ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారిపోతున్నాయి. ఓవైపు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు అనర్హత వేటు పడుతుందేమోనని దొంగచాటుగా అసెంబ్లీకి వచ్చి రిజిస్టర్ లో సంతకాలు పెట్టి వెళ్లిపోతున్నారు. అటు వైసీపీ అధినేత జగన్ మాత్రం ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే తాను అసెంబ్లీకి వస్తానని భీష్మించుకు కూర్చున్నారు. ఇక మరో వైపు శాసన మండలిలో కూడా రాజకీయం ఆసక్తికరంగా మారింది. వైసీపీ నుంచి మొత్తంగా ఐదుగురు ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. కానీ వారిలో ఏ ఒక్కరి రాజీనామాకు కూడా ఇంకా ఆమోదం లభించలేదు. అసలు ఆమోదిస్తారా, లేదా అనేది అయోమయంగా ఉంది.
ఏపీలో వైసీపీ ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ తాజాగా తన పదవికి రాజీనామా చేశారు. అయితే ఇక్కడో ట్విస్ట్ ఉంది. ఆ రాజీనామాను చైర్మన్ ఆమోదిస్తారా లేదా, ఒకవేళ ఆమోదిస్తే ఎప్పుడనేది సస్పెన్స్ గా మారింది. ఆల్రడీ నలుగురు వైసీపీ ఎమ్మెల్సీలు ఇప్పటికే రాజీనామా చేశారు. వారి రాజీనామాలనే ఇంతవరకు ఆమోదించలేదు. ఇప్పుడిక కొత్త రాజీనామాకు మోక్షం ఉంటుందా లేదా అనేది అనుమానం. తమ రాజీనామాలను వెంటనే ఆమోదించాలంటూ మండలిలో ముగ్గురు ఎమ్మెల్సీలు చైర్మన్ ని మరోసారి కోరడం ఇక్కడ విశేషం. బాబ్బాబు మా రాజీనామాలు ఆమోదించి మమ్మల్ని బయటకు పంపేయండి అంటూ వైసీపీ ఎమ్మెల్సీలు చైర్మన్ ని వేడుకుంటున్నారు.
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కొంతమంది వైసీపీకి దూరంగా జరిగారు. ఇంకొంతమంది నేరుగా టీడీపీ, జనసేన, బీజేపీ వైపు అడుగులు వేశారు. పదవిలో ఉండగా కండువా మార్చుకోవడం కరెక్ట్ కాదు కాబట్టి.. కొందరు రాజ్యసభ సభ్యులు తెలివిగా పదవికి రాజీనామా చేసి, ఆ తర్వాత కండువా మార్చుకుని, తిరిగి అదే పదవి అందుకున్నారు. ఎమ్మెల్సీలు కూడా ఇదే వ్యూహంతో రాజీనామా చేయాలనుకున్నారు. కానీ వారి రాజీనామాలను మండలి చైర్మన్ మోషేను రాజు అంగీకరించడం లేదు. ఆయన వైసీపీ నేత. వైసీపీకి వ్యతిరేకంగా ఎలాంటి రాజకీయ నిర్ణయాలు తీసుకోరని టీడపీ నేతలు అంటున్నారు. శాసన మండలి చైర్మన్ కి రాజకీయాలు ఆపాదించలేం కాబట్టి, ఏదో ఒక బలమైన నిర్ణయంతోనే ఆయన రాజీనామాల విషయంలో సైలెంట్ గా ఉన్నారని అనుకోవాలి.
వైసీపీ ఎమ్మెల్సీలు కర్రి పద్మశ్రీ, జయమంగళ వెంకట రమణ, బల్లి కల్యాణ్ చక్రవర్తి, పోతుల సునీత ఆల్రడీ రాజీనామాలు సమర్పించారు. వీరిలో పోతుల సునీత మండలికి హాజరు కావడం లేదు. మిగతా ముగ్గురు వస్తున్నారు కానీ అన్య మనస్కంగానే ఉన్నారు. ఆ ముగ్గురు తాజాగా మండలి చైర్మన్ మోషన్ రాజుకి మరోసారి తమ రాజీనామాను ఆమోదించాలని విన్నవించారు. వ్యక్తిగత కారణాలతో తాము రాజీనామా చేశామని, వెంటనే ఆమోదించాలన్నారు. ఆ రాజీనామాల విషయం తేలకముందే ఇప్పుడు మర్రి రాజశేఖర్ కూడా రాజీనామా చేశారు. దీంతో మొత్తం ఐదుగురు మండలినుంచి బయటకు వెళ్లాలనుకుంటున్నారనమాట. వీరి అసలు ఉద్దేశం వైసీపీ నుంచి బయటపడటం, ఆ తర్వాత మెల్లిగా కూటమి కోటాలో ఎమ్మెల్సీలుగా మారడం. సో.. మండలి చైర్మన్ ఒకరకంగా వీరి ఆశలపై నీళ్లు చల్లుతున్నారనమాట.