YCP Statistics: ఏదో విధంగా చంద్రబాబు సర్కార్‌ని ఇరుకున పెట్టాలని వైసీపీ భావిస్తోందా? తల్లికి వందనం పథకాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవాలని ఆలోచన చేస్తోందా? చంద్రబాబు సర్కార్ ని టార్గెట్ చేస్తూ విమర్శలు ఎక్కుపెట్టిందా? ఈ స్కీమ్‌కి ప్రభుత్వం విడుదల చేసిన లెక్కలను కంపేర్ చేస్తూ వైసీపీ కొత్త లెక్కలు బయటపెట్టిందా? దీంతో అధికార-విపక్షాల మధ్య మాటలయుద్ధం షురూ అయ్యింది.
కూటమి సర్కార్ చేస్తున్న తప్పులను ఎత్తి చూపేందుకు రెడీ అయ్యింది వైసీపీ. తొలుత ‘తల్లికి వందనం’ స్కీమ్ నుంచి మొదలుపెట్టింది. ఈ పథకానికి రూ. 8,745 కోట్లు కేటాయించినట్టు వెల్లడించింది రాష్ట్ర ప్రభుత్వం. దీనిపై వైసీపీ రియాక్ట్ అయ్యింది. ఇది ‘తల్లికి వందనం కాదు.. వంచన’ అంటూ ఎక్స్ వేదికగా రాసుకొచ్చింది.
ఈ స్కీమ్ అమలుకు ఏడాదికి రూ.13,050 కోట్లు కావాలని తనదైన శైలిలో లెక్కలు వేసింది. పోయినేడాది- ఈ ఏడాది కలిసి 26 వేల కోట్లకు కేవలం 8,754 కోట్లతో సరిపెట్టడం వంచన కాదా? అంటూ ప్రశ్నలు లేవనెత్తింది. మొత్తం పిల్లల సంఖ్యను 87,41,885 బయటపెట్టింది. ప్రకటించిన నిధులు చూస్తే కేవలం 58 లక్షల మందికే ఇచ్చినట్టు ఉందని తెలిపింది.
కూటమి ప్రభుత్వం జారీ చేసిన ప్రకటన చూస్తే ప్రజలను ఏ విధంగా వంచిస్తుందో అర్థం అవుతుందని తెలిపింది. వైసీపీ ప్రభుత్వంలో ప్రతిఏటా క్రమం తప్పకుండా ఇచ్చామంటూ కొత్త కథలు చెప్పడం మొదలుపెట్టింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పథకాన్ని రద్దు చేసిందని వివరించింది. వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చిన ఏడాది ఏ పథకానికి నిధులు విడుదల చేయలేదని టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు.
ALSO READ: ఏపీలో తల్లికి వందనం స్కీమ్.. ఏ ఒక్కటి తగ్గినా నో మనీ
వైసీపీ హయాంలో అందరికీ ఈ పథకాన్ని వర్తింప జేశామని చెప్పుకునే ప్రయత్నం చేస్తోంది.67,27,164 మంది విద్యార్థులకు పథకాన్ని వర్తింపు చేస్తామని విద్యా మంత్రి చెబుతున్నట్లు ప్రస్తావించింది. ఒక్కో విద్యార్థికి 15వేల చొప్పున రూ.10,090.75 కోట్లు ఇవ్వాల్సి ఉంటుందని, కానీ రూ.8,745 కోట్లు ప్రకటించడం మోసం కాదా అంటూ తనదైన శైలిలో ప్రశ్నలు లేవనెత్తడం మొదలుపెట్టింది.
ఈ అంకెలు చూస్తుంటే ప్రజలను మభ్యపెట్టేలా ఉందని ప్రస్తావించింది. ఇది మహిళలను మోసం చేస్తున్నట్టు కాదా? తల్లులను వంచిస్తున్నట్టు కాదా? తల్లికి వందనం కాదని, ప్రభుత్వం చేస్తున్న వంచన ఇదని ప్రస్తావించింది. ఈ పథకం అమలుకు కూటమి సర్కార్ పలు దఫాలుగా సర్వే చేపట్టింది. దీనికి సంబంధించి మొత్తం డేటా బేస్ రెడీ చేసింది. ఈ పథకానికి ఎవరు అర్హులు అన్నది నిర్ధారించుకున్న తర్వాత నిధులు విడుదల చేసిందని ప్రభుత్వం పెద్దలు చెబుతున్నారు.