Hyundai Sales October 2026: ఇండియన్ కార్ల మార్కెట్లో SUVలకు రోజురోజుకూ ఆదరణ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కొత్త మోడళ్లను తీసుకొస్తున్న కంపెనీలు అమ్మకాల విషయంలో దుమ్మురేపుతున్నాయి. తాజాగా హ్యుందాయ్ (Hyundai) విడుదల చేసిన బేయాన్ (Bayon) SUV కూడా తొలి నెలలోనే అమ్మకాల్లో కొత్త జోష్ కనబరిచింది. అక్టోబర్ 26న మార్కెట్లోకి వచ్చిన ఈ కారు.. నెల పూర్తికాకముందే భారీ సంఖ్యలో అమ్ముడైంది. మరోవైపు, ఇదే నెలలో హ్యుందాయ్ తన చరిత్రలోనే అత్యధిక నెలవారీ కార్ల అమ్మకాలను సాధించింది.
హ్యుందాయ్ బేయాన్ కోసం సెప్టెంబర్ 23 నుంచే బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. అక్టోబర్ 26న అధికారికంగా మార్కెట్లోకి తీసుకొచ్చారు. ఆ నెలలోనే ఈ SUVకి సంబంధించి 3,449 యూనిట్లను డీలర్లకు పంపించింది. అక్టోబర్‌లో హ్యుందాయ్ మొత్తం 62,799 కార్లను డీలర్లకు పంపించింది. ఇందులో బేయాన్ వాటా సుమారు 5 శాతంగా ఉంది. కంపెనీ SUVల అమ్మకాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటే బేయాన్ వాటా 8 శాతంగా నమోదైంది.
సుమారు 4.2 మీటర్ల పొడవు కలిగిన బేయాన్ SUVని హ్యుందాయ్ చెన్నై ప్లాంట్‌లో తయారు చేస్తోంది. భారత్‌తో పాటు 50కి పైగా దేశాలకు ఎగుమతి చేయడానికి ఈ కారును ఉత్పత్తి చేస్తున్నారు. హ్యుందాయ్ SUVల శ్రేణిలో క్రెటా కంటే దిగువ స్థానంలో ఉంటుంది. దీని ధరలు రూ.10 లక్షల నుంచి రూ.18.15 లక్షల మధ్య ఉన్నాయి. ఇందులో 1.5 లీటర్ నాలుగు సిలిండర్ల పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 115hp పవర్, 144Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ మాన్యువల్, CVT ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. వచ్చే 2027 జనవరిలో బేయాన్ CNG వెర్షన్‌ను కూడా తీసుకురావాలని కంపెనీ భావిస్తోంది. అదే జరిగితే హ్యుందాయ్ నుంచి వచ్చే తొలి CNG మిడ్‌సైజ్ SUVగా గుర్తింపు తెచ్చుకుంది.
అక్టోబర్ 2026లో హ్యుందాయ్ మోడళ్ల అమ్మకాలను పరిశీలిస్తే.. క్రెటా 17,955 యూనిట్లతో మొదటి స్థానంలో నిలిచింది. వెన్యూ 13,017 యూనిట్లతో రెండో స్థానంలో ఉండగా, ఎక్స్టర్ 8,509 యూనిట్లతో మూడో స్థానాన్ని దక్కించుకుంది. ఆ తర్వాత ఆరా 7,349 యూనిట్లు, i20 5,528 యూనిట్లు, గ్రాండ్ i10 నియోస్ 5,458 యూనిట్ల అమ్మకాలను నమోదు చేశాయి. కొత్తగా వచ్చిన బేయాన్ 3,449 యూనిట్లతో ఏడో స్థానంలో నిలిచింది.
అక్టోబర్‌లో హ్యుందాయ్ మొత్తం 62,799 ప్యాసింజర్ వాహనాలను డీలర్లకు పంపించింది. గత ఏడాది ఇదే నెలలో నమోదైన 53,792 యూనిట్లతో పోలిస్తే ఇది 17 శాతం ఎక్కువ. అలాగే, 2026 ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు కంపెనీ 3,67,945 కార్లను విక్రయించింది. గత ఏడాదితో పోలిస్తే ఇది 13 శాతం వృద్ధి. బేయాన్ కు లభించిన తొలి నెల స్పందన హ్యుందాయ్ కి కొత్త జోష్ ను ఇచ్చింది. క్రెటా, బేయాన్ మోడళ్ల అమ్మకాలను 2027లో కలిపి 2.5 లక్షల యూనిట్లకు చేర్చాలని కంపెనీ టార్గెట్ గా పెట్టుకుంది.
Read Also: కియా సైరోస్ EV vs టాటా నెక్సాన్ EV.. రేంజ్ టెస్ట్‌లో గెలిచిందెవరో తెలుసా?