Kia Sorento: ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా ఇండియా తన ప్రీమియం ఎస్‌యూవీ సోరెంటోతో మార్కెట్ లో దూసుకెళ్తోంది. 2026 సెప్టెంబర్‌లో బుకింగ్‌లు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 4,500కు పైగా హోల్‌సేల్ యూనిట్లను అమ్మినట్లు కంపెనీ ప్రకటించింది. ఇందులో ఒక్క సెప్టెంబర్ నెలలోనే 1,739 యూనిట్లను డీలర్లకు పంపించింది. కస్టమర్ల నుంచి వస్తున్న ఆదరణతో పాటు బ్రాండ్‌పై పెరుగుతున్న నమ్మకం ఈ అమ్మకాలకు కారణమని కంపెనీ తెలిపింది. అమ్మకాల మైలురాయితో పాటు సోరెంటో కొనుగోలుదారుల కోసం ప్రత్యేక ఓనర్‌షిప్ ప్రయోజనాలను కూడా కియా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో అష్యూర్డ్ బైబ్యాక్ ప్రోగ్రామ్, ప్రీమియం సర్వీస్ ప్రోగ్రామ్ ను పరిచయం చేసింది.
కియా సోరెంటో కొనుగోలుదారుల కోసం తీసుకొచ్చిన అష్యూర్డ్ బైబ్యాక్ ప్రోగ్రామ్ ప్రత్యేక ఆకర్షణగా ఉంది. ఈ స్కీమ్ ప్రకారం, నిర్దేశించిన మైలేజ్ పరిమితులు, నిబంధనలకు లోబడి మూడు సంవత్సరాల తర్వాత కారు విలువలో 70 శాతం వరకు తిరిగి పొందే అవకాశం ఉంటుంది. దీంతో భవిష్యత్తులో కారును అమ్మాలనుకునే వారికి కొంత భరోసా లభిస్తుంది.
సోరెంటో యజమానులకు మెరుగైన ఆఫ్టర్ సేల్స్ సర్వీసులు అందించేందుకు కియా స్పెషల్ ప్రీమియం సర్వీస్ ప్రోగ్రామ్‌ను తీసుకొచ్చింది. ఇందులో ప్రతి కస్టమర్‌కు ఒక ప్రత్యేక సర్వీస్ అడ్వైజర్ అందుబాటులో ఉంటారు. అలాగే ప్రత్యేక కస్టమర్ ఇంటరాక్షన్ డెస్క్, ప్రయారిటీ సర్వీస్ బే ద్వారా వెహికల్ సర్వీసింగ్‌ను వేగంగా పూర్తి చేసేలా ఏర్పాట్లు చేశారు. అంతేకాదు, 90 నిమిషాల్లో సర్వీసింగ్ పూర్తి చేసే ఎక్స్ ప్రెస్ సర్వీస్ సదుపాయం కూడా ఉంది. దీనికి అదనంగా ముందస్తు అపాయింట్‌మెంట్, పికప్, డ్రాప్ సౌకర్యాలను కల్పిస్తున్నారు.
కియా సోరెంటో రెండు రకాల పవర్‌ట్రెయిన్ ఎంపికలతో అందుబాటులో ఉంది. ఇందులో మొదటిది 1.6 లీటర్ టర్బో పెట్రోల్ హైబ్రిడ్ ఇంజిన్. ఇందులో 180hp శక్తిని అందించే పెట్రోల్ ఇంజిన్‌కు 65hp ఎలక్ట్రిక్ మోటార్ యాడ్ చేశారు. ఈ రెండూ కలిసి 230hp పవర్, 380Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తాయి. దీనికి 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఉంటుంది. మరోవైపు 2.2 లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్ 193hp పవర్, 442Nm టార్క్ ను అందిస్తుంది. దీనికి 8 స్పీడ్ DCT గేర్‌బాక్స్ జత చేశారు. రెండు ఇంజిన్ ఎంపికల్లోనూ FWD, AWD డ్రైవ్ ఆప్షన్లు ఉన్నాయి.
కియా సోరెంటో ధరలు రూ.27.99 లక్షల నుంచి రూ.39.99 లక్షల వరకు ఉన్నాయి. మార్కెట్లో జీప్ మెరిడియన్, స్కోడా కోడియాక్, ఫోక్స్‌వ్యాగన్ టాయ్రాన్ లావటి ప్రీమియం ఎస్‌యూవీలకు ఇది పోటీ ఇస్తోంది. 4,500 యూనిట్ల మైలురాయిపై స్పందించిన కియా ఇండియా మార్కెటింగ్ అండ్ సేల్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అతుల్ సూద్, కస్టమర్ల నుంచి లభిస్తున్న ఆదరణ, బ్రాండ్‌పై పెరుగుతున్న విశ్వాసానికి ఈ విజయం నిదర్శనమన్నారు.
Read Also: ఒకప్పుడు సామాన్యుల కారు.. ఇప్పుడు ప్రపంచ స్థాయి గుర్తింపు.. మారుతి 800కు అరుదైన గౌరవం!