YS Sharmila on Vijayasai Reddy: ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ తొలిసారిగా విజయసాయి రెడ్డి రాజీనామాపై స్పందించారు. ఈ సంధర్భంగా షర్మిళ పలు డిమాండ్స్ లేవనెత్తడం విశేషం. అసలు సత్యాలు ఇప్పటికైనా సాయిరెడ్డి చెప్పాలని షర్మిళ కోరారు. ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు ఏపీలో మరో చర్చకు దారితీశాయి. అసలు సత్యాలు ఏంటివనే అంశంలో చర్చ జరుగుతోంది.
సాయిరెడ్డి రాజీనామాపై షర్మిళ మాట్లాడుతూ.. జగన్ బీజేపీకి దత్తపుత్రుడిగా పేర్కొన్నారు. జగన్ ను కాపాడడం కోసం సాయిరెడ్డిని బీజేపీ వద్దకు పంపించాల్సిన అవసరం లేదని, ఇన్ని రోజులు సాయిరెడ్డి ఒక్కరే బీజేపీ వద్దకు వెళ్లలేదన్నారు. కేసుల నుండి బయటపడేందుకు జగన్ చేయాల్సిన పనులన్నీ చేస్తున్నట్లు షర్మిళ విమర్శించారు. ఇక సాయిరెడ్డి రాజీనామాపై షర్మిళ భిన్నంగా మాట్లాడారు. జగన్ విశ్వసనీయత కోల్పోయారు కాబట్టే, సాయిరెడ్డి పార్టీకి రాజీనామా తీసుకున్నట్లు తాను భావిస్తున్ననన్నారు.
అయితే జగన్, అవినాష్ లను కాపాడడం కోసం సాయిరెడ్డి ఎన్నో అబద్దాలు చెప్పారని, అసలు నిజాలు ఇప్పటికైనా పటాపంచలు చేయాలన్నారు. జగన్ కు అత్యంత సన్నిహితులలో సాయిరెడ్డి ఒకరని, ఆయన చేసి పెట్టని పని ఏదీ లేదన్నారు. జగన్ చెబితే చాలు.. ఏ పనైనా చేయడం, అబద్దాలు చెప్పడం సాయిరెడ్డికి అలవాటుగా మారిందన్నారు. ఆస్తుల విషయంలో సాయిరెడ్డి చేత అబద్దాలు చెప్పించారని, తన పిల్లల విషయంలో కూడ జోక్యం చేసుకున్నట్లు షర్మిళ అన్నారు. ఇంత సన్నిహితంగా ఉండే సాయిరెడ్డి రాజీనామాను చూసైనా, వైసీపీ కార్యకర్తలు, వైఎస్సార్ అభిమానులు ఆలోచించాలని కోరారు.
పార్టీకి, రాజ్యసభ పదవికి సాయిరెడ్డి రాజీనామా చేయడం చిన్న విషయం కాదని, నా అనుకున్న వారందరూ జగన్ కు దూరమవుతున్నారన్నారు. సాయిరెడ్డి లాంటి వ్యక్తే జగన్ ను వద్దనుకుంటే, జగన్ విశ్వసనీయత ఏమేరకు ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చన్నారు. నమ్ముకున్న వారికి కూడ నమ్మకం కలిగించని స్థితిలో జగన్ ఉన్నారని షర్మిళ చెప్పడం విశేషం. అయితే అసలు సత్యాలు చెప్పాలని షర్మిళ కోరింది.. ఆస్తుల విషయంలోనా? వివేకా హత్య కేసు గురించా? లేక రెండు అంశాలపై వాస్తవం చెప్పాలని కోరారా అని ఇప్పుడు పొలిటికల్ టాక్ సాగుతోంది. మరి షర్మిళ కామెంట్స్ కు సాయిరెడ్డి రిప్లై ఎలా ఉంటుందో వేచిచూడాలి.