Big Stories

YSRCP : టార్గెట్ జగన్, సజ్జల.. రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని వార్నింగ్..

YSRCP : వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు పడటం ఏపీ పాలిటిక్స్ ను హీటెక్కించింది. పార్టీ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా బయటకు వచ్చి పార్టీ అధిష్టానంపై విమర్శలు గుప్పిస్తున్నారు. సీఎం జగన్, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జలను టార్గెట్ చేస్తున్నారు.

- Advertisement -

ఆనం ఫైర్..
తాజాగా నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి.. వైసీపీ ప్రభుత్వంపై మరోసారి విమర్శలు చేశారు. నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నానని.. ఏనాడూ ప్రజాస్వామ్య విలువలు ఇంతలా దిగజారలేదని, అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలకు ఇలాంటి పరిస్థితి రావడం చాలా దారుణమని మండిపడ్డారు. ఎంతో మంది పెద్ద నేతలతో పనిచేశానని.. ఎప్పుడూ ఇలాంటి పరిస్థితులు ఎదురుకాలేదని తెలిపారు. ప్రజాస్వామ్య విలువలు తెలియని వ్యక్తులతో నాలుగేళ్లు నడిచినందుకు బాధపడుతున్నానని చెప్పారు. తాము అమ్ముడు పోయామని విమర్శలు చేసిన ప్రభుత్వ సలహాదారు రూ.వేల కోట్లు ఎలా సంపాదించారని ప్రశ్నించారు. ఇలాంటి చిల్లర వ్యవహారాలకు పాల్పడ్డామని భావిస్తే అది వాళ్ల ఖర్మే మండిపడ్డారు. రాజకీయ జీవితంలో నిందలు, ఆరోపణలు సహజమని.. అయితే మా గురించి తెలిసిన వారు వాటిని విశ్వసించరని అన్నారు.

- Advertisement -

క్రాస్‌ ఓటింగ్‌ను నిర్ధారించడం సీక్రెట్‌ బ్యాలెట్‌లో సాధ్యం కాదని ఆనం అన్నారు. ఈ ప్రభుత్వం ఏకఛత్రాధిపత్యంతో వ్యవహరిస్తోందన్నారు. చక్రవర్తులు, రాజుల తరహా పాలన జరుగుతోందని ఆరోపించారు. భజనపరులే కావాలనుకునే మనస్తత్వం వారిదని విమర్శించారు. గతంలో ముఖ్యమంత్రులు ప్రజాస్వామ్య విలువలతోపాటు పార్టీలోని వ్యక్తులను గౌరవించేవాళ్లన్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని స్పష్టం చేశారు. తన కుటుంబసభ్యులు ఎవరు రాజకీయాల్లోకి వస్తారనేది అప్పటి పరిస్థితులను బట్టి ఉంటుందని ఆనం రామనారాయణరెడ్డి చెప్పారు.

రిటర్న్ గిఫ్ట్ ఇస్తా: శ్రీదేవి
తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి వైసీపీ అధిష్టానంపై విమర్శలు గుప్పించారు. సీఎం జగన్‌, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాను అమ్ముడుపోయినట్లు ఆరోపణలు చేసిన వారికి త్వరలోనే రిటర్న్‌గిఫ్ట్‌ ఇస్తానని హెచ్చరించారు. వైసీపీ దందాలు, అక్రమ మైనింగ్‌కు బినామీగా ఉండలేనందునే తనను పార్టీ నుంచి తప్పించారని ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికలను బూచిగా చూపి తనను రోడ్డున పడేశారని మండిపడ్డారు.

జగన్‌కు చెవులు మాత్రమే ఉంటాయని.. ఎవరేమి చెప్పినా వింటారని శ్రీదేవి సెటైర్లు వేశారు. వైఎస్ఆర్ తనయుడి పార్టీ అంటే విలువలు ఉంటాయనుకున్నానన్నారు. పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తూ ఆయన కొట్టిన దెబ్బకు తన మైండ్‌ బ్లాక్‌ అయిందన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డితో ప్రాణహాని ఉందని ఆరోపించారు. మహిళా ఎమ్మెల్యేకు రక్షణ లేని పరిస్థితులు ఏపీలో నెలకొన్నాయని చెప్పారు. తాను ఓటుకు నోటు తీసుకున్నానని ముద్ర వేశారని మండిపడ్డారు. డబ్బులు తీసుకున్నానని నిరుపిస్తారా? అని సవాల్ చేశారు. అమరావతి మట్టిపై ప్రమాణం చేద్దామని స్పష్టంచేశారు. అమరావతి కోసం పోరాటం చేస్తానని శ్రీదేవి ప్రకటించారు. త్వరలో రాజకీయ భవిష్యత్ పై నిర్ణయం తీసుకుంటానని వెల్లడించారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News