ఏపీలో మత కల్లోలాలు జరిగేందుకు కొంతమంది కుట్ర చేస్తున్నారా..? దీనికేమైనా ఆధారాలున్నాయా..? అసలు అలా ప్రయత్నం చేస్తోంది ఎవరు..? వారి ప్రయత్నాలు నిజంగానే సక్సెస్ అవుతాయా..? సోషల్ మీడియాలో ఎవరో పోస్టింగ్ పెడితే పెద్దగా ఆలోచించాల్సిన పనిలేదు కానీ, సాక్షాత్తూ ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత ఈ కామెంట్స్ చేశారు. ఏపీలో మత కలహాలు సృష్టించాలని కొంతమంది ప్రయత్నిస్తున్నట్టు ఆమె తెలిపారు. ఇంతకీ ఆమె ఎందుకా కామెంట్స్ చేశారు..? ఆ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా ఎందుకు మారాయి..?
వైసీపీ కుట్ర..!
ఏపీ కేబినెట్ భేటీ తర్వాత మీడియాతో మాట్లాడిన హోం మంత్రి వంగలపూడి అనిత రాష్ట్రంలోని శాంతి భద్రతల అంశంపై సూటిగా స్పందించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం కలిగించేందుకు కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నారని ఆమె మండి పడ్డారు. గతంలో ఎప్పుడూ లేని సంఘటనలు ఇప్పుడు జరుగుతున్నాయని అన్నారు. వైసీపీ నేతలు వెనక ఉండి ఈ కుట్రలకు పాల్పడుతున్నారని ఆమె చెప్పారు. జగన్ రాజకీయం ఇలాగే ఉంటుందని, ప్రభుత్వంపై బురదజల్లేందుకు ప్రజల మధ్య చిచ్చు పెట్టడం వారికి అలవాటేనన్నారు అనిత.
రాష్ట్రంలో మతకలహాలు సృష్టించాలని కుట్రలు చేస్తున్నారు: హోం మంత్రి అనిత
శాంతి భద్రతలకు భంగం కలిగించేందుకు అనేక కుయుక్తులు పన్నుతున్నారు.
తితిదేపై బురద జల్లి ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు.
పాస్టర్ ప్రవీణ్ అంశంపై కొందరు… pic.twitter.com/H84IVL3lF3— ChotaNews App (@ChotaNewsApp) April 15, 2025
తిరుమల సెంటిమెంట్..
తిరుమల ఆధ్యాత్మిక ప్రదేశం అని, దానిపై అందరికీ సెంటిమెంట్ ఉంటుందని చెప్పారు హోం మంత్రి అనిత. అలాంటి పరిస్థితుల్లో ఒక అబద్ధపు ప్రచారాన్ని నిజం లాగా చూపించేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారని ఆమె అన్నారు. గతంలో టీటీడీ చైర్మన్ గా పనిచేసిన వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణం అన్నారు. మత ఘర్షణలకోసమే వారు ఇలా మాట్లాడుతున్నారని అన్నారు అనిత. గతంలో పింక్ డైమండ్ పేరుతో దుష్ప్రచారం చేశారు అనిత. అప్పట్లో ఆర్కియాలజీ డిపార్ట్ మెంట్ కూడా వివరణ ఇచ్చిందని, ఏదో రకంగా టీటీడీ పేరుతో ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడం వారి పని అని చెప్పారు. గోశాల విషయంలో సాక్షాత్తూ టీటీడీ ఈవో వివరణ ఇచ్చినా కూడా వైసీపీ ఆరోపణలు చేయడం దారుణం అన్నారు. వైసీపీ హయాంలో గోశాలలోకి విజిలెన్స్ వారికి కూడా అనుమతి లేదని, ఇప్పుడు మాత్రం తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు అనిత.
పాస్టర్ ప్రవీణ్ ఉదంతం..
పాస్టర్ ప్రవీణ్ పగడాల ఉదంతం దీనికి మరో ఉదాహరణ అన్నారు హోం మంత్రి అనిత. ప్రవీణ్ ని ఓన్ చేసుకుని, వారికి సంబంధించిన కొంతమందితో మతాల మధ్య చిచ్చు పెట్టేలా మాట్లాడించారని అన్నారు. ఒక పాస్టర్ అలాంటి మాటలు మాట్లాడరని, కానీ ప్రవీణ్ మరణం తర్వాత కొంతమంది రోడ్లపైకి వచ్చి రెచ్చగొట్టేలా మాట్లాడారని చెప్పారు. ఈ ఘటనలో ప్రభుత్వం సంయమనం కోల్పోకుండా ఉందని, పోలీస్ డిపార్ట్ మెంట్ బ్యాలెన్స్ డ్ గా ఉండి విచారణ జరిపించిందని చెప్పారు. నర్సన్నపేటలో ఒక గుడిలో జీసస్ వర్డ్స్ రాయించారని, చర్చిలో జై శ్రీరామ్ అని రాయించారని.. ఏదో రకంగా మత కల్లోలాలు సృష్టించడమే వారి పన్నాగంగా ఉందన్నారు అనిత. ఒక క్రిమినల్, రాజకీయాల్లో ఉంటే ఎలాంటి సంఘటనలు జరుగుతాయో, ఇప్పుడు అవే జరుగుతున్నాయని అన్నారు. వారు ఏదో ఊహించుకుని చేయాలనుకుంటే కుదరదని, తామంతా గట్టిగా అడ్డుకుంటామని చెప్పారు అనిత.