Balineni Srinivasa Reddy: ఆ నేత ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో ఎవరికీ అంతుపట్టడం లేదట. మొన్నటి వరకు వైసీపీలో ఉన్న ఆ నేత మూడు జిల్లాకు కింగ్ గా ఉన్నారు. ఏపీలో ఎన్నికల అనంతరం మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఒక్కసారిగా జనసేనలోకి జంప్ అయ్యారు. అక్కడి వరకు ఓకేగానీ, ఉన్నట్లుండి ఫ్యామిలీతో పాటు వెళ్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిశారు. ఇలా కలిసిన ఆ నాయకుడి గురించి ఏదో కొడుతోంది శీనా.. అనే సినిమా డైలాగ్ వినిపిస్తోంది. మొత్తం మీద తన కుటుంబ సభ్యుల్లో ఒకరిని రాజకీయాలలోకి ఆరంగేట్రం చేసేందుకు ఆ నేత స్కెచ్ వేసినట్లు ప్రచారం సాగుతోంది. మరి ఆ నేత తీసుకున్న నిర్ణయం అదేనా? లేక పెద్ద పదవికే గురిపెట్టారా అంటూ ప్రచారం సాగుతోంది. ఆ నేత పేరు ఇప్పటికే క్యాచ్ చేశారా? ఔను ఆయనే ప్రకాశం పొలిటికల్ కింగ్ గా పేరు తెచ్చుకున్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి.
బాలినేని శ్రీనివాస రెడ్డి గురించి స్పెషల్ గా పరిచయం అవసరం లేదు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో తన కామెంట్స్ తో నిరంతరం వార్తల్లో నిలిచిన వారే. ఏపీ 2024 ఎన్నికల్లో వైసీపీ తరపున ఒంగోలులో పోటీ చేసిన బాలినేని ఓటమి పాలయ్యారు. అక్కడ టీడీపీ ఎమ్మెల్యేగా దామచర్ల జనార్ధన్ విజయాన్ని అందుకున్నారు. అయితే బాలినేని ఎన్నికల అనంతరం జనసేన లోకి జంప్ అయ్యారు. ఎవరూ ఊహించని రీతిలో బాలినేని జనసేనలోకి వెళ్లడంతో క్యాడర్, ఆయన అభిమానులు, ప్రధానంగా స్థానిక టీడీపీ నాయకులు షాక్ కు గురయ్యారు. ఒకానొక దశలో కొందరు టీడీపీ నేతలు, బాలినేని జనసేన చేరికపై సీరియస్ కామెంట్స్ చేశారు. చివరకు అధిష్టానం ఆదేశాలతో చల్లబడ్డారు. అలా బాలినేని ప్రస్థానం ప్రస్తుతం జనసేనలో సాగుతోంది.
పవన్ కళ్యాణ్ అంటే తనకు అభిమానమని, పవన్ సిద్దాంతాలకు అనుగుణంగా తాను నడుచుకుంటానంటూ బాలినేని పలుమార్లు ప్రకటించారు. అంతేకాదు కార్యకర్తగా ఉండేందుకు రెడీ అన్నారు. ఒకానొక దశలో బాలినేనికి ఎమ్మెల్సీ ఖాయమన్న వార్తలు హల్చల్ చేశాయి. పవన్ కూడా ఎన్నికల ప్రచారం సమయంలో బాలినేని లాంటి మంచివారు వైసీపీలో ఉన్నారంటూ కామెంట్స్ చేశారు. దీనిని బట్టి బాలినేనిపై పవన్ కు ఉన్న నమ్మకం అలాంటిదని చెప్పవచ్చు. ఇటీవల ఒంగోలులో తన సత్తా చాటుకోవాలని, పవన్ తో బహిరంగ సభ ఏర్పాటు చేయాలని బాలినేని భావించారని టాక్. ఈ సభలో పలువురు వైసీపీకి చెందిన కార్పొరేటర్లను జనసేనలోకి జంప్ చేయించాలని అనుకున్నారు. కానీ ఏం జరిగిందో కానీ ఆ నిర్ణయం వెనక్కు తీసుకొని, కార్పొరేటర్లను ఏకంగా పవన్ చెంతకే తీసుకువెళ్లారు.
మంగళగిరిలో మంగళవారం పవన్ సమక్షంలో 19 మంది కార్పొరేటర్లకు జనసేన కండువా కప్పారు. అంతవరకు ఓకేగానీ ఇక్కడే బాలినేని స్కెచ్ ఎవరికీ అర్థం కావడం లేదట. కార్పొరేటర్ల చేరిక సంధర్భంగా ఫ్యామిలీతో సహా పవన్ వద్దకు బాలినేని వెళ్లడమే ఇప్పుడు చర్చకు దారి తీసింది. భార్య శచీదేవి, కుమారుడు ప్రణీత్ రెడ్డి, కోడలు కావ్య లు బాలినేనితో పాటు పవన్ ను కలిశారు. కుమారుడు, కోడలికి రాజకీయ రంగప్రవేశం చేయించే పనిలో బాలినేని ఉన్నారని, అలాగే పార్టీకి బలాన్ని చేకూర్చిన బాలినేనికి కీలక పదవి ఇవ్వనున్నట్లు సమాచారం.
Also Read: తల్లికి వందనం స్కీమ్.. అర్హతలు ఇవేనా?
అది పార్టీ పదవినా? లేక ఎమ్మెల్సీ పదవినా అన్నది తేలాల్సి ఉంది. మొత్తం మీద కుమారుడు ప్రణీత్ రెడ్డికి రాజకీయ ఓనమాలు ఇప్పటికే నేర్పించిన బాలినేని, భవిష్యత్ రాజకీయాలలో రూట్ ఖరారు చేసుకొనేందుకు పవన్ ను కలిశారని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. మొత్తం మీద వైసీపీలో ఓ వెలుగు వెలిగిన బాలినేని రాజకీయ వ్యూహం ఇప్పుడు ఎవరికీ అంతుచిక్కడం లేదట. బాలినేని మనోగతం బయటకు రావాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.