Young Woman Gang Raped: రేపటి పౌరులు మీరే.. ఇంటి దీపాలు మీరే అని కవిత్వాలు చెబుతారు. కథలు చెబుతారు.. కబుర్లు చెబుతారు. కానీ అవన్నీ మాటల వరకే.. రోడ్డుపై అమ్మాయి కనిపిస్తే చాలు.. మనిషి ముసుగు వేసుకున్న మృగాళ్లు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. వారి నిండు జీవితాలతో ఆడుకుటుంన్నారు. ఉత్తరమైన, దక్షిణమైన భరత ఖండంలో ఎక్కడ చూసిన ఆడబిడ్డలపై వికృత చేష్టలే.. అమానవీయ సంఘటనలే.
నా దేశం ఏమై పోతోంది.. నా జాతి ఏమైపోతోంది అని స్పీచ్‌లు ఇచ్చే నాయికలకు ఆడబిడ్డల ఆవేదన పట్టడం లేదు. చిన్నారులు అయితే ఏమి చేయలేరు.. ఎవరికి చెప్పుకోలేరు అన్న తెగింపే మృగాళ్లు రెచ్చిపోవడానికి కారణం అవుతోందా..? మహిళలపై అఘాయత్యాలకు పాల్పడాలంటే.. వెన్నులో వణుకుపుట్టేలా పోక్సో చట్టాన్ని సవరించారు. కానీ ఏమి లాభం నిత్యం ఇలాంటి సంఘటనలు చూస్తే.. చట్టాల పదును మనిషి రూపంలో ఉన్న గుంట నక్కలా.. మనసు మార్చలేకపోతోందని స్పష్టంగా అర్ధమవుతుంది. అమ్మాయిపై అత్యాచారం జరిగినప్పుడే పోలీసుల హడావుడి కనిపిస్తుంది. కానీ ఆ నిందులకు కఠిన శిక్షలు పడేలా చేయడంలో సంబంధిత వ్యవస్థలు విఫలమవుతున్నాయి.
అడుగు బయటపెడితే అత్యాచారం.. చదువుకు అని స్కూల్‌కి వెళితే అత్యాచారం.. కదిలే బస్సులో, ప్రైవేటు టాక్సీలో, ఆఖరికి దైవదర్శనానికి వచ్చిన దగ్గర, నడిరోడ్డు మీద, నట్టింట్లో ఇలా కామాంధుల కీచకత్వానికి అన్నీవేధికలే. ఇలాంటి మృగాళ్లు ఉన్న దేశంలో మహిళలకు రక్షణ అన్నది ఎప్పటికీ తీరని కలే. అమ్మాయిల్నే కాదు.. అమ్మల్ని, అవ్వల్ని కాటేస్తున్న కామాధుల రాజ్యంలో కళ్లుండి చూడలేని నాగరిక పాలనలో అరగంటకో అబల అత్యాచారానికి బలైపోతోన్న పుణ్యభూమి మనది. అనునిత్యం అకృత్యాల వేధింపుల బారిన పడుతున్న కర్మ భూమి మనది.
తెల్లారితే చాలు యత్ర నార్యస్తు పూజ్యన్తే రమంతే తత్ర దేవతా.. అంటూ ఆర్యోక్తులు పలుకుతాం. స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయమంటూ బస్సులపై రాస్తాం.. కానీ అదే బస్సుల్లో అబలలపై కాటేస్తున్నారు. స్త్రీలను కాపాడుదాం అంటూ గోడలపై రాతలు రాస్తాం.. అదే గోడలమీద కూర్చుని వచ్చిపోయో అమ్మాయిలపై కారు కూతలు కూస్తారు. యూగాలుగా సనాతన సంప్రదాయాలా ఉట్టిపట్టుకుని వేలాడే మనలాంటి దేశంలో సగటు మహిళ రక్షణ అనేది భూతద్దం పెట్టి వెతికినా కనపించని బ్రహ్మపదార్ధం అయిపోయింది.
Also Read: అగ్నికి ఆహుతైన అపార్ట్‌మెంట్.. ఎగిసిపడుతున్న మంటలు
ఇదిలా ఉంటే.. తాజాగా నాగర్ కర్నూల్ జిల్లా ఊరుకొండ మండలంలో దారుణం జరిగింది. ఆంజనేయస్వామి దర్శనానికి వచ్చిన యువతిపై సామూహిక అత్యాచారం జరిగింది. కుటుంబ సభ్యులతో దర్శానానికి వచ్చిన యువతి ఆలయంలో నిద్ర చేశారు. మహిళ బహిర్ భూమికి వెళ్ళగా మాటువేసి అత్యాచారానికి పాల్పడ్డారు ఊరుకొండ పేట గ్రామ యువకులు. అడ్డుకోవడానికి వెళ్లిన బంధువులను చితకబాది తాళ్లతో చేతులు కట్టేసి యువతిపై అత్యాచారం చేశారు మృగాళ్లు. రంగంలోకి దిగిన పోలీసులు ఆరుగురిని అరెస్టు చేయగా మిగతా ఇద్దరి కోసం గాలిస్తున్నారు.