలుకెళ్లడంతో నెల్లూరు జిల్లాలో వైసీపీ వాయిస్ ఎవరు వినిపిస్తారో చూడాలి.