TTD Chairman BR Naidu: టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే తిరుమల పవిత్రతకు భంగం వాటిల్లకుండా అన్ని చర్యలు చేపడుతున్న చైర్మన్, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మంగళవారం లేఖ వ్రాశారు. అసలు ఆ లేఖ ఏమిటి? చైర్మన్ లేఖ రాయడం వెనుక ఉన్న అంతరార్థం ఏమిటన్నది తెలుసుకుందాం.
కలియుగ వైకుంఠం శ్రీ శ్రీనివాసుడు వెలసిన తిరుమల క్షేత్రానికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు ఉంది. ఇంతటి గుర్తింపు గల తిరుమల క్షేత్రానికి దేశ, విదేశాల్లో భక్తులు ఉన్నారు. అందుకే తిరుమలకు రోజుకు వేల సంఖ్యలో భక్తులు తరలివస్తారు. ఆ వేంకటేశ్వర స్వామిని దర్శించి తన మొక్కులు చెల్లించుకుంటారు. తిరుమల లడ్డు ప్రసాదాన్ని భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. అయితే తిరుమలకు రాలేని భక్తుల కోసం తిరుమలకు అనుంసంధాన ఆలయాల్లో కూడా లడ్డు సౌకర్యాన్ని టీటీడీ కల్పించింది. అయితే ఇతర రాష్ట్రాల నుండి వచ్చే భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.
గోవిందా అంటూ నామస్మరణ సాగిస్తే చాలు, శ్రీ వేంకటేశ్వర స్వామి అనుగ్రహం కలుగుతుందని భక్తుల విశ్వాసం. పలు రాష్ట్రాలలో ఇప్పటికే తిరుమల శ్రీవారి ఆలయాలు వెలసి ఉన్నాయి. ప్రతిసారీ తిరుమలకు రాలేని భక్తులు, ఆ ఆలయాలను దర్శించి శ్రీ శ్రీనివాసుడి ఆశీస్సులు అందుకుంటారు. అందుకే అలాంటి భక్తులను దృష్టిలో ఉంచుకొని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయంలో భాగంగా పలు రాష్ట్రాల సీఎం లకు లేఖ రాశారు. అన్ని రాష్ట్రాల రాజధానుల్లో శ్రీవారి ఆలయ నిర్మాణానికి ఉచితంగా స్థలం కేటాయించాలని సీఎంలను కోరారు. దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానుల్లో శ్రీవారి ఆలయం నిర్మాణానికి ఉచితంగా స్థలం కేటాయించాలని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు కోరారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాసినట్లు చైర్మన్ తెలిపారు.
దేవాలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలే కాదని, దేవాలయాలు సమాజ అభివృద్ధికి దోహదపడతాయని లేఖలో పేర్కొన్నారు. దేశాభివృద్ధిలో టెంపుల్ టూరిజం ప్రత్యేక పాత్ర పోషిస్తుందని, ఆధ్యాత్మిక వైపు అందరూ అడుగులు వేస్తున్నారన్నారు. ప్రతి రాష్ట్ర రాజధానిలో వేంకటేశ్వరస్వామి ఆలయం ఉండాలని, దేశంలోని ప్రధాన ప్రాంతాల్లో కూడా శ్రీవారి ఆలయాలు ఉండాలని ఆకాంక్షించారు. కోట్ల మంది భక్తులు దేవాలయాలకు విరాళాలు ఇస్తున్నారని, వాటిని విద్య, వైద్యం సహా ఇతర సేవ కార్యక్రమాల కోసం ఖర్చు చేస్తున్నట్లు చైర్మన్ తెలిపారు. మన సంస్కృతి, వారసత్వ పరిరక్షణకు దేవాలయాలు ప్రధాన పాత్ర పోషిస్తాయని ఆయన లేఖలో పేర్కొన్నారు.
Also Read: APPSC: నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్.. ఏపీపీఎస్సీ ఉద్యోగాలకు వయోపరిమితి పెంపు..
ఇక,
తిరుపతి ఏఎంఆర్‌డి బిల్డర్స్ ఎండిలు మారుతి నాయుడు, శ్రీ దేవేంద్ర నాయుడులు రూ.2.28 లక్షలు విలువైన రెండు బజాజ్ ఎలక్ట్రిక్ స్కూటర్లు టీటీడీకి విరాళంగా అందించారు. ఈ మేరకు శ్రీవారి ఆలయం ఎదుట స్కూటర్లకు పూజలు నిర్వహించి డిప్యూటీ ఈవో లోకనాథంకు స్కూటర్ల తాళాలు అందించారు. ఆ తర్వాత దాతలను టీటీడీ అధికారులు అభినందించారు. ఈ కార్యక్రమంలో తిరుమల డిఐ సుబ్రమణ్యం, ఇతర అధికారులు పాల్గొన్నారు.