పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికల సరళిపై సుదీర్ఘ ప్రెస్ మీట్ పెట్టి విమర్శలు చేసిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్.. ఆ రోజు జరిగిన కీలక సంఘటనల వీడియోలను సైతం మీడియా ముందు ప్రదర్శించారు. ఫలానా వారు దొంగ ఓట్లు వేశారు, ఫలానా వారు నాన్ లోకల్ అంటూ ఆయన ప్రతి వీడియోకి వ్యాఖ్యానం వినిపించారు. ఇక పోలీసుల పనితీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారాయన. డీఐజీ కోయ ప్రవీణ్ పులివెందుల వైసీపీ కార్యాలయానికి వచ్చిన వీడియోని కూడా ప్రదర్శించారు. అదే సమయంలో డీఎస్పీ మురళీ నాయక్ వార్నింగ్ ని కూడా హైలైట్ చేస్తూ జగన్ మాట్లాడటం విశేషం. కాల్చిపారేస్తా నా — అంటూ డీఎస్పీ మురళీనాయక్ అన్నారని జగన్ ప్రస్తావించారు. పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో పరిస్థితులు ఇలా ఉన్నాయంటూ ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
https://twitter.com/i/broadcasts/1zqJVdQoAbWKB
పోలీసులపై చిందులు..
పులివెందులలో పోలీసులు ఖాకీ చొక్కాలు వదిలేసి పచ్చ కండువాలు వేసుకుని ఉద్యోగాలు చేశారని మండిపడ్డారు జగన్. పూర్తిగా తెలుగుదేశం పక్షాన పని చేసి ప్రజాస్వామ్యాన్ని నడివీధిలో నిలబెట్టారన్నారు. డీఐజీ కోయ ప్రవీణ్ సారధ్యంలో పోలీసులు నిస్సిగ్గుగా తెలుగుదేశం కోసం పని చేశారంటూ ధ్వజమెత్తారాయన. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కనబడటం లేదన్న జగన్, ఈ ఎన్నికలతో ఆ విషయం మరోసారి రుజువైందన్నారు. రాష్ట్రంలో ఎలాంటి పరిస్తితులున్నాయో చెప్పడానికి పులివెందుల,ఒంటిమిట్ట ఎన్నికలే తాజా ఉదాహరణ అని చెప్పారు. పోలింగ్ బూత్ లలో వైసీపీ ఏజెంట్లు లేరని, వారందర్నీ తరిమేసి, పోలీసుల ప్రోద్బలంతో టీడీపీ రిగ్గింగ్ చేసుకుందన్నారు. దేశంలో పోలింగ్ బూత్ ఏజెంట్లు లేకుండా ఎన్నికలు జరిగింది ఇక్కడేనని అన్నారు జగన్. డీఐజీ కోయ ప్రవీణ్, టీడీపీ మాజీ ఎంపీకి దగ్గరి బంధువు అని, ఆయన పచ్చ చొక్కా వేసుకున్న ఫక్తు టీడీపీ కార్యకర్తలా ప్రవర్తిస్తుంటారని ఘాటుగా ఆరోపణలు చేశారు జగన్. ఆ డీఐజీ మాఫియా రింగ్ లీడర్ అని, బెల్ట్ షాపుల కలెక్షన్ల నుంచి పర్మిట్ రూమ్ లు, ఇసుక , మట్టి, క్వార్ట్జ్, సిలికా మాఫియా అంతా ఆయన కనుసన్నల్లోనే నడుస్తుందని అన్నారు. కలెక్షన్లలో వాటాలను చంద్రబాబుకి, చినబాబుకి, ఎమ్మెల్యేలకు ఆయన పంచిపెడుతుంటారని చెప్పారు జగన్.
ఒక్కో ఓటర్ కి ఒక్కో రౌడీ..
పులివెందుల, ఒంటిమిట్ట బైపోల్ లో టీడీపీ దారుణాలకు పాల్పడిందని ఆరోపించారు జగన్. ఒక్కో ఓటర్ కి ఒక్కో రౌడీని నియమించి ఓట్లు వేయించుకున్నారన్నారు. ఓటు వేసేందుకు వెళ్లిన వారిని కొట్టి.. వారి దగ్గర్నుంచి ఓటింగ్ స్లిప్పులను లాగేసుకున్నారని చెప్పాలు. ఆ స్లిప్పులతో టీడీపీ వాళ్లే ఓట్లేసుకున్నారని చెప్పారు. ఈ పాపంలో కలెక్టర్ కి కూడా భాగం ఉందన్నారు జగన్. కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ సమక్షంలోనే దొంగ ఓట్లు వేశారన్నారు. మొత్తమ్మీద ఎన్నికల తర్వాత జగన్ వెంటనే ప్రెస్ మీట్ పెట్టడం, ఎన్నికల రోజు సాక్షి టీవీలో ప్రసారం చేసిన వీడియోలనే ఆయన తిరిగి మీడియాకు చూపించడం, ఆ వీడియోలకు తనదైన వ్యాఖ్యానాలు చేయడం విశేషం. అయితే ఈ వ్యాఖ్యలను సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.