YS Jagan on Chandrababu Vision : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టి ఎప్పుడూ ఇచ్చిన హామీల మీద ఉండదని, నిత్యం ప్రజలను మోసం చేయడం పైనే ఉంటుంది అంటూ.. వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్ విమర్శలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా విడుదల చేసిన విజన్ – 2047 పై విమర్శలు గుప్పించిన జగన్ అనేక అంశాలతో ట్విట్టర్ల లో సుదీర్ఘ పోస్టు పెట్టారు. చంద్రబాబు హామీలు అన్నీ అబద్దాలే అని, ఆయన గతంలో ఇచ్చిన విజన్ డాక్యుమెంట్లు సైతం అమలు కాలేదంటూ వ్యాఖ్యానించారు.
ఇటీవల విడుదల చేసిన విజన్-2047 పేరిట చంద్రబాబు మరోసారి పబ్లిసిటీ స్టంట్‌కు దిగారని విమర్శించారు. ఆయా ప్రణాళికల్లో ఎప్పుడూ రాష్ట్ర అవసరాలకు, ప్రజల అవసరాలకు చోటు ఉండదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలిచ్చే ఐదేళ్ల కాలంలో మ్యానిఫెస్టో అమలుపై దృష్టి పెట్టరని, ఎప్పుడూ ప్రజలను మోసం చేయడం మీదనే ఉంటుంది అని వ్యాఖ్యానించారు. 1998లో కూడా విజన్-2020 పేరుతో డాక్యుమెంట్ విడుదల చేశారని గుర్తు చేశారు. చేశారు.
గతంలో చంద్రబాబు హయాంలో రైతుల ఆత్మహత్యలు, వలసలు, ఉపాధిలేక, ఉద్యోగాల్లేక అష్టకష్టాలు పడ్డారన్న జగన్.. ప్రైవేటీకరణ పేరుతో ప్రభుత్వ ఆస్తులను ఇష్టారాజ్యంగా పంచిపెట్టారని దుయ్యబట్టారు. 2014లో కూడా విజన్-2029 డాక్యుమెంట్ విడుదల చేసి ప్రచారం చేసుకున్నారన్న జగన్.. ఆ హామిలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఇప్పటి వరకు చంద్రబాబు 3 విజన్ డాక్యుమెంట్లు ప్రవేశపెట్టారన్న వైసీపీ అధ్యక్షుడు జగన్.. చిరస్థాయిగా నిలిచిపోయే పని ఒక్కటైనా చేశారా? అని అడిగారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చెప్పుకోదగ్గ ఒక్క ప్రాజెక్టు కానీ, పోర్టు, ఫిషింగ్ హార్బర్లు కట్టారా? అని ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో.. ప్రభుత్వ రంగంలో ఒక్క మెడికల్ కాలేజీ కట్టలేదని, ఆస్పత్రులు, పాఠశాలల్ని బాగు చేయలేదని తెలిపారు.
ఎన్నికల్లో తానిచ్చిన మేనిఫెస్టోలో సూపర్‌సిక్స్ సహా ఇతర హామీలకు తూట్లు పొడుస్తూ మోసాలు, అబద్ధాలతో ప్రజలకు నమ్మక ద్రోహం చేస్తున్నారని చంద్రబాబుపై విమర్శలు గుప్పించిన జగన్.. ఇప్పుడు మళ్లీ విజన్-2047 పేరిట డాక్యుమెంట్ విడుదల చేయడం మరో డ్రామా అంటూ వ్యాఖ్యానించారు. విజన్-2047 ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 2.4 ట్రిలియన్ డాలర్లు చేస్తానని ప్రకటించడాన్ని తప్పుబడ్డిన జగన్.. అదంతా కట్టుకథ అని కొట్టిపడేశారు. ఆయన గత 14 ఏళ్ల కాలంలో ఎప్పుడూ రెవెన్యూ లోటే తప్పా.. రెవెన్యూ మిగులు కనిపించలేదని అన్నారు. అలాంటప్పుడు సంపద సృష్టి ఎక్కడ చేశారంటూ ప్రశ్నించారు.
బాబు చెబుతున్నట్లుగా ఆర్థిక అభివృద్ధికి ఆయన చేయాల్సింది ఏమీ లేదన్న జగన్మోహన్ రెడ్డి.. సహజంగానే ఏ రాష్ట్రంలోనైనా కాలం గడుస్తున్న కొద్దీ ఆర్థిక వ్యవస్థ పెరుగుతుందని అన్నారు. ఏ రాష్ట్రం, దేశమైనా ద్రవ్యోల్బణం వల్ల, సహజంగా వచ్చే పెరుగుదల వల్ల వృద్ధి చెందుతుంటుందని.. దాన్ని సంపద సృష్టిగా చెప్పుకుంటే ఎలా అని ట్విట్టర్ లో ప్రశ్నించారు. చంద్రబాబును మోసగాడు అంటారంటూ తీవ్రంగా విమర్శలు చేశారు.
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సమస్యలకు దీర్ఘకాలిక పరిష్కారం చూపామని, సుస్థిరాభివృద్ధి దిశగా అనేక చర్యలు తీసుకున్నామని ప్రకటించిన జగన్.. వివిధ రంగాల్లో చేసిన అభివృద్ధిని ప్రస్తావించారు. విద్యార్థులకు ట్యాబులు, వ్యవసాయంలో ఆర్బీకే వ్యవస్థ, ఈ-క్రాప్, ఫాంగేట్ వద్దే ఎంఎస్‌పీకి పంటల కొనుగోళ్లు, ఆరోగ్యరంగంలో నాడు- నేడు వంటి వివిధ పథకాలను ప్రస్తావించారు.
Also Read : సీఎం చంద్రబాబులో మార్పు.. క్యాడర్, ప్రజల మాట ఇదే!
తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో 17 మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టినట్లు తెలిపిన జగన్.. ఉపాధికల్పనా రంగంలో మైక్రో సాప్ట్ తో నైపుణ్యాభివృద్ధి, ఎడెక్స్ తో ఒప్పందం చేసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. వీటి వల్ల రాష్ట్రానికి ఎంతో ప్రయోజనం ఉందన్న జగన్.. ప్రస్తుతం సీఎం చంద్రబాబు నాయుడు ఆ పథకాల మంచి ఉద్దేశ్యాలను అర్థం చేసుకోకుండా వాటిని నీరుగారుస్తున్నారంటూ ఆగ్రహించారు.