పల్నాడులో పోటెత్తిన జన సునామీ..
అమలాపురంలో భారీ ర్యాలీ
చిత్తూరులో చెవిలో పూలతో నిరసన
విజయవాడ, రాజంపేటలో నిరసన ర్యాలీ..
వైసీపీ సొంత మీడియా సాక్షిలో, వైసీపీ అనుకూల సోషల్ మీడియాలో హోరెత్తిపోతున్న వార్తలివి. జూన్-4న వెన్నుపోటు దినాన్ని నిర్వహించాలంటూ ఆమధ్య జగన్ ప్రకటించిన తర్వాత స్థానిక నేతలు పక్కాగా ప్రణాళికలు రచించారు. జిల్లా కేంద్రాల్లో నిరసన ర్యాలీలు నిర్వహించారు. నియోజకవర్గ కేంద్రాల్లో కూడా ఆందోళనలు చేపట్టారు. ఎక్కడికక్కడ స్థానిక వైసీపీ నేతలు, కార్యకర్తలు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అయితే పార్టీ అధినేత ఎక్కడ అనే ప్రశ్నకు మాత్రం సమాధానం దొరకలేదు.
పల్నాడు:
మాచర్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు దినం కార్యక్రమం
మాచర్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరిన నరసరావుపేట లోక్ సభ నియోజకవర్గ పరిశీలకులు పూనూరి గౌతమ్ రెడ్డి ,పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రమా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు… pic.twitter.com/iTGMGVnVeG
— YSR Congress Party (@YSRCParty) June 4, 2025
జగన్ ఎక్కడ..?
రాష్ట్రవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీ తలపెట్టిన నిరసనల్లో ఆ పార్టీ అధినేత జగన్ ఎందుకు పాల్గొనలేదు. అసలాయన ఎక్కడికెళ్లారు. పార్టీ తరపున తానే నిరసనలకు పిలుపునిచ్చి, ఆ పిలుపుని తానే ఎందుకు ఉల్లంఘించారు. నిరసన కార్యక్రమాల్లో ఎందుకు పాల్గొనలేదు. అంతకంటే అర్జంట్ పని ఆయనకు ఏముంది..? బొత్స లాంటి సీనియర్ నేతలు సైతం ఎండలో రోడ్డెక్కి సొమ్మసిల్లి పడిపోయారు. మరి జగన్ ఎందుకు బయటకు రాలేకపోయారు..?
చలో బెంగళూరు..
గతంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ ని రాజకీయ టూరిస్ట్ లంటూ వైసీపీ నేతలు ఎగతాళి చేసేవారు. ఎప్పుడో ఒకసారి హైదరాబాద్ నుంచి ఏపీకి వచ్చేవారని విమర్శించేవారు. మరిప్పుడు జగన్ చేస్తున్న పనేంటి..? ఎక్కడో ఏదో పరామర్శకు అవకాశం వస్తేనే ఆయన బెంగళూరు నుంచి బయటకు వస్తారు. నేరుగా ఆయా ప్రాంతాలకు వెళ్లి, పని పూర్తి కాగానే బెంగళూరు చెక్కేస్తారు. ఇప్పుడు కూడా అదే జరిగింది. నిన్న తెనాలిలో రౌడీషీటర్ల కుటుంబాలను పరామర్శించిన అటునుంచి అటే బెంగళూరు వెళ్లిపోయారు. ఇంకోరోజు ఏపీలోనే ఉండి ఉంటే ఇవాళ వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమాల్లో పాల్గొనేవారు. కానీ ఆయన బెంగళూరు వెళ్లడంతో నిరసనల్లో కనపడలేదు.
పార్టీ కోసం మీరే కష్టపడండి..
జగన్ వ్యవహారమంతా పార్టీ కోసం నేతలు, కార్యకర్తలు కష్టపడాలి అన్నట్టుగా ఉంటుందనే విమర్శలు వినపడుతున్నాయి. కార్యకర్తలు ఎండలో తిరుగుతూ ర్యాలీలు చేస్తుంటే జగన్ మాత్రం హాయిగా రెస్ట్ తీసుకుంటున్నారని ఆ పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు. ఇంకో నాలుగేళ్లు కేసులు పెట్టించుకోండి, ఆ తర్వాత అధికారం మనదే, అప్పుడు తేల్చేద్దామంటూ జగన్ కార్యకర్తలకు చెబుతున్నారు. అంటే నాలుగేళ్లు వారు కష్టపడితే, కష్టాలపాలై త్యాగాలు చేస్తే.. అప్పుడు జగన్ అధికారంలోకి రావడం సులభమవుతుందనమాట. ఒకరకంగా జగన్ కి రెడ్ బుక్ పాలన అంటే చాలా ఇష్టం. రెడ్ బుక్ పేరుతో వైసీపీ నేతల్ని, అభిమానుల్ని అరెస్ట్ చేస్తుంటే.. వారిపై వచ్చే సింపతీతో వైసీపీ బలం పుంజుకోవాలనేది ఆయన ఆలోచన. అందుకే పార్టీ నేతలు త్యాగాలు చేస్తుంటే, జగన్ మాత్రం బెంగళూరు నుంచి పర్యవేక్షిస్తున్నారని చెబుతున్నారు.
జగన్ నిజంగానే ప్రజా పోరాటం చేయాలనుకుంటే, ప్రజల పక్షాన నిలబడాలనుకుంటే.. ముందు ఏపీలోనే నిలబడాలి. ఏపీలోనే ఉండి ప్రభుత్వంతో కలబడాలి. అది మానేసి, వీకెండ్ పొలిటీషియన్ లాగా బెంగళూరు-విజయవాడ షటిల్ సర్వీస్ చేస్తుంటే వైసీపీకి రాజయ భవిష్యత్ కష్టం అని అంటున్నారు విశ్లేషకులు. మరి ఈ మాటలు జగన్ చెవికెక్కించుకుంటారో లేదో చూడాలి.