BigTV English

Vijayawada CMO : సీఎం సార్.. బిల్లులెక్కడ ? జగన్ చుట్టూ నేతల ప్రదక్షిణలు..

Vijayawada CMO : సీఎం సార్.. బిల్లులెక్కడ ? జగన్ చుట్టూ నేతల ప్రదక్షిణలు..

Vijayawada CMO : వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, మాజీ మంత్రులు ముఖ్యమంత్రి కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. వైసీపీ హయాంలో చేసిన పనులకు బిల్లులు రావడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సీటు రావడం కంటే తాము చేసిన పనులకు బిల్లులు రావడమే ముఖ్యమంటూ ముఖ్యమంత్రి కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. వందల నుంచి వేల కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నిసార్లు సీఎంఓ చుట్టూ తిరిగినా అపాయింట్మెంట్ కూడా దొరకటం లేదని ఆందోళన చెందుతున్నారు. సీఎం మాట అటుంచితే.. సీఎంఓ అధికారులు కూడా బిల్లులు మాటెత్తితే ముఖం చాటేస్తున్న వైనం కనిపిస్తుంది. ఒకపక్క రాజీనామాల పర్వం కొనసాగుతుంటే, మరోపక్క బిల్లుల కోసం నేతలు పాట్లు పడుతున్నారు. ఏపీ ప్రభుత్వంలో అసలేం జరుగుతోంది?


ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ నేతలకు పండుగే పండుగ.. తమ ప్రాంతంలో కాంట్రాక్టులు జేబులో పడ్డట్లే. టెండర్ ఎంతకేసినా తమకే మొదటి ప్రాధాన్యత.. సో నో ప్రాబ్లమ్.. నియోజకవర్గాల నేతలు సాధారణంగా ఉండే ఆలోచనా విధానం ఇలాగే ఉంటుంది. ఐదేళ్ల పాటు ఆడిందే ఆట పాడిందే పాటలా ఉన్నప్పటికీ ఇప్పుడు అదే వారి నెత్తి మీద కొచ్చింది. కాంట్రాక్టులైతే దక్కాయి కానీ ప్రభుత్వం నుండి బిల్లులు పాస్ కాక నానా తంటాలు పడుతున్నారు. ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. మరో వంద రోజులే సమయం ఉంది. ఇక.. రాబోయే ఫలితాలు ఎలా ఉంటాయో తెలియక అంతా టెన్షన్ పడుతున్నారు. ఇలాంటి క్లిష్టమైన వాతావరణంలో కాంట్రాక్టులు చేసుకుంటున్న నేతల పరిస్థితి అధ్వాన్నంగా మారినట్లు తెలుస్తోంది.

ప్రతి నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, నియోజకవర్గంలో ముఖ్యమైన నాయకులు తాము చేసిన పనులకు బిల్లులు రాక మూడు సంవత్సరాల నుంచి నానా ఇబ్బందులకు గురవుతున్నట్లు తెలుస్తుంది. ఒకవైపు ముఖ్యమంత్రిని కలిస్తే సీఎం కార్యదర్శి ధనుంజయ రెడ్డి ని కలవమంటున్నారు.. ధనుంజయ్ రెడ్డిని కలిస్తే ఆ శాఖకు సంబంధించిన కార్యదర్శులు కలవమని చెబుతున్నారు.. అధికారులను కలుస్తున్నా సంవత్సరాలు గడిచిపోతున్న పరిస్థితి ఏర్పడింది. “బిల్లులు రావడం లేదని ముఖ్యమంత్రిని అనేకసార్లు కలిసిన తర్వాత కూడా తమ బిల్లులు అవ్వలేదంటూ” ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇటీవల స్వయంగా మీడియా ఎదుట వాపోయారు. 50-60 కోట్ల రూపాయలకే సంవత్సరాలు పడుతుంటే ఇక తమ పరిస్థితి ఏంటని వందల కోట్లు వెచ్చించిన నేతలు ఆందోళన చెందుతున్నట్లు సమాచారం.


రోడ్డు, భవనాల శాఖ పనులు చేసిన పలువురు కాంట్రాక్టర్లకు బిల్లులు భారీగా పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తుంది. వివిధ కేటగిరీలకు సంబంధించి ఉమ్మడి విశాఖ జిల్లాలో 30 మందికి వంద కోట్ల రూపాయలకుపైగా ప్రభుత్వం చెల్లించాల్సి ఉన్నట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లాల్లోనే ఇలాంటి పరిస్థితే కనిపిస్తుందని అంటున్నారు. బిల్లుల కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నా ప్రయోజనం లేకుండా పోయిందని వాపోతున్నారు. వాస్తవానికి రోడ్లు, భవనాల శాఖ పరిధిలో గత ప్రభుత్వ హయాంలో చేసిన కొన్ని పనులకు సంబంధించిన బిల్లులు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తొలినాళ్లలో పెండింగ్‌లో పెట్టింది. పాత బిల్లులు కూడా చెల్లిస్తామని ప్రభుత్వం నుంచి హామీ రావడంతో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త పనులు చేసేందుకు చాలామంది కాంట్రాక్టర్లు ముందుకువచ్చారు. అయితే.. ఆయా పనులు చేసిన కాంట్రాక్టర్లకు పాత, కొత్త బిల్లులు చాలాకాలం చెల్లించలేదు.

రెండేళ్లపాటు బిల్లులు చెల్లించకపోవడంతో అనేక పనులు కోసం ఆర్‌అండ్‌బీ అధికారులు టెండర్లు ఆహ్వానించినప్పటికీ కాంట్రాక్టర్ల నుంచి స్పందన లేని పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రభుత్వ పెద్దలు అప్పటివరకు పెండింగ్‌లో ఉన్న బిల్లులు క్లియర్‌ చేసేందుకు అవసరమైన నిధులు విడుదల చేశారు. ఇకపై బిల్లులు చెల్లింపులో జాప్యం లేకుండా చూస్తామని, పనులు చేసేందుకు ముందుకురావాలని ప్రభుత్వం నుంచి పిలుపు వచ్చింది. దీంతో పలువురు కాంట్రాక్టర్లు మళ్లీ పనులు చేసేందుకు ముందుకువచ్చారు. ఇప్పుడు వారు కూడా బిల్లుల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నట్లు తెలుస్తోంది.

ముఖ్యంగా రాయలసీమ కోస్తాంధ్ర జిల్లాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు, వారి అనుచరులు ఈ ప్రభుత్వ హయాంలో చేసిన వేల కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తుంది. దీనితో, ఆయా కాంట్రాక్ట్‌లు దక్కించుకున్న ప్రజాప్రతినిధులు గగ్గోలు పెడుతున్నారు. ఇలా బిల్లులు పెండింగ్ పెట్టుకుంటూ పోతే రానున్న ఎన్నికలలో మేము ఎలా పోటీ చేయాలో అర్థం కావట్లేదని వాపోతున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఉపాధి హామీ, రోడ్లు, మిగిలిన కాంట్రాక్టర్లకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న రెండువేల కోట్ల రూపాయలు నిధులు విడుదల చేస్తామని చెప్పడంతో.. టిడిపి నుంచి రాష్ట్రవ్యాప్తంగా వందల సంఖ్యలో వైసీపీలో చేర్చుకున్నట్లు తెలుస్తుంది. అయితే, వారిలో సగం మందికి కూడా సదరు నిధులు విడుదల చేయలేదనే టాక్ నడుస్తోంది. ఇప్పుడు ఈ కాంట్రాక్టర్ల పరిస్థితి అటు టిడిపికి వెళ్లలేక.. ఇటు వైసీపీలో ఉండలేక, రెంటికీ చెడ్డ రేవడిలా మారింది.

Related News

Viveka Murder Case: వివేకా హత్యకేసు విచారణలో కీలక మలుపు..

ZPTC Fightings: భగ్గుమన్న పులివెందుల.. మంత్రి ఎదుటే కొట్టుకున్న టీడీపీ, వైసీపీ కార్యకర్తలు

Pulivendula ZPTC: పులివెందుల, ఒంటమిట్టలో ముగిసిన పోలింగ్

AP Free Bus Scheme: ఆగస్ట్ 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం – స్త్రీశక్తి పథకంపై సీఎం సమీక్ష

AP Asha Workers: ఆశా వర్కర్లకు ఏపీ సర్కార్ బంపర్ ఆఫర్.. ఆరోగ్యం, భవిష్యత్తు భరోసా!

Pulivendula ZPTC: ఏపీ పాలిటిక్స్ @ పులివెందుల

Big Stories

×