YS Jagan: ప్రకాశం జిల్లా పొదిలికి పొగాకు వేలం కేంద్రానికి వచ్చిన.. మాజీ సీఎం వైఎస్ జగన్‌కు నిరసన సెగ తగిలింది. దీంతో రెచ్చిపోయిన వైసీపీ కేడర్.. కూటమి మహిళలు, యువతపై చెప్పులు, రాళ్లతో దాడికి దిగారు. దీంతో కూటమి కేడర్ కూడా ప్రతిదాడికి దిగింది. పరస్పరం రాళ్లు, చెప్పుల దాడులతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది.
అమరావతి మహిళల్ని కించపరుస్తూ జగన్ మీడియాలో.. డిబేట్ నిర్వహించిన ఘటనపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. క్షమాపణ చెప్పాకే ఆయన పొదిలిలో అడుగుపెట్టాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో నిరసన తెలుపుతున్న మహిళలపై వైసీరీ కార్యకర్తలు రాళ్లదాడికి దిగారు. ఈ దాడిలో పలువురు మహిళకు కూడా తీవ్రగాయాలు అయినట్లు తెలుస్తోంది. పరస్పర దాడుల్లో పొదిలిలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. అలాగే రాళ్ల దాడిని ఆపేందుకు ప్రయత్నించిన ఘటనలో.. ఓ కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి.
కాగా.. వైఎస్ జగన్ పొదిలిలోని పొగాకు బేళ్లను పరిశీలించారు. ధరల వివరాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. రైతులు ఎందుకు నష్టపోవాల్సి వస్తోందని ఆరా తీశారు. మరోవైపు గిట్టుబాటు ధరలు లేక అల్లాడిపోతున్న రైతులతో ముఖాముఖి నిర్వహించి.. వాళ్ల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. జగన్ రాక నేపథ్యంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఇదిలా ఉంటే.. జర్నలిస్ట్ కృష్ణం రాజు చేసిన వ్యాఖ్యలపై రేగిన దుమారం.. ఏపీలో ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మున్ముందు.. ఇది ఎక్కడివరకు దారితీస్తుందనేది అర్థం కావటం లేదు.
అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలపై రేగిన దుమారం మరింత తీవ్రమవుతోంది. ఈ కేసులో ఇప్పటికే కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్ట్ చేశారు పోలీసులు. అసభ్య వ్యాఖ్యలు చేసిన జర్నలిస్ట్ కృష్ణం రాజు కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆయనను అరెస్ట్ చేసిన తర్వాత పరిణామాలు ఎలా మారతాయన్నది కూడా ఆసక్తిగా మారింది.
మరోవైపు.. ఈ వ్యవహారంలో ఏపీలో రాజకీయ రచ్చ కొనసాగుతూనే ఉంది. ఈ కేసులో.. కొమ్మినేని శ్రీనివాసరావుకు మంగళగిరి కోర్టు రిమాండ్ విధించింది.
Also Read: మీ సావు మీరు సావండి.. దువ్వాడ, దివ్వెల డ్యాన్స్ ఇరగదీశారుగా!
ఇదే వ్యవహారంపై.. జాతీయ మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితులపై చర్యలు తీసుకోవాలని.. ఏపీ డీజీపీని ఆదేశించింది. జర్నలిస్ట్ VVR కృష్ణంరాజు టీవీ డిబేట్‌లో.. అమరావతి మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యలను జాతీయ మహిళా కమిషన్ సుమోటాగా స్వీకరించింది. అమరావతిని వేశ్యల రాజధానిగా సంబోధించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ వ్యాఖ్యలు రాజధాని ఉద్యమంలో ముఖ్య పాత్ర పోషించిన మహిళా రైతులను తీవ్రంగా అవమానించడమేనని అభిప్రాయపడింది. చట్టప్రకారం కృష్ణంరాజుపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించారు. 3 రోజుల్లోగా కృష్ణంరాజుపై తీసుకున్న చర్యలకు సంబంధించి రిపోర్ట్ పంపాలన్నారు.