Buddha Venkanna on Vijayasai Reddy: విజయసాయి రెడ్డి చేసిన పాపం ఊరికే పోదు.. అధికారంలో ఉన్నప్పుడు అన్నీ అక్రమాలే. ఎక్కడ చూసినా భూ ఆక్రమణలే. అంతా చేసి రాజీనామాతో చేతులు దులుపుకుంటే సరిపోదు.. మేము వదలం.. చట్టప్రకారం చర్యలు తప్పక ఉంటాయని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న అన్నారు. విజయసాయి రెడ్డి రాజీనామా ప్రకటనపై బిగ్ టీవీ నిర్వహించిన డిబేట్ లో బుద్దా వెంకన్న పాల్గొన్నారు. ఈ సంధర్భంగా సాయి రెడ్డిని ఉద్దేశించి బుద్దా సంచలన కామెంట్స్ చేశారు.
నిన్న సాయిరెడ్డి వైసీపీకి రాజీనామా చేసిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే నేడు తన రాజ్యసభ పదవికి కూడ రాజీనామా చేయగా, వెంటనే ఆమోదం కూడ లభించింది. హఠాత్తుగా సాయిరెడ్డి తీసుకున్న నిర్ణయం వెనుక ఉన్న రహస్యాలను బిగ్ టీవీ వేదికగా బుద్దా వెంకన్న పంచుకున్నారు. బుద్దా మాట్లాడుతూ.. రాజీనామా అనేది అంతా డ్రామా అన్నారు. జగన్ తో కలిసి సాయిరెడ్డి ఆడుతున్న పెద్ద గేమ్ అంటూ.. జగన్ కు అన్నీ తెలుసని, కేసులను పక్కదారి పట్టించేందుకు ఆడుతున్న నాటకమన్నారు.
సీఎం చంద్రబాబుతో విభేధాలు లేవంటే నమ్మేందుకు ఇక్కడ ఎవరూ చెవిలో పువ్వులు పెట్టుకోలేదన్న బుద్దా వెంకన్న, నాడు చంద్రబాబు కుటుంబాన్ని కూడ సాయిరెడ్డి అవమానించారన్నారు. చంద్రబాబును వ్యక్తిగతంగా దూషణలు చేసి, నేడు రాజకీయాల నుండి తప్పుకుంటూ.. విభేదాలు లేవని ప్రచారం చేసుకోవడం సాయిరెడ్డికే చెల్లిందన్నారు బుద్దా. ఇటీవల విదేశాలకు వెళ్లేందుకు సాయిరెడ్డి కోర్టును ఆశ్రయించారని, అయితే అందుకు సీబీఐ అనుమతి నిరాకరించాలని బుద్దా కోరారు. ఎన్ని నాటకాలు ఆడినా ఎవరు క్షమించినా తాను మాత్రం విజయసాయిరెడ్డిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని టీడీపీ నేత బుద్దా వెంకన్న తేల్చి చెప్పారు.
వైసీపీ మాస్టర్ మైండ్ గేమ్ ఆడుతోందని, ఆ గేమ్ కూడ త్వరలోనే బయటపడుతుందన్నారు. రాజ్యసభ సభ్యత్వం పోతుందనే ముందుగా రాజీనామా డ్రామా ఆడుతున్నట్లు, తాను మాత్రం అస్సలు నమ్మడం లేదన్నారు. వైసీపీ హయాంలో అరాచక పాలన సాగిందని, అన్ని కోట్లు జగన్, సాయిరెడ్డి ఎలా గడించారో చెప్పాలన్నారు. వారిద్దరిదీ వ్యక్తిగత బంధంతో పాటు, జైలు బంధం ఉందని అందుకే ఇద్దరూ ఒకటై ప్రజలను అమయాకులను చేస్తున్నట్లు బుద్దా విమర్శించారు.
లోకేష్ రాసిన రెడ్ బుక్ లో నెంబర్ 1 జగన్ ఉండగా, నెంబర్ 2 సాయిరెడ్డి పేరే ఉన్నట్లు తనకు తెలిసిందన్నారు. వైసీపీ అధికారంలోకి రాగానే ధనదాహంతో ఉన్న సాయిరెడ్డి చేసిన అక్రమాలకు హద్దు లేదన్నారు. సింహాచలం ఆలయ భూముల కుంభకోణం, భీమిలి బీచ్ వద్ద స్టార్ హోటల్ నిర్మాణం, ఇలా చెప్పుకుంటూ పోతే ఉత్తరాంధ్రలో భూముల ఆక్రమణల పర్వం సాయిరెడ్డి సాగించారన్నారు.
తాను సాయిరెడ్డి మాదిరిగా వయస్సు గురించి మాట్లాడనన్న బుద్దా.. అతని అక్రమాలపైనే మాట్లాడుతానంటూ చురకలు అంటించారు. సుమారు రూ. 5 వేల కోట్ల విలువగల భూముల అక్రమాలకు సాయిరెడ్డి తెర లేపారని, వాటిని వదిలే ప్రసక్తే లేదన్నారు. తమ కూటమి గెలుపుకు మొదటగా సహకరించిన ఘనత జగన్ కు దక్కితే, రెండవ స్థానంలో సాయిరెడ్డి ఉంటారన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉత్తరాంధ్రలో ప్రజలు రోదించారని, ఆ కారకులను తాము చట్టరీత్యా శిక్షించే వరకు వదలమని బుద్దా పునరుద్ఘాటించారు.
శుభామా అంటూ అధికారం చేజిక్కించుకొని టెంకాయ కొట్టి సచివాలయంలో ప్రవేశించాల్సిన జగన్, తొలుత ప్రజావేదిక కూల్చి తన అధికారాన్ని కోల్పోయారన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి వల్లే సాయిరెడ్డి పార్టీ నుండి బయటకు వచ్చారని, కానీ అది వారి వ్యక్తిగత విషయమన్నారు. రాజీనామా అనేది జగన్నాటకమని, డబ్బుపై ఉన్న వ్యామోహంతో చేసిన అక్రమాలను కప్పిపుచ్చుకొనేందుకు ఆడిన డ్రామా అంటూ బుద్దా అభివర్ణించారు. అయితే మీడియా రంగంలోకి సాయిరెడ్డి వస్తున్నట్లు వదంతులు వ్యాపిస్తున్నాయి కదా అంటే.. బుద్దా ఇచ్చిన సమాధానం ఒక సంచలనమేనని చెప్పవచ్చు.
Also Read: Vijayasai Reddy: విజయసాయిది ‘రాజీ’ డ్రామా? జనాలు.. వెర్రోళ్లా?
దీనికి బుద్దా స్పందిస్తూ.. దోచుకున్న డబ్బుతో పెట్టిన ఛానెల్ లో అవినీతి చేయడం ఎలా? సూట్ కేసులు మోయడం ఎలా? దోచుకోవడం ఎలా అనే వాటిని వివరిస్తారా అంటూ ప్రశ్నించారు. అంతేకాదు ఛానెల్ పేరు మాత్రం విజయశాంతి అంటూ నామకరణం చేస్తారని బుద్దా చెప్పడం కొసమెరుపు. మొత్తం మీద రాజీనామా అనేది డ్రామా అంటూ బిగ్ టీవీ నిర్వహించిన సమీక్షలో టీడీపీ ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న తేల్చిచెప్పారు. మరి బుద్దా చేసిన కామెంట్స్ కి విజయసాయి రెడ్డి రిప్లై ఏవిధంగా ఉంటుందో వేచిచూడాలి.