ప్రపంచ వ్యాప్తంగా ఏడాదికేడాది జనాభా పెరుగుతోంది. కొన్ని దేశాల్లో బర్త్ రేట్ మరీ తక్కువగా ఉంది, వృద్ధుల సంఖ్య పెరిగిపోయి ఇబ్బందికరంగా మారింది. అయితే చైనా, భారత్ వంటి దేశాల్లో పెరుగుతున్న జనాభా.. తిరోగమన రేటుని సరిచేసి.. ప్రపంచ వ్యాప్తంగా జనాభా పెరుగుదలకు కారణం అయింది. ఈ పెరుగుదల అన్ని ప్రాంతాల్లో ఒకేరకంగా లేదు. అన్ని మతాల్లో కూడా ఒకేరకంగా లేదు. కొన్ని మతాల ప్రజల సంఖ్య విపరీతంగా పెరిగితే, మరికొన్ని మతాలు తమ ఉనికిని కోల్పోయే ప్రమాదంలో పడుతున్నాయి. ఇంతకీ ప్రపంచంలో ఏ మతం ప్రజలు ఎక్కువగా ఉన్నారు, ఏ మతం అత్యంత వేగంగా విస్తరిస్తోంది..? దానికి కారణం ఏంటి..? ఓసారి చూద్దాం.
ప్యూ రీసెర్చ్ సెంటర్..
2010 నుండి 2020 వరకు ప్రపంచ జనాభా పెరుగుదలను అత్యంత ఆసక్తికరంగా అంచనా వేసింది ప్యూ రీసెర్చ్ సంస్థ. జనాభా పెరుగుదలలో మతాన్ని క్రైటీరియాగా తీసుకుని లెక్కలు సేకరించింది. ఈ లెక్కల ఆధారంగా ప్రపంచంలో క్రైస్తవుల జనాభా అధికంగా ఉందని తేలింది. అయితే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్నది మాత్రం ముస్లిం మతం. భారత్ లో వారు మైనార్టీలు కావొచ్చు కానీ.. ప్రపంచ వ్యాప్తంగా మెజార్టీ స్థాయిలో వారి జనాభా వృద్ధి అవుతోంది.
ప్రపంచ జనాభాలో క్రైస్తవులు 28.8 శాతం
క్రైస్తవులు ప్రపంచంలోనే అతిపెద్ద మత సమూహంగా నిలిచారు. 2010 నుంచి 2020 మధ్యలో క్రైస్తవుల సంఖ్య 122 మిలియన్లు పెరిగింది. మొత్తం ప్రపంచంలో క్రైస్తవుల సంఖ్య 2.3 బిలియన్లు. 2020 నాటికి, 120 దేశాల్లో క్రైస్తవులు మెజారిటీ పాపులేషన్ గా ఉన్నారు. అంతకు ముందు 124 దేశాల్లో క్రైస్తవులే అధిక సంఖ్యాకులు. అందులో నుంచి 4 దేశాలు తమ స్థానం కోల్పోయాయి. యునైటెడ్ కింగ్‌డమ్ లో 49శాతం, ఆస్ట్రేలియాలో 47 శాతం, ఫ్రాన్స్ లో 46శాతం, ఉరుగ్వేలో 44 శాతం మంది ప్రజలు క్రైస్తవులు. మొత్తంగా ప్రపంచ జనాభాలో క్రైస్తవుల వాటా 28.8 శాతం. అయితే గతంతో పోల్చి చూస్తే వారి జనాభా 1.8 శాతం తగ్గడం గమనార్హం.
ముస్లిం జనాభా పెరుగుదల..
2010 నుంచి 2020 మధ్య కాలంలో ముస్లింల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ పదేళ్లలో ముస్లింల సంఖ్య 347 మిలియన్లు పెరిగింది. ఇది అన్ని ఇతర మతాల కంటే ఎక్కువ. ప్రపంచ జనాభాలో ముస్లింల వాటా 1.8 శాతం పెరిగి, 25.6 శాతానికి చేరుకుంది.
అతి తక్కువ సంఖ్యలో బౌద్ధులు..
2020లో తక్కువ జనాభా ఉన్న ఏకైక ప్రధాన మత సమూహం బౌద్ధులు. ప్రపంచవ్యాప్తంగా బౌద్ధుల సంఖ్య 19 మిలియన్లు తగ్గి 324 మిలియన్లకు చేరుకుంది. ప్రపంచ జనాభాలో బౌద్ధుల వాటా 0.8 పాయింట్లు తగ్గి ప్రస్తుతం 4.1 శాతంగా ఉంది.
ఏమతానికీ చెందనివారు..
మతపరమైన అనుబంధం లేని వ్యక్తులను నోన్స్ అని పిలుస్తారు. అంటే వీరు ఏ మత ఆచారాలను నమ్మరు. అంతేకాదు, తమకు మతం లేదని చెప్పుకుంటారు. ఈ నోన్స్ సంఖ్య కూడా గడచిన దశాబ్ద కాలంలో భారీగా పెరిగింది. మతపరమైన సంబంధం లేని వారి సంఖ్య 270 మిలియన్లు పెరిగి 1.9 బిలియన్లకు చేరుకుంది. అంటే ప్రపంచ జనాభాలో నోన్స్ వాటా 24.2 శాతం.
హిందువుల సంగతేంటి..?
హిందువులు, ప్రపంచ మొత్తం జనాభాతో సమానంగా పెరిగారు. గడచిన దశాబ్తంలో హిందువుల సంఖ్య 126 మిలియన్లు పెరిగి 1.2 బిలియన్లకు చేరుకుంది. ప్రపంచ జనాభాలో నిష్పత్తి ప్రకారం, హిందువులు 14.9 శాతం వద్ద స్థిరంగా ఉన్నారు. అంటే ప్రపంచ జనాభా పెరుగుతలతోపాటే హిందువుల జనాభా పెరిగింది. ముస్లిం జనాభా మాత్రం ప్రపంచ జనాభా పెరుగుదలకంటే ఎక్కువగా నమోదవడం విశేషం.