Woman Burns Vehicles: ఓ అపార్ట్‌మెంట్‌లోని సెల్లార్‌లో అకస్మత్తుగా మంటలు చెలరేగాయి. ఒకేసారి 14 వాహనాలు మంటల్లో కాలిపోయాయి. విశాఖపట్నంలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. వాహనాలు కాలిపోవడంతో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వచ్చి ఉంటాయని అపార్ట్‌మెంట్‌లో ఉన్నవారంతా అనుకున్నారు. అయితే షార్ట్ సర్క్యూట్ ఏం జరగలేదని తెలిసేసరికి ఎవరో కావాలనే వాహనాలకు మంటలు అంటించారని అనుకున్నారు.
సెల్లార్‌కు సంబంధించిన సీసీ ఫుటేజ్ చెక్ చేసి అపార్ట్‌మెంట్ వాసులంతా ఖంగుతిన్నారు. ఓ యువతి వాహనాలను కాలబెట్టిందని గుర్తించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటకు వచ్చింది. అపార్ట్‌మెంట్ వాసుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ప్రేమించిన వ్యక్తి మీద కోపంతో ఓ యువతి 14 వాహనాలను కాల్చేసిందని దర్యాప్తు చేసిన పోలీసులు వెల్లడించారు.
ALSO READ: ఈత నేర్చుకోవడానికి వెళ్లి చిన్నారి మృతి
ఆమెను అదుపులోకి తీసుకొని విచారణ జరిపారు. అయితే మూడేళ్ల పాటు ప్రేమించిన వ్యక్తి మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడనే అతని బైక్‌కు నిప్పంటించినట్లు ఆ యువతి తెలిపింది. దీంతో పక్కనే పార్క్ చేసి ఉన్న ఇతర వాహనాలు కూడా పూర్తిగా కాలిపోయాయి. తనను మోసం చేసినందుకు మాజీ ప్రియుడిపై కోపం వల్ల ఇలా చేసినట్లు విచారణలో ఒప్పుకుందని అన్నారు. యువతిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు.