AP CM Chandrababu: బాబు గారూ.. మీరు చాలా మారారు. నాడేంటి నేడేంటి.. ఇంత మార్పు ఏల సారూ. మీలో ఈ మార్పు ఎప్పుడూ ఊహించలేదు.. అనుకోనూ లేదు. ఇంతలా మార్పుకు కారణం ఏదైనా, ఇదే మా నాయకుడి నైజమంటూ చర్చ సాగుతోంది టీడీపీ క్యాడర్ లో..
ప్రస్తుత ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అంటేనే ఒక విజన్. ఆ విజన్ కు తగినట్లుగానే ఆయన ప్రవర్తన ఉంటుంది. గతంలో ఎవరైనా సీఎం చంద్రబాబు వద్దకు వెళ్లాలంటేనే, గుండెల్లో రైళ్లు పరిగెత్తాల్సిందే. ఆయన పిలిచినా.. క్యాడర్ లో అదో రకమైన భయం ఉండేదట. అంతేకాదు సభకు హాజరైన ప్రజానీకం కూడా సీఎం చంద్రబాబు వచ్చారంటే చాలు, అంతా సైలెంట్ కావాల్సిందే. అలాంటి సీఎం లో అనూహ్య మార్పులు గమనిస్తున్న క్యాడర్ తెగ సంతోషపడి పోతున్నారట.
ఏపీలో ఎన్నికల ఫలితాలు వచ్చిన అనంతరం కూటమి ప్రభుత్వం అధికారం చేజిక్కుంచుకుంది. సీఎం గా చంద్రబాబు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ లు పాలనా పగ్గాలు చేపట్టారు. అయితే ఈసారి సీఎం హోదాలో గల చంద్రబాబు గత వ్యవహార శైలికి భిన్నంగా వ్యవహరిస్తున్నారన్నది టాక్. సీఎంగా భాద్యతలు చేపట్టక మునుపే చంద్రబాబు కాన్వాయ్ ఆపి మరీ, తన కోసం వస్తున్న మహిళను పలకరించారు.
మొన్నటికి మొన్న అనంతపురం జిల్లాలో సాగిన చంద్రబాబు పర్యటన అయితే పూర్తి భిన్నంగా సాగింది. నేమకల్లులో పర్యటించిన చంద్రబాబు.. భద్రతా సిబ్బందిని పక్కన పెట్టి నేరుగా కిరాణాషాపు వద్దకు వెళ్లారు. అయ్యా టీవీలలో చూశాం కానీ, మా దగ్గరకు ఇలా వస్తారని ఊహించలేదయ్యా అంటూ అక్కడి గ్రామస్థులు నేరుగా బాబుతోనే తమ అభిప్రాయం చెప్పారు.
అలాగే ఇటీవల ఏ సభలో పాల్గొన్నా కూడా అక్కడి ప్రజలు ఇలా పిలిస్తే చాలు, అలా చంద్రబాబే స్వయంగా వెళ్తున్నారు. మొన్న జరిగిన 2047 విజన్ సభలో ఓ రైతు.. సీఎం సార్ అనగానే, భద్రతా సిబ్బందిని పంపించి అతడిని పిలిపించారు. సమస్య విన్నారు.. పరిష్కరించాలని ఆదేశించారు. అంతేకాదు నేడు జరిగిన సభలో కూడా ఇద్దరు చిన్నారులు తాము కలవాలని కోరారు. అంతే అంతమంది సభలో వారిని పిలిపించి ఫోటోలు దిగి, వారితో ముచ్చటించారు.
Also Read: Venu Swamy prediction: జైలుకు వెళ్తే చాలు.. సీఎం అవుతారట.. మీరూ ట్రై చేస్తున్నారా!
అలాగే మంగళగిరి పార్టీ కార్యాలయానికి చంద్రబాబు వస్తున్నారంటే చాలు, ప్రజలు పరుగులు పెడుతున్నారు. ఓ వైపు పవన్ కళ్యాణ్ కూడా ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. నారా లోకేష్ కూడా ప్రజల సమస్యలు తీరుస్తున్నారు. అయితే సీఎం చంద్రబాబు వద్దకు కూడా అంతే స్థాయిలో ప్రజలు క్యూ కడుతున్నారు.
గతం కంటే భిన్నంగా తాము నేరుగా సీఎం వద్దకు వెళ్లగలుగుతున్నామని, ఆయన పలకరింపులో కూడా ఆప్యాయత కనిపిస్తుందని ప్రజలు చెబుతుండడం విశేషం. అలాగే పార్టీ క్యాడర్ కూడా మా బాబు గారు చాలా మారారంటూ తెగ ఆనంద పడిపోతున్నారట. సీఎం చంద్రబాబు స్వతహాగా తనదైన శైలిలో ఉన్నారని, ప్రజలు చూసే చూపుల్లో మార్పు వచ్చిందని పలువురు అంటున్నారు. ఏదిఏమైనా బాబు గారు.. బాబు గారేనంటున్నారు పార్టీ క్యాడర్!