YS Sharmila: వైసీపీ అధినేత జగన్ విషయంలో షర్మిల చెప్పింది అక్షరాలా నిజమైంది. బయటకు ఒకలా.. లోపల మరోలా చేస్తారని పదే పదే చెబుతూ వస్తున్నారు. సరిగ్గా అలాగే చేశారు మాజీ సీఎం. బీజేపీతో జగన్‌కు బంధం ఉందన్న విషయం ఉపరాష్ట్రపతి ఎన్నిక ద్వారా మరోసారి రుజువైందన్నారు ఏపీ కాంగ్రెస్ చీఫ్.
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే మద్దతు ఇస్తున్నట్లు వైసీపీ నేత బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ఈ విషయంలో ఎవరు ఏమనుకున్నా పట్టించుకోలేదు. జగన్ వ్యవహార శైలిపై దుమ్మెత్తిపోశారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల. ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థికి వైసీపీ మద్దతు ప్రకటించడంపై ఎక్స్ వేదికగా రియాక్ట్ అయ్యారు. మోడీకి జగన్ దత్తపుత్రుడు అని మరోసారి అర్థమైందన్నారు.
లోపలున్న కాషాయ కండువా మరోసారి బయటపడిందని రాసుకొచ్చారు. బీజేపీకి వైసీపీకి బీ టీమ్ అని నిజ నిర్ధారణ జరిగిందన్నారు. ఏపీలో ప్రతిపక్షం ముసుగులో ఉన్నది మోడీ పక్షమేనని తేటతెల్లమైందన్నారు. బీజేపీ కోసం పని చేసే పక్షమేనని తెలియజేశారు. BJP అంటే బాబు-జగన్-పవన్ అంటూ కొత్త నిర్వచనం చెప్పారు.
ఈ ముగ్గురు మోడీ తొత్తులేనని విమర్శించారు. బీజేపీకి ఊడిగం చేసే బానిసలేనని మనసులోని మాట బయటపెట్టారు. టీడీపీ-జనసేన పార్టీలు తెర మీద పొత్తు పెట్టుకోగా, వైసీపీది తెర వెనుక అక్రమ పొత్తుగా వర్ణించారు. వైసీపీ తీరు రాష్ట్రంలో కూటమి పక్షాలతో కుస్తీ.. ఢిల్లీలో దోస్తీ అంటూ పేర్కొన్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీయే అభ్యర్థికి మద్దతు ఇవ్వడానికి వైసీపీకి సిగ్గుండాలన్నారు.
ALSO READ: అటవీ సిబ్బందిపై దాడి ఘటనలో కొత్త ట్విస్ట్
అవినీతి కేసులకు భయపడి బీజేపీకి మళ్ళీ దాసోహం అయ్యారని రాసుకొచ్చారు. ఐదేళ్లు దోచుకున్నది దాచుకోడానికి జై కొట్టారని ఆరోపించారు. ఓటు చోరీతో రాజ్యాంగం ఖూనీ అయ్యేది వైసీపీకి కనిపించదని, ప్రజాస్వామ్యాన్ని ప్రధాని మోడీ అపహాస్యం చేస్తుంటే విమర్శించడానికి నోరు రాలేదన్నారు. మణిపూర్, గోద్రా అల్లర్లలో ఆర్ఎస్ఎస్ చేస్తున్న ఆగడాలపై మౌనం వహిస్తున్నారని అన్నారు.
బీజేపీ అక్రమాలు బయటపెట్టే ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీపై ఉవ్వెత్తున లేస్తారని పేర్కొన్నారు. ప్రతిపక్షాలన్నీ కలిసి రాజకీయాలతో సంబంధం లేని తెలుగు వ్యక్తి ఉపరాష్ట్రపతి అభ్యర్థి నిలబెట్టిందన్నారు. బీజేపీ నిలబెట్టిన RSS వాదికి మద్దతు ఇస్తారా? ఇది తెలుగు ప్రజలకు చేసిన ద్రోహం కాదా? అంటూ ప్రశ్నలు లేవనెత్తారు. దీనిపై ఏపీ ప్రజలకు వైసీపీ కచ్చితంగా సమాధానం చెప్పాలని నిలదీశారు వైఎస్ షర్మిల.
YCP @YSRCParty ముసుగు మళ్ళీ తొలగింది. లోనున్న కాషాయ కండువా మరోసారి బయటపడింది. బీజేపీకి @BJP4India బీ-టీం అని నిజ నిర్ధారణ జరిగింది. మోడీ @narendramodi గారికి దత్తపుత్రుడే అని రాష్ట్ర ప్రజలకు కుండబద్దలు కొట్టినట్లు అర్ధం అయ్యింది. ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం ముసుగులో ఉన్నది మోడీ గారి…
— YS Sharmila (@realyssharmila) August 22, 2025