ప్రస్తుతం ఏపీలో ఎక్కడ విన్నా తల్లికి వందనం అనే మాట వినపడుతోంది. ప్రచారం పెద్దగా లేదు, బటన్ నొక్కడం అసలే లేదు, ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ పథకాన్ని సింపుల్ గా అమలులోకి తెచ్చేసింది కూటమి ప్రభుత్వం. తల్లికి వందనం పథకం మామూలుగా అమలు చేసి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదేమో. కానీ ఏడాది వాయిదా వేసి మరీ ప్రతిపక్షాన్ని గట్టి దెబ్బకొట్టింది కూటమి ప్రభుత్వం. ఈలోగా మీకు 15వేలు, మీకు 15 వేలు అంటూ ప్రతిపక్షం రచ్చ రచ్చ చేసింది. కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఈ పథకం అమలు చేయడం సాధ్యం కాదని పేర్కొంది. కానీ ఇప్పుడు ఆ పథకం సైలెంట్ గా అమలులోకి వచ్చి వైసీపీని డిఫెన్స్ లో పడేసింది. కనీసం ఆ పథకం అమలుపై స్పందించాలని అడిగినా కూడా మాజీ మంత్రులు మొహం చాటేస్తున్నారు.
"తల్లికి వందనం" పధకం పేరు వింటేనే పరార్.. ప్రజల్లో సూపర్ రెస్పాన్స్ రావటంతో, కక్కలేక మింగలేక "తల్లికి వందనం" పేరు వింటేనే వణికిపోతున్న వైసీపీ నేతలు.#HappyMothersInAP#TallikiVandanam#PromiseDelivered#IdhiManchiPrabhutvam#ChandrababuNaidu#NaraLokesh#AndhraPradesh pic.twitter.com/pnhEpVGEyR
— Telugu Desam Party (@JaiTDP) June 14, 2025
మామయ్య పరిస్థితి ఏంటి..?
అమ్మఒడి పథకంతో విద్యార్థులందరికీ తాను మేనమామని అని చెప్పుకున్నారు జగన్. వేదికలపై కూడా జగన్ మామయ్యా అంటూ గొంతెత్తి పిలిచిన విద్యార్థులు ఆ పేరుని బాగా పాపులర్ చేశారు. ఇప్పుడు కూడా జగన్ ఎక్కడికి వెళ్లినా మామయ్యా అంటూ ఎవరో ఒకరు పిలుస్తూనే ఉంటారు. వైరి వర్గాలు ఆ పిలుపుని కామెడీ చేసినా, జగన్ మాత్రం సంబరపడిపోతుంటారు. సీఎం కుర్చీకే కాదు, 11 సీట్లతో ప్రతిపక్ష హోదాకి కూడా దూరం చేసినా.. సీఎం అంటూ వైసీపీ కార్యకర్తలు చేసే నినాదాలు కూడా జగన్ కి ఎక్కడలేని సంతోషాన్నిస్తాయి. అయితే ఇప్పుడు ఏపీలో విద్యార్థులు ఇంకా జగన్ మామయ్యని గుర్తు పెట్టుకుంటారా..? అమ్మఒడితో 13వేలు జమ చేసి కుటుంబంలో ఒకరికి జగన్ మామయ్య అయితే, ప్రతి పిల్లవాడికి 13వేల రూపాయలు జమచేసి, కుటుంబంలో పిల్లలందరికీ మేనమామ అయ్యారు లోకేష్. వాస్తవానికి లోకేష్ ఇలాంటి ప్రచారం చేసుకోవడం లేదనుకోండి. అయితే సోషల్ మీడియాలో టీడీపీ శ్రేణులు జగన్ పై విరుచుకుపడిపోతున్నాయి. జగన్ మామయ్య పని అయిపోయిందని అంటున్నాయి. తల్లికి వందనం అమలుతో జగన్ మామయ్యని అందరూ మరచిపోయారని టీడీపీ కౌంటర్లిస్తోంది.
తల్లికి వందనం పథకం పథకం విషయంలో ఏడాదిగా వైసీపీ చేసిన విమర్శలే ఇప్పుడు వారిని వెక్కిరిస్తున్నాయి. మీకు 15వేలు, మీకు 15వేలు అంటూ జగన్ చేసిన కామెడీనే ఈ పథకానికి ప్రచార అస్త్రంగా వాడుకుంటోంది కూటమి ప్రభుత్వం. అయితే ఇక్కడ 15వేలు బదులుగా కేవలం 13వేలే ఇస్తున్నారంటూ వైసీపీ చేస్తున్న విమర్శలు కూడా వారికే రివర్స్ లో తగులుతున్నాయి. వైసీపీ హయాంలో కూడా 13వేలే ఇచ్చారు, మరిప్పుడు కూటమి ప్రభుత్వాన్ని ఆ పార్టీ నేతలు ఎలా విమర్శిస్తారని సామాన్యులు కూడా ప్రశ్నిస్తున్నారు. ఎంతమంది పిల్లలు ఉంటే వారందరికీ లెక్కగట్టి తల్లికి వందనం నిధులు ఆ కుటుంబ ఖాతాల్లో జమ అయ్యాయి. ఈ పథకం అమలుతో గ్రామాల్లో చాలామంది సంతోషంగా ఉన్నారు. ముగ్గురు, నలుగురు పిల్లలున్నవారు సంబరాలు చేసుకుంటున్నారు.
స్కూల్స్ రీఓపెన్ రోజే తల్లికి వందనం నిధులు జమ చేసి కూటమి ప్రభుత్వం అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఈ పథకంపై గత కొన్నిరోజులుగా చర్చ జరుగుతున్నా.. ఫలానా తేదీ నిధులు జమ చేస్తామని ఎక్కడా అధికారికంగా ప్రకటించలేదు. చివరికి ఒకరోజు ముందే హింటిచ్చేశారు, నిధులు విడుదల చేశారు. ఎక్కడా బటన్ నొక్కడం వంటి హడావిడి లేదు. నేతల పొగడ్తల వర్షం లేనే లేదు. స్వచ్ఛందంగా తల్లిదండ్రుల మాటల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు కొందరు. వారి మాటల్లో ఆనందం వర్ణనాతీతం. ఇదే ఇప్పుడు వైసీపీకి ఇబ్బందిగా మారింది. వైసీపీ కార్యకర్తల్లో కూడా చాలామందికి తల్లికి వందనం డబ్బులు జమయ్యాయి. వారు కూడా కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞత చెప్పుకుంటున్నారు.