Vijayasai Reddy: గత కొన్నేళ్ల నుంచి వైసీపీలో కీలక నేతగా ఉన్న రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి నిన్న రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆయన రాజీనామా చేయడం వైసీపీ శ్రేణులు ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే కాసేపటి క్రితమే విజయసాయి రెడ్డి రాజీనామై సోషల్ మీడియాలో ఎక్స్‌లో వైసీపీ ట్వీట్ చేసింది.
‘మేం విజయసాయి రెడ్డి పార్టీకి రాజీనామా చేయడం ఆమోదించలేదు. అయినప్పటికీ ఆయన నిర్ణయాన్ని మేం గౌరవిస్తున్నాం. వైసీపీ ఆవిర్భావం నుంచి ఆపద సమయాల్లో.. విజయాల్లో మా వెంట ఉన్న ముఖ్యమైన వ్యక్తుల్లో ఆయన ఒకరు. విజయసాయి రెడ్డి రాజకీయాలకు దూరంగా ఉండి వ్యవసాయ పనులు చేసేందుకు ఆయన తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తున్నాం. పార్టీకి ఆయన చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఆయనకు భవిష్యత్తులో అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాం.’ అని వైసీపీ ట్విట్టర్ వేదికగా స్పందించింది.
అయితే.. ఈ రోజు ఉదయం తన పదవికి విజయసాయి రెడ్డి రాజీనామా చేయగా.. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధనకర్ ఆమోదించారు. విజయసాయి రెడ్డి రాజీనామాను ఆమోదించినట్లు పేర్కొంటూ రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోడీ ప్రకటన కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే.
రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన విజయసాయరెడ్డి వ్యవసాయంపై దృష్టి సారిస్తానని చెప్పారు. రాజీనామా చేయడమనేది తన వ్యక్తిగత నిర్ణయమని చెప్పారు. మొదటి నుంచి నన్ను నమ్మి ఆదరించిన వైఎస్ కుటుంబానికి రుణపడి ఉంటానని పేర్కొన్నారు. పార్టీలో కీలక బాధ్యతలు అప్పజెప్పిన జగన్‌కు.. ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన భారతమ్మకు ధన్యవాదాలు తెలియజేశారు. రాజకీయాలల్లో జగన్‌కు అంత శుభమే జరగాలని కోరుకుంటానని చెప్పారు.
వైఎస్సార్సీపీలో కీలక నేతగా.. పార్టీ తరఫున రాజ్యసభ ఎంపీగా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా.. అలాగే రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎళ్లవేళలా కృషి చేశానని చెప్పుకొచ్చారు. కేంద్ర, రాష్ట్రాల మధ్య వారధిలాగా పని చేశానని చెప్పుకొచ్చారు. ఇంత కాలంత తన వెన్నంటే ఉండి, ప్రోత్సహించి కొండంత బలాన్ని, మనోధైర్యాన్నిచ్చి తెలుగురాష్ట్రాల్లో తనకు గుర్తింపునిచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి, హోం మంత్రి అమిత్ షాకి విజయసాయి రెడ్డికి కృతజ్ఞతలు చెప్పారు.
అయితే.. పార్టీలో ముఖ్య నేతగా ఉన్న విజయసాయి రెడ్డి రాజీనామా చేయడంపై వైసీపీ శ్రేణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు పక్కనే ఉండి మూలస్థంబంలా నిలబడిన వ్యక్తి రాజకీయాలకు దూరం కావడం తమకు ఆందోళనకు గురి చేసిందని సోషల్ మీడియా వేదికగా వైసీపీ కార్యకర్తలు కామెంట్ చేస్తున్నారు. ఏదేం అయినప్పటికీ వైసీపీ నుంచి విజయసాయి రెడ్డి రాజీనామా చేయడం పార్టీకి కొంత నష్టం చేకూరే అవకాశముందనే చెప్పవచ్చు.