MLC Addanki Dayakar: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా ఎన్నికైన అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతి, నెల్లికంటి సత్యం తదితరులు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్, శ్రీధర్ బాబు తదితర సీనియర్ నాయకులు పాల్గొన్నారు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వారితో ప్రమాణ స్వీకారం చేయించారు.
మొత్తం ఎనిమిది మంది ఎమ్మెల్సీలకు గానూ.. ఇవాళ ఏడుగురు ఎమ్మెల్సీలు మాత్రమే ప్రమాణ స్వీకారం చేశారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైనా దాసోజు శ్రవణ్ తర్వాత ప్రమాణ స్వీకారం చేస్తారని బీఆర్ఎస్ పార్టీ వర్గాల తెలిపినట్టు సమాచారం. కాగా ఎమ్మెల్యే కోటాలో కాంగ్రెస్ నుంచి విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్‌నాయక్, సీపీఐ నుంచి నెల్లికంటి సత్యం, బీఆర్‌ఎస్ నుంచి దాసోజు శ్రవణ్ ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. కరీంనగర్ పట్టభద్రులు, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు అంజిరెడ్డి, మల్క కొమరయ్య విజయం సాధించారు. అలాగే ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ స్థానం నుంచి పీఆర్‌టీయూ అభ్యర్థి శ్రీపాల్‌రెడ్డి గెలిచిన విషయం తెలిసిందే.
ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసే సమయంలో ఆయన సతీమణి నాగమణీ కొంత ఎమోషనల్ అయ్యారు. ప్రమాణ స్వీకారం తర్వాత మీడియాతో అద్దంకి దయాకర్ మాట్లాడారు. ‘అమ్మ సోనియాగాంధీ, ఏఐసీసీ పెద్దలు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో ఈ రోజు ఎమ్మెల్సీ అయ్యాను. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జిగా మీనాక్షీ నటరాజన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత పార్టీలో మంచి మార్పులు వచ్చాయి. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు నన్ను ఆశీర్వదించి ఈ రోజు చట్టసభల్లోకి పంపారు. ఇక నుంచి నేను ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిలా పనిచేస్తా. ప్రజా ఉద్యమంలో ఉన్న నాకు ప్రజల కష్టాలన్నీ తెలుసు. నేను, నా భార్య నాగమణి కలిసి ఓ నిర్ణయం తీసుకున్నాం. మాకు వచ్చే నగదులో 25 శాతాన్ని పార్టీ ఫండ్ కోసం ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. భవిష్యత్తు మరో 25 శాతం ఉద్యమకారులకు, అమరవీరుల కుటుంబాలకు వెచ్చించే ప్రయత్నం చేస్తా. ఇది అతి త్వరలోనే చేస్తా’ అని అద్దంకి దయాకర్ వ్యాఖ్యానించారు.
‘నేను ఓ దళిత కుటుంబం నుంచి వచ్చాను. ఈ రోజు నాకు సీఎం రేవంత్ రెడ్డి ఈ అవకాశం కల్పించారు. నేను ఎప్పుడు కూడా ప్రజలకు, పార్టీకి కట్టుబడి ఉంటా. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత నా పై ఉంది. నన్ను ఎప్పుడూ కూడా పార్టీ తక్కువగా చూడలేదు. పార్టీ నాకు చాలా అవకాశాలు ఇచ్చింది. అమ్మ సోనియాగాంధీ తెలంగాణ రుణం తీర్చుకునేందుకే గత పదేళ్ల నుంచి నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. జీవితాంతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతా. రేపు మా లక్ష్యం రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే’ అని ఎమ్మెల్సీ దయాకర్ వ్యాఖ్యానించారు.
ALSO READ: Rajiv Yuva Vikasam: రూ.4,00,000 స్కీంకు దరఖాస్తు చేసుకున్నారా..? ఇంకా వారం రోజులే గడువు మిత్రమా..!