Shyamala on TDP: కూటమి ప్రభుత్వంపై మరోసారి విరుచుకు పడింది వైసీపీ. ఏపీలో మహిళలపై అకృత్యాలు పెరుగుతున్నాయని ఆరోపించింది. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 74 మంది మహిళలపై అత్యాచారాలు జరిగాయని ఆరోపించారు ఆ పార్టీ మీడియా ప్రతినిధి శ్యామల.
మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టడంలో ప్రభుత్వం ఫెయిల్ అయ్యిందన్నారు. మంగళవారం మధ్యాహ్నం తాడేపల్లి పార్టీ ఆఫీసులో మీడియాతో మాట్లాడిన ఆమె, దిశ చట్టాన్ని మళ్లీ తీసుకురావాలని డిమాండ్ చేశారు.
దిశ చట్టాన్ని మళ్లీ తీసుకొస్తే.. వైసీపీకి మంచి పేరు వస్తుందని భావించి దాన్ని నిర్వీర్యం చేశారని దుయ్యబట్టారు శ్యామల. కూటమి పాలన చీకటి మయంగా మారిందని రుసరుసలాడారు. ప్రతీరోజూ ఏదో ప్రాంతంలో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని ఆరోపించారు.
కేవలం ప్రత్యర్థులను వేధించడానికే పోలీసులను వినియోగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారామె. ఇన్ని దారుణాలు జరుగుతున్నా, సీఎం చంద్రబాబుకు ఎలాంటి బాధ లేదన్నారు. వైసీపీ హయాంలో దిశ యాప్ ద్వారా 36 వేల మహిళలను కాపాడినట్టు చెప్పుకొచ్చారు.
ఆ యాప్‌ను కోటిన్నర మంది డౌన్ లోడ్ చేసుకున్నారని తెలిపారు. రాజకీయ కక్షలతో ఆ చట్టాన్ని పక్కన పెట్టేశారని ఆరోపించారు. దిశ చట్టం తీసుకొచ్చిన క్రమంలో దాన్ని సంబంధించిన పేపర్లను అనిత, నారా లోకేష్ తగలబెట్టిన ఫోటోలను చూపించారు.
ప్రభుత్వం ప్రకటనలకు పరిమితమైందన్నారు. చేతల్లో ఏమీ కనిపించలేదన్నారు శ్యామల. కూటమి అధికారంలోకి రాగానే కాల్‌మనీ కాలకేయులు తయారయ్యారని విమర్శించారు. ప్లీజ్.. ఇకనైనా దారుణాలు ఆపాలని కోరారు. ఇలాగే వ్యవహరిస్తామంటే వైసీపీ ఊరుకోదని, ప్రజాక్షేత్రంలో ఎండగడతామన్ని హెచ్చరించారామె.
ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 74 మంది అఘాయిత్యాలు జరిగాయని శ్యామల చెప్పినప్పటికీ, దానికి సంబంధించి ఎలాంటి డేటాను బయటపెట్టలేదు. కేవలం ఆరోపణలకే పరిమితమ య్యారు. గతంలో జగన్ కూడా ఇదే తరహా ఆరోపణలు చేశారు.
కూటమి అధికారంలోకి రాగానే 34 మందిని హత్య చేశారంటూ ఆరోపణలు చేశారే తప్పితే.. ఎలాంటి ఆధారాలు చూపించలేకపోయారు. అన్నట్లు శ్యామల మీడియా సమావేశానికి కొన్ని ఛానెళ్లకు చెందిన వారిని మాత్రమే పలిచినట్టు కనిపించింది.