YSRCP : ఏపీలో ఎన్నికలకు 15 నెలల మాత్రమే సమయం ఉంది. మళ్లీ అధికారాన్ని నెలబెట్టుకునేందుకు సీఎం జగన్ వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు. ఒకవైపు నియోజకవర్గ సమీక్షలు నిర్వహిస్తూ అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. ఇదే సమయంలో పార్టీలో అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయి. కొందరు నేతలు చేస్తున్న బహిరంగ ప్రకటనలు జగన్ కు తలనొప్పిగా మారాయి.
తాజాగా మాజీ మంత్రి మేకతోటి సుచరిత సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయంగా తమ మనుగడ వైసీపీతో అని ఎప్పుడూ చెబుతామని తాను స్టేట్‌మెంట్ ఇస్తే తన భర్త దయాసాగర్ కూడా దానికి కట్టుబడి ఉంటారని స్పష్టం చేశారు. అలాకాకుండా దయాసాగర్ పార్టీ మారతానంటే ఎంత రాజకీయ నాయకురాలినైనా, ఒక భార్యగా తాను భర్త అడుగుజాడల్లో నడుస్తాను కదా అన్నారు. గుంటూరు జిల్లా కాకుమానులో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు వైసీపీలో కలకలం రేపాయి. దయాసాగర్ ఒక పార్టీలో, సుచరిత ఇంకో పార్టీలో, పిల్లలు మరో పార్టీలో ఉండరని సుచరిత స్పష్టం చేశారు. ఆమె మాటల్లో కాస్త కన్ఫ్యూజన్ ఉన్నా పార్టీ మార్పుపై ఇన్ డైరెక్ట్ గా హింట్ ఇచ్చారు.
మంత్రిమండలి పునర్ వ్యవస్థీకరణలో స్థానం దక్కకపోవడంతో అప్పుడు కూడా ఆమె నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని ప్రచారం జరిగింది. అయితే ఆ తర్వాత జగన్ తో మాట్లాడాక మెత్తబడ్డారు. అయినా సరే పార్టీ కార్యక్రమాల్లో అంత యాక్టివ్ గా లేరు. తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలతో ఆమె మరో రాజకీయ వేదికపైకి వెళుతున్నారనే అనుమానాలు కలుగుతున్నాయి.
కొన్నిరోజులుగా నెల్లూరు జిల్లాకు చెందిన సీనియర్ నేత వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. ప్రభుత్వంపై బహిరంగంగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఏం పనులు చేశామని ప్రజలను మళ్లీ ఓట్లు అడుగుతామని మండిపడ్డారు. ఇలాగైతే గెలవలేమని తేల్చాశారు. దీంతో ఆనంపై నేరుగా చర్యలకు దిగకున్నా వైసీపీ అధిష్టానం వెంకటగిరికి నేదురుమల్లి రాంకుమార్ రెడ్డిని ఇన్ ఛార్జిగా నియమించింది. ఇక వైసీపీలో ఆనంకు దారులు మూసుకున్నట్లే. మరి ఇక ఆయన పార్టీని వీడటం ఖాయమే . అయితే ఏ పార్టీలో చేరతారనేది ఆసక్తిగా మారింది. టీడీపీలో చేరేందుకు మొగ్గుచూపుతున్నారని ప్రచారం సాగుతోంది.
మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కూడా పార్టీ అధిష్టానంపై గుర్రుగా ఉన్నారు. గుంటూరు తొక్కిసలాట ఘటనపై ప్రభుత్వ చర్యలను ఆయన తప్పుపట్టారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎన్ఆర్ఐ ఉయ్యూరు శ్రీనివాస్ కు మద్దతుగా మాట్లాడారు. సమాజంలో మంచి కార్యక్రమాలు చేస్తున్న ఎన్ఆర్ఐలను వేధిస్తే ఎలా అని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలకు రాజకీయాలతో సంబంధం లేదని ఆ తర్వాత వివరణ ఇచ్చుకున్నారు వసంత కృష్ణప్రసాద్. ఆయనకు మైలవరం టిక్కెట్ పై జగన్ స్పష్టమైన హామీ ఇవ్వలేదు. ఈ స్థానంపై మంత్రి జోగి రమేష్ దృష్టిపెట్టారు. దీంతో వసంత బలమైన సందర్భాన్ని చూసుకుని పార్టీపై ధిక్కార స్వరాన్ని వినిపించారు. పార్టీ వీడేందుకు సిద్ధమైన తర్వాతే వసంత ఈ వ్యాఖ్యలు చేశారని టాక్ వినిపిస్తోంది. ముందుకు మరికొందరు నేతల ఇలాంటి చర్యలకు దిగే అవకాశాలున్నాయని టాక్ నడుస్తోంది. మరి పార్టీలో రేగుతున్న అసంతృప్తి జ్వాలలను సీఎం జగన్ ఎలా చల్చార్చుతారో చూడాలి మరి.