AP Schools Timings: రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ఏపీ ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆ పాఠశాలల పని వేళలు మార్పు చేస్తూ మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలపై ముస్లిం సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. ప్రభుత్వం ఇచ్చిన తాజా ఉత్తర్వులు ఏమిటో తెలుసుకుందాం.
ప్రస్తుతం రంజాన్ మాసం ప్రారంభమైన విషయం అందరికీ తెలిసిందే. రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ముస్లింలు ఉపవాసాలను ఆచరిస్తారు. రంజాన్ మాసంలో ప్రతి ముస్లిం ఉపవాసాలను ఆచరిస్తూ.. ప్రత్యేక ప్రార్థనల్లో సైతం పాల్గొంటారు. అందుకోసమే ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ముస్లిం ప్రభుత్వ ఉద్యోగుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. గంట ముందుగా తాము పనిచేసే కార్యాలయాలను విడిచి వెళ్లేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఈ నిర్ణయం పట్ల ముస్లిం ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.
తాజాగా రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోని ఉర్దూ పాఠశాలల పని వేళలలో మార్పులు చేస్తూ ప్రభుత్వం కీలక ప్రకటన జారీ చేసింది. ఈనెల 15వ తేదీ నుండి ఒంటిపూట బడులను ప్రారంభించనున్న ప్రభుత్వం, ముందుగానే ఉర్దూ పాఠశాలల పని వేళల్లో మార్పులు చేస్తూ ప్రకటన ఇవ్వడం విశేషం. రంజాన్ మాసంలో ముస్లిం విద్యార్థులు సైతం ఉపవాసాలను ఆచరిస్తారు. వారిని దృష్టిలో ఉంచుకున్న ప్రభుత్వం ఉర్దూ పాఠశాలల పనివేళలను మార్పు చేసింది.
ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 1.30 గంటల వరకు ఉర్దూ పాఠశాలల వేళలను ఖరారు చేసింది. ఈనెల 30వ తేదీ వరకు మార్పు చేసిన ఉర్దూ పాఠశాలల వేళలు అమలులో ఉంటాయని మంత్రి ఫరూక్ ప్రకటించారు. ఉపాధ్యాయ సంఘాలు తదితర సంస్థల నుండి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. ఉర్దూ పాఠశాలల పనివేళల పై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ఉర్దూ పాఠశాల యాజమాన్యాలు హర్షం వ్యక్తం చేశారు.
రంజాన్ మాసం సంధర్భంగా ఇప్పటికే ఏపీలోని ఇమామ్, మౌజన్ లకు పెండింగ్ లో వేతనాలను ప్రభుత్వం విడుదల చేసింది. రంజాన్ మాసంకు ముందుగానే ప్రభుత్వం పెండింగ్ బకాయిలు విడుదల చేయడంపై ఇమామ్ సంఘ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనలపై మంత్రి ఫరూఖ్ మాట్లాడుతూ.. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందన్నారు. రంజాన్ మాసంలో ఏ ముస్లిం కూడా ఇబ్బందులు ఎదుర్కోకుండా, ప్రభుత్వం ముందస్తుగానే ఉత్తర్వులు ఇచ్చిందన్నారు.
మైనార్టీల అభ్యున్నతికి సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కట్టుబడి ఉన్నారని, పలు సంక్షేమ పథకాలను కూడా ప్రభుత్వం ప్రారంభించిందన్నారు. కాగా ఏపీలో ఎండలు దంచికొడుతున్న నేపథ్యంలో ఒంటి పూట బడులపై త్వరగా ప్రకటన చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వ ప్రకటన కోసం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఒంటి పూట బడుల ప్రకటన కోసం ఎదురుచూపుల్లో ఉన్నారని చెప్పవచ్చు.