వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలి పదవి నుంచి తల్లి విజయమ్మను తెలివిగా తప్పించిన జగన్ ఆ తర్వాత ఆమెను రాజకీయంగా క్రియాశీలం చేసేందుకు ప్రయత్నాలు చేయలేదు. చెల్లెలు షర్మిలతో విభేదాలు తర్వాత తల్లి విజయమ్మ కూడా ఆమెవైపే ఉండటంతో దూరం మరింత పెరిగింది. దాదాపుగా ఇటీవల కాలంలో ఏ కార్యక్రమంలో కూడా తల్లి పేరు ప్రస్తావించలేదు జగన్. అలాంటిది ఇప్పుడు పార్టీ నేతల మీటింగ్ లో తల్లితో కలసి తన రాజకీయ ప్రస్థానం ఎలా మొదలైందో వివరించారు. మరోసారి సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం చేశారు.
విలువలు, విశ్వసనీయత విషయంలో ఏరోజూ నేను రాజీపడలేదు
పార్టీ పెట్టిన సమయంలో నాతో కలిసి వస్తామని చెప్పిన వారిని రాజీనామా చేసి.. ఆ తర్వాత రమ్మన్నాను
ఉప ఎన్నికల్లో నేను అత్యధిక మెజార్టీతో గెలిచి ప్రమాణం స్వీకారం చేస్తున్నప్పుడు.. పార్లమెంట్లో ప్రతి తల నా వైపు చూసింది
-ఈరోజు యువజన… pic.twitter.com/xGtFxTQmQT
— YSR Congress Party (@YSRCParty) July 1, 2025
సెంటిమెంట్..
వైసీపీ యూత్ వింగ్ మీటింగ్ లో జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీ ప్రారంభించిన కొత్తలో అందరూ కొత్తవాళ్లే తన చుట్టూ అందరూ కొత్తవాళ్లే ఉండేవారని గుర్తు చేసుకున్నారు. అప్పట్లో తనతోపాటు తన తల్లి మాత్రమే ఉన్నామని, తనపై వ్యక్తిగతంగా అభిమానం ఉన్నవాళ్లు మాత్రమే తనతో వచ్చారన్నారు. అక్కడ్నుంచి మొదలైన తన ప్రస్థానంలో ఎన్ని కష్టాలు వచ్చినా, విలువలు, విశ్వసనీయతను వదల్లేదన్నారు. రాజకీయంగా ఇబ్బందులు వచ్చినా రాజీ పడలేదని చెప్పారు. ప్రజలకు అందుబాటులో ఉండడం అనేది చాలా ముఖ్యం అని చెప్పిన జగన్, వారికి సమస్య వచ్చినప్పుడు తోడుగా నిలబడాలన్నారు. మంచి పలకరింపు అనేది కూడా చాలా ముఖ్యం అని చెప్పారాయన. ఏ సమావేశంలో అయినా కూటమి ప్రభుత్వంపై విమర్శలతో విరుచుకుపడే జగన్, ఈసారి మాత్రం తన సొంత పార్టీ, తన ప్రయాణం, తనతోపాటు తన తల్లి ప్రయాణం గురించి వివరించారు. ఒకరకంగా సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం చేశారనే చెప్పుకోవాలి. యూత్ వింగ్ మీటింగ్ లో ఈ మాటలు చెప్పిన జగన్.. వారితో పార్టీకి దీర్ఘకాలిక సంబంధం ఉండాలని ఉపదేశించారు.
జనాల్లోకి ఎలా వెళ్లాలి..?
2024 ఎన్నికల్లో తన విజయాలు చెప్పుకున్నారు జగన్, కానీ ప్రజలు నమ్మలేదు. మరి ఈసారి వచ్చే ఎన్నికల్లో ఆయన నినాదం ఎలా ఉండాలి..? ఏం చెప్పుకోవాలి..? ప్రజల్ని ఎలా ఒప్పించాలి..? ఈ విషయంలోనే ఆయన తీవ్ర కసరత్తు చేస్తున్నట్టు ఉంది. వచ్చే ఎన్నికల్లో కూటమిని విమర్శించడంతోపాటు ప్రజల్ని ఆకర్షించాలంటే మరింత బలమైన పాయింట్ ఉండాలని డిసైడ్ అయ్యారు జగన్. ఈసారి సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగించాలని చూస్తున్నారు. 2019లో ఒక్క ఛాన్స్ అనే డైలాగ్ తో ఆయన అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ తర్వాత పార్టీలోనూ, సొంత మీడియాలోనూ వైఎస్ఆర్ అనే పేరు క్రమక్రమంగా మరుగునపడటం అందరికీ తెలిసిన విషయమే. 2024లో ఓటమి తర్వాత తిరిగి వైఎస్ఆర్ ని హైలైట్ చేసే కార్యక్రమాలు మొదలయ్యాయి. ఇప్పుడు తల్లి పేరు కూడా ప్రస్తావించిన జగన్.. కుటుంబం పేరుతో సెంటిమెంట్ ని తెరపైకి తెచ్చేలా ఉన్నారు. ఈసారి పాదయాత్రలో కూడా ఆ సెంటిమెంట్ తోనే జనాన్ని ఆకట్టుకోవాలనుకుంటున్నారు.
ఏపీ ప్రజలు వచ్చే ఎన్నికల్లో దేన్ని బలంగా నమ్ముతారు అనేది ఇప్పుడే చెప్పలేం. ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చానని, 99 శాతం పనులు చేశానని జగన్ చెప్పుకున్నా జనం నమ్మలేదు. చంద్రబాబు తన హామీలను అమలు చేయరు అని జగన్ చెప్పినా కూడా జనం లెక్కచేయలేదు. ఇప్పటి వరకైతే ఏడాది పాలనలో కూటమికి మంచి మార్కులే పడ్డాయి. రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ వైసీపీ రచ్చ చేస్తున్నా తప్పులు చేసినవారే జైలుకి వెళ్లారు, వెళ్తున్నారు. వారిపై సామాన్య జనంలో సింపతీ ఉంటుందని అనుకోలేం. తాను ఒంటరినని, వైఎస్ఆర్ కొడుకునని మరో అవకాశం ఇవ్వాలని జగన్ సింపతీ కార్డ్ ప్లే చేస్తారేమో చూడాలి.