వైఎస్ వివేకా మరణం, అన్న జగన్ తో తనకున్న ఆస్తుల వివాదంపై ఇటీవల ఘాటు వ్యాఖ్యలు చేసిన షర్మిల.. వైసీపీ నుంచి వస్తున్న రియాక్షన్లపై మరోసారి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తన వెనక చంద్రబాబు ఉన్నారని, బాబు చేతిలో తాను కీలుబొమ్మనంటూ వైసీపీ నేతలు చేసి విమర్శలపై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. వైసీపీకి ఇంకా పచ్చ కామెర్ల రోగం తగ్గినట్టు లేదని ఘాటుగా బదులిచ్చారు. కళ్ళకు కమ్మిన పసుపు బైర్లు తొలగినట్లు లేదన్నారు.
అద్దంలో చంద్రబాబు..
వైసీపీ నేతలకు అద్దంలో మొహం చూసుకుంటే ఇంకా చంద్రబాబే కనపడుతున్నారని అన్నారు షర్మిల. తాను ఏది చేసినా అర్థం, పరమార్థం టీడీపీయే అనడం వారి వెర్రితనానికి నిదర్శనం అన్నారామె. ఏపీలో కాంగ్రెస్ స్వయంశక్తితో ఎదుగుతుంటే, రాష్ట్ర రాజకీయాల్లో క్రమక్రమంగా తాము పుంజుకుంటుంటే, ప్రత్యామ్నాయ పార్టీగా ప్రజల్లో ముద్ర వేసుకుంటుంటే, చూసి ఓర్వలేక, వైసీపీ నేతలు అసత్య ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. తమపై నిందలు వేయడం వైసీపీ నేతల చేతకానితనానికి నిదర్శనం అన్నారు.
YCPకి, ఆ పార్టీని మోసే సంస్థలకు ఇంకా పచ్చ కామెర్ల రోగం తగ్గినట్లు లేదు. కళ్ళకు కమ్మిన పసుపు బైర్లు తొలగినట్లు లేదు. ఇప్పటికీ అద్దంలో మొహం చూసుకున్నా చంద్రబాబు గారు కనిపించడం చాలా బాధాకరం. ఏది చేసినా అర్థం, పరమార్థం టీడీపీ అనడం వారి వెర్రితనానికి నిదర్శనం. స్వయంశక్తితో ఎదుగుతుంటే,…
— YS Sharmila (@realyssharmila) April 7, 2025
చెప్పుతో కొట్టారుగా..
గత ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితం చేసి ప్రజలు చెప్పుతో కొట్టినట్లు తీర్పునిచ్చినా.. వారి నీచపు చేష్టలు మారలేదన్నారు షర్మిల. వైసీపీ నేతలు ఇంకా అసత్యాలు వల్లె వేయడం మానుకోలేదని, నిజాలు జీర్ణించుకోలేకపోతున్నారని, వారు ఈ జన్మకు మారరనే విషయం, ప్రజలకు మరోసారి అర్థం అయిందన్నారు.
జగన్ పై ఘాటు వ్యాఖ్యలు..
జగన్ ఇంతకాలం ఎవరి సేవలో ఎవరు తరించారో అందరికీ తెలుసని, ఆయన ఎవరికి ఎవరు దత్తపుత్రుడుగా ఉన్నారో కూడా ప్రజలకు తెలుసని అన్నారు షర్మిల. తండ్రి ఆశయాలకు తూట్లు పొడిచి, రాష్ట్ర ప్రయోజనాలను ప్రధాని మోదీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వలాభంకోసం ఏపీని దోచుకుతిన్నారన్నారు. ప్యాలెస్ లు కట్టుకున్నారని, సొంత ఖజానాలు నింపుకున్నారని, ల్యాండ్ టైటిల్ యాక్ట్ తో ప్రజల ఆస్తులు కాజేయాలని చూశారని మండిపడ్డారు. రిషికొండను కబ్జా చేయాలని కూడా చూశారన్నారు.
నేను పులిబిడ్డని..
ఎవరో ఒకరి సేవలో తరించాల్సిన ఖర్మ వైఎస్ఆర్ బిడ్డనైన తనకు లేదని అన్నారు షర్మిల. పులి బిడ్డ పులిబిడ్డేనని చెప్పారు. ఏపీ వరకు BJP అంటే బాబు, జగన్, పవన్ అని చెప్పారు. ఏపీలోని అన్ని పార్టీలు బీజేపీకి గులాంగిరి చేసేవేనన్నారు. కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రతిపక్షంగా ఒంటరి పోరాటం చేస్తోందన్నారామె. చంద్రబాబుని కూడా తాను విమర్శిస్తున్నాని, ఆ విమర్శలు వినపడకపోవడం వైసీపీ నేతలు చెవిటోళ్లు అనడానికి, కనపడకపోవడానికి వారు గుడ్డి వాళ్లు అనడానికి నిదర్శనం అన్నారు షర్మిల. జగన్ కి ప్రజల శ్రేయస్సే ముఖ్యం అనుకుంటే ముందు అసెంబ్లీకి వెళ్లాలని, సూపర్ సిక్స్ పై ప్రభుత్వాన్ని నిలదీయాలని సూచించారు.
షర్మిల ఎప్పుడు ఎలాంటి విమర్శలు చేసినా, ఆమెపై వైసీపీ ఒకేరకంగా స్పందిస్తోంది. కేవలం చంద్రబాబు చెప్పడం వల్లే ఆమె వైసీపీని విమర్శిస్తున్నారంటోంది. దీంతో షర్మిల రివర్స్ అటాక్ మొదలు పెట్టారు. తానేమీ చంద్రబాబు చేతిలో కీలుబొమ్మని కాదంటూనే.. అద్దంలో చూసుకున్నా వైసీపీ నేతలకు చంద్రబాబే కనపడుతున్నారంటూ మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారామె.