అమరావతి రాజధాని అంశంపై జర్నలిస్ట్ కృష్ణంరాజు చౌకబారు వ్యాఖ్యలు, తదనంతర పరిణామాలతో ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. సాక్షి ఉద్యోగి కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ అనంతరం మాజీ సీఎం జగన్ ఘాటుగా స్పందించారు. అయితే ఈ వ్యవహారం ఇక్కడితో ఆగలేదు. సాక్షి మీడియా ఆఫీస్ లపై కూడా దాడులు కొనసాగుతుండటంతో మరోసారి జగన్ రియాక్ట్ అయ్యారు. గతంలో మీరు చేసిందేంటి..? ఇప్పుడు మీరు చెబుతున్న మాటలేంటి..? అంటూ కొన్ని వీడియోలను పోస్ట్ చేశారు. చంద్రబాబు, బాలకృష్ణ, లోకేష్ వీడియోలను ట్విట్టర్లో పోస్ట్ చేసిన జగన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే ఇది కొత్త వివాదానికి దారితీసేలా ఉంది. చంద్రబాబు, బాలయ్య వీడియోలు ఒరిజినల్ వేననే ఆధారాలున్నాయి. అయితే లోకేష్ ఫొటోలపై ఇప్పటికే చాలా వివాదం ఉంది. మరోసారి జగన్ ఆ తేనెతుట్టె కదిపారు. లోకేష్, ఈత కొలనులో అమ్మాయిలతో ఉన్న ఫొటొలను పోస్ట్ చేయడం మరింత వివాదాస్పదమవుతోంది.
Previous government under YSRCP, notable for its efficiency, transparency, corruption-free administration, justice-driven approach, and groundbreaking welfare programmes, has been deceitfully replaced by @ncbn’s government which is seemingly a chaotic, authoritarian regime driven… pic.twitter.com/KpZbRPB6BW
— YS Jagan Mohan Reddy (@ysjagan) June 10, 2025
డైవర్షన్ పాలిటిక్స్..
కూటమి ఏడాది పాలనలో.. ఏపీలో 188 అత్యాచారాలు జరిగాయని, 15 మంది అభాగ్యులను అత్యాచారం చేసి హత్య చేశారని లెక్కలు బయటపెట్టారు జగన్. ఇటీవలే, అనంతపురం జిల్లాకు చెందిన ఇంటర్మీడియట్ గిరిజన విద్యార్థిని హత్య జరిగిందని, ఆమె మృతదేహాన్ని అడవిలో పడేసిన దారుణ ఘటన సంచలనంగా మారిందన్నారు. ఎడ్గురాళ్లపల్లిలో, 9వ తరగతి చదువుతున్న దళిత బాలికను టీడీపీకి చెందిన 14 మంది వ్యక్తులు ఆరు నెలల పాటు సామూహిక అత్యాచారం చేశారని, తీరా ఆమె గర్భవతి కాగా.. బాధిత కుటుంబం పోలీసుల్ని ఆశ్రయించినా న్యాయం జరగలేదని మండిపడ్డారు. కూటమి నేతలు హామీ ఇచ్చిన భద్రత ఇదేనా అని ప్రశ్నించారు జగన్. మహిళల గౌరవం కాపాడే విధానం ఇదేనా అని అడిగారు. మహిళల గౌరవం అనే ముసుగులో వారు అవమానకరంగా ప్రవర్తిస్తున్నారని చెప్పారు జగన్.
అప్పుడు-ఇప్పుడు
గత వైసీపీ హయాంలో అవినీతి రహిత, పారదర్శక పాలన అందించామని, సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలకు చేరువయ్యామని అన్నారు జగన్. భారీ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ పాలనతో ఏడాదిలోనే అపఖ్యాతి కూడగట్టుకుందని చెప్పారు. అస్తవ్యస్తమైన, నిరంకుశ పాలన ఇప్పుడు జరుగుతోందన్నారు. అసమర్థుడు, మోసగాడు అయిన చంద్రబాబు, తన వైఫల్యాలను దాచిపెట్టడంకోసం, గందరగోళాన్ని సృష్టించడం ద్వారా ప్రజల దృష్టి మరల్చేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.
తాను చేయని వ్యాఖ్యలకు సీనియర్ జర్నలిస్ట్ అయిన కొమ్మినేని శ్రీనివాసరావుని అరెస్ట్ చేయడాన్ని రాజకీయ ప్రతీకార చర్యగా అభివర్ణించారు జగన్. జరిగిన చర్చను నియంత్రించడానికే ఆయన ప్రయత్నించాడని, అయితే ఆ తప్పుకి బాధ్యుడిగా ఆయన్నే అరెస్ట్ చేయడం ఎంతవరకు న్యాయం అని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వం ఈ ఎపిసోడ్ మొత్తాన్ని వక్రీకరించిందని, దీన్ని సాకుగా చేసుకుని సాక్షి మీడియా కార్యాలయాలపై హింసాత్మక దాడులకు పాల్పడుతున్నారని చెప్పారు. మహిళల గౌరవాన్ని కాపాడటం అనే ముసుగులో ఈ పనులన్నీ చేస్తున్నారని విమర్శించారు జగన్. జగన్ ట్వీట్ కి ఆ పార్టీ నేతలు మరింత ఎలివేషన్ ఇస్తున్నారు. అన్నలో ఈ ఫైర్ తాము చూడాలనుకుంటున్నామని, ఆయన పూర్తి స్థాయిలో గర్జిస్తున్నారని, ఇక కూటమి పని అయిపోయిందని కామెంట్లు పెడుతున్నారు.