RRR vs YS Jagan: వైసీపీలో రెబల్ ఎంపీగా ఆ పార్టీకి చుక్కలు చూపించిన రఘురామకృష్ణమరాజు ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. రఘురామరాజు కూటమి ప్రభుత్వంలో స్పీకర్ పదవి ఆశించారన్న ప్రచారం జరిగింది. గత అయిదేళ్లలో తనను తీవ్రంగా వేధించిన జగన్‌తో సభలో అధ్యక్షా అని పిలిపించుకుని ఇగో చల్లార్చుకోవాలని ఆయన భావించారంట. అయితే అయ్యన్నపాత్రుడు సభాపతిగా నియమితులవ్వడంతో ట్రిపుల్ ఆర్ ఆశలు నెరవేరలేదు. ఇప్పుడు ఆయనను డిప్యూటీ స్పీకర్ అభ్యర్ధిగా సీఎం చంద్రబాబు ఖరారు చేశారు. దాంతో ఆయన్ని మాజీ ముఖ్యమంత్రి సభకు వస్తే అధ్యక్షా అని సంభోదించక తప్పదు. అటు అయ్యన్న, ఇటు రఘురామరాజు వారిని అధ్యక్షా అని పిలవడానికి జగన్ ఇష్టపడతారా?
ఉండి టీడీపీ ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణంరాజు డిప్యూటీ స్పీకర్ అభ్యర్ధిగా నిర్ణయించారు. ఆయన పేరును సీఎం చంద్రబాబు ఖరారు చేశారు. ఈ పదవికి రఘురామ ఎన్నిక లాంఛనమే. 2019 ఎన్నికల్లో ఆయన నరసాపురం లోక్‌సభ స్థానం నుంచి వైసీపీతరఫున గెలిచారు. తర్వాత కొద్ది రోజుల్లోనే వైసీపీ ప్రభుత్వంపై తిరుగుబాటు జెండా ఎగరేశారు. అప్పటి సీఎం జగన్‌కు సింహస్వప్నంగా తయారయ్యారు.
రఘురామకృష్ణంరాజు ఢిల్లీలో రచ్చబండ పేరుతో ఎప్పటికప్పుడు.. అధికార పార్టీ నేతల అవినీతి, అక్రమాలను ఎండగట్టారు. ఆ క్రమంలో లోక్‌సభలో ఆయనపై అనర్హత వేటు వేయించడానికి వైసీపీ ఎంపీలు శతవిధాలా ప్రయత్నించారు. అయితే ఎన్ని సార్లు ఫిర్యాదు చేసి లోక్‌సభ స్పీకర్‌ని కలిసి విన్నవించుకున్నా వారి ప్రయత్నాలు ఫలించలేదు. రఘురామకృష్ణంరాజు దూకుడు కూడా తగ్గలేదు. దాంతో ఆగ్రహంతో రగిలిపోయిన జగన్ ఆయనపై రాజద్రోహం కేసు నమోదు చేసి, కస్టడీలో చిత్రహింసలు పెట్టించారన్న ఆరోపణలున్నాయి.
జగన్ వ్యవహారాలపై మాట్లాడటం మొదలుపెట్టినప్పటి నుంచి ట్రిపుల్ ఆర్‌ని వైసీపీ పెద్దలు రాష్ట్రంలోకి అడుగుపెట్టనీయకుండా వెంటాడారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ.. పోలీసులను ఆయనపైకి ఉసిగొల్పారు. ఆ సమయంలో ఆయన అధిక సమయం ఢిల్లీకే పరిమితమయ్యారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. రఘురామకృష్ణరాజు తనను గతంలో చిత్రహింసలకు గురి చేసిన పోలీసులపై గుంటూరులో ఫిర్యాదు చేశారు. ఈ కేసులో అప్పటి ముఖ్యమంత్రి జగన్‌తో పాటు పోలీసు ఉన్నతాధికారులు నిందితులుగా ఉన్నారు.
Also Read: లాజిక్‌తో కొట్టిన టీడీపీ.. జగన్ అసెంబ్లీకి రావాల్సిందేనా..?
మరోవైపు జగన్ అక్రమాస్తుల కేసుపై విచారణ వేగవంతం చేయాలని, ఆ కేసులు విచారణ తెలంగాణ హైకోర్టు నుంచి మార్చాలని, జగన్ బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టులో రఘురామ న్యాయపోరాటం చేస్తున్నారు. అలాంటి వైసీపీ రెబల్ 2024 ఎన్నికలకు ముందు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరి పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. జగన్ పాలనలో తీవ్ర వేధింపులకు గురైన ఆయన కూటమి ప్రభుత్వంలో స్పీకర్ పదవి ఆశించారన్న ప్రచారం జరిగింది. సభలో జగన్‌తో అధ్యక్షా అంటూ మైక్ కోసం చెయ్యెత్తి అడిగించుకోవాలన్నది ఆయన కోరికంట.
అయితే స్పీకర్ పదవి దక్కకపోయినా ఆయన డిప్యూటీ స్పీకర్ అవుతున్నారు. అంటే అసెంబ్లీలో స్పీకర్ స్థానంలో అయితే అయ్యన్న పాత్రుడు, లేకపోతే డిప్యూటీ స్పీకర్‌గా రఘురామరాజు ఉంటారు. తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వడం లేదని అసెంబ్లీని బాయ్ కాట్ చేస్తున్నట్లు ప్రకటించిన జగన్ .. ఒక వేళ సభకు వస్తే ఆ ఇద్దరిలో ఎవరు సభాపతి స్థానంలో ఉన్నా నమస్కరించాలి.. మైక్ కోసం అధ్యక్షా అంటూ చెయ్యి ఎత్తాలి. అదే జరిగితే సభలో కూటమికి చెందిన 164 మంది రియాక్షన్ ఎలా ఉంటుందో వేరే చెప్పనవసరం లేదు. ఆ ఎగతాళి భరించలేకే జగన్ అసెంబ్లీకి దూరంగా ఉంటున్నారు. మరిప్పుడు అయ్యన్నపాత్రుడికి రఘురామరాజు తోడవ్వడంతో ఇక జగన్ అసెంబ్లీకి వచ్చే ప్రస్తక్తే ఉండదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. మరి రఘురాముడి ఇగో ఎప్పటికి చల్లారుతుందో చూడాలి.